KTR | హైదరాబాద్ : దివంగత మాగంటి గోపీనాథ్ కుటుంబానికి జూబ్లీహిల్స్ ప్రజలు అండగా నిలబడాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ భవన్లో జరిగిన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహ్మత్ నగర్ డివిజన్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.
దివంగత నేత మాగంటి గోపినాథ్‌ను స్మరించుకున్న కేటీఆర్, ఎవరూ కోరుకోని ఉప ఎన్నిక ఇదన్నారు. గోపినాథ్ హఠాత్తుగా దూరమవుతారని ఊహించలేదని చెప్పారు. తన ఇబ్బందులను గోపినాథ్ ఎన్నడూ తమతో పంచుకోలేదన్నారు. రాజకీయ నాయకుల జీవితాలు బయటకి కనిపించేలా ఉండవన్న విషయం గోపినాథ్ కుటుంబాన్ని చూస్తే అర్థమవుతుందన్నారు. జూబ్లీహిల్స్‌లో ఏ ఒక్కరికి కష్టమొచ్చినా ఆదుకుని ప్రజల కోసం ఎన్నో మంచి పనులు చేసిన గోపినాథ్ కుటుంబానికి జూబ్లీహిల్స్ ప్రజలు అండగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ సత్తా చూపిస్తామని పీజేఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారన్న కేటీఆర్, నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ పరిస్థితి మెరుగ్గా ఉందని పలు సర్వేలు చెబుతున్నాయన్నారు. కార్యకర్తలు మరింత ఉత్సాహంతో పనిచేసి బంపర్ మెజార్టీ కోసం కృషి చేయాలని సూచించారు. గత ఎన్నికల్లో హైదరాబాద్ నగరంలోని అన్ని సీట్లను గెలిపించి ప్రజలు బీఆర్ఎస్కు అండగా నిలిచారన్న కేటీఆర్, అదే స్ఫూర్తితో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించుకుని, హైదరాబాద్ గులాబీ అడ్డా అన్న సందేశాన్ని దేశానికి ఇవ్వాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఈ నెల 14వ తేదీలోపు ప్రతి ఇంటికి వెళ్లి గోపినాథ్ చేసిన పనులు, సేవలను ఓటర్లకు గుర్తుచేయాలని సూచించారు. బీఆర్ఎస్ అభిమానులు, సానుభూతిపరుల ఓట్లు గల్లంతైతే వెంటనే నమోదు చేయాలని సూచించారు. యుద్ధంలా పోరాడితేనే విజయం సాధ్యమవుతుందని కార్యకర్తలకు దిశానిర్దేశనం చేశారు.
ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, రహ్మత్ నగర్ డివిజన్ ఇంచార్జీ తక్కళ్లపల్లి రవీందర్ రావు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, పి. విష్ణువర్ధన్ రెడ్డి, కోరుకంటి చందర్, దివంగత మాగంటి గోపినాథ్ సతీమణి మాగంటి సునీతతో పాటు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.