 
                                                            KTR | హైదరాబాద్ : నాలుగు లక్షల మంది జూబ్లీహిల్స్ ఓటర్లకు 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల గోస తీర్చే అవకాశం మీ చేతికి వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. షేక్‌పేట్ డివిజన్లో నిర్వహించిన రోడ్‌షోలో కేటీఆర్ పాల్గొని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా ప్రసంగించారు.
రేవంత్ రెడ్డి రోత మాటలు, పనికిమాలిన భాష మాట్లాడుతున్నాడు. హామీలపై ప్రజలు నిలదీస్తే వారిని దబాయిస్తూ మీరు నన్ను ఏం చేస్తారు కోసుకు తింటారా… కొడుతారా..? అని హుంకరిస్తున్నరు. ఇది కుటుంబ పెద్దకు ఉండాల్సిన లక్షణమా..? అని రేవంత్ రెడ్డిని కేటీఆర్ నిలదీశారు.
ఎన్నికలు వస్తాయి.. పోతాయి. 4 లక్షల మంది జూబ్లీహిల్స్ ఓటర్లకు 4 కోట్ల తెలంగాణ ప్రజల గోస తీర్చే అవకాశం మీ చేతికి వచ్చింది. మీరు జూబ్లీహిల్స్‌లో గట్టి తీర్పు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ జప్తు చేస్తే కచ్చితంగా 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాల్సిన పథకాలన్నీ బ్రహ్మాండంగా ప్రజలకు అందుతాయి. కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతు కావాలి. పెన్షన్లు, తులం బంగారం, స్కూటీలు, 2500 రావాలంటే కాంగ్రెస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
 
                            