KTR | హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ)/సిరిసిల్ల రూరల్: ‘మహేశ్.. నాలుగు రోజులు ధైర్యంగా ఉండు. సాదీలో ఉన్న మనోళ్లు నీ దగ్గరకు వస్తరు. నిన్ను నాలుగు రోజుల్లోనే మండెపల్లికి తీసుకు వస్తా’ అని సౌదీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి దవాఖానలో చికిత్స పొందుతున్న మహేశ్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు భరోసానిచ్చారు.
పొట్ట చేత పట్టుకొని జీవనోపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లిన మండేపల్లి గ్రామానికి చెందిన మహేశ్, అక్కడ ఒక కంపెనీ బస్సులో పనికి వెళ్తుండగా.. రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా.. మహేశ్ మాత్రం బతికాడు. కానీ, తీవ్ర గాయాలపాలయ్యాడు. ప్రస్తుతం సౌదీలోని జుబెయిల్ జనరల్ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. డబ్బులు లేక సరైన వైద్యం అందక, మహేశ్ పరిస్థితి విషమంగా మారుతున్నది. ఈ విషయం తెలుసుకున్న కేటీఆర్.. మండేపల్లిలోని మహేశ్ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. మహేశ్ చికిత్సకు అవసరమైన వైద్య ఖర్చులు, విమాన ప్రయాణ ఖర్చులు మొత్తం తానే భరిస్తానని, ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. వారి సమక్షంలోనే సౌదీ దవాఖానలో ఉన్న మహేశ్‌తో వీడియో కాల్ చేసి మాట్లాడారు.
Ktr2
‘మహేశ్ నాలుగు రోజులు ధైర్యంగా ఉండు. సౌదీలో ఉన్న మన టీం సభ్యులు వచ్చి నిన్ను కలుస్తరు. మాట్లాడుతరు. అధైర్యపడకు. నేనున్నా. అన్నీ చూసుకుంటా. నిన్ను మండెపల్లికి తీసుకువస్తా’ అంటూ ధైర్యం చెప్పారు. సౌదీ దవాఖానలో డిశ్చార్జి చేయించి, సొంత ఖర్చులతో మండెపల్లికి తీసుకువస్తానని మహేశ్‌కు వివరించారు. రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందడం, మహేశ్ ప్రాణాలతో బతకడం అదృష్టమని పేర్కొన్నారు. సౌదీలో ఉన్న పార్టీ ప్రతినిధులు, పరిచయాలు ఉన్న వారిని వెంటనే మహేశ్ వద్దకు పంపించిన కేటీఆర్.. ఆయనకు అండగా ఉండేలా చర్యలు తీసుకున్నారు. మహేశ్ స్వస్థలానికి వచ్చే ప్రక్రియలో అవసరమైన అధికారిక కార్యక్రమాల సమన్వయం కోసం తెలంగాణ ఎన్నారై శాఖ, విదేశాంగ శాఖ అధికారులకు లేఖ రాశారు. కేటీఆర్ ఆయన వెంట డాక్టర్ నక్క రవి, రాగిపెల్లి కిష్టారెడ్డి, బండి భాస్కర్, పెద్ది వెంకటేశ్, నేవూరి రాం, ప్రశాంత్, పరశురాములు, నేవూరి నవీన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.