హైదరాబాద్, ఏప్రిల్ 3(నమస్తే తెలంగాణ): దేశంలో నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, దీనికి బాధ్యులెవరని మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. యూపీఏ హయాంలో ధరల పెరుగుదలకు అవినీతి కారణమని అప్పట్లో విమర్శించిన మోదీ ఇప్పుడేమని సమాధానం చెప్తారని బుధవారం ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. గడచిన పదేండ్లలో క్రూడ్ ఆయిల్ ధరలు గణనీయంగా తగ్గినా పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం భారీగా పెరిగాయని పేర్కొన్నారు. 2014 నుంచి దశాబ్దకాలంలో క్రూడ్ ఆయిల్ ధరలు 20 డాలర్లమేర తగ్గాయని, కానీ ఈ పదేండ్లలో పెట్రోల్ ధరలు లీటరుకు రూ. 35, డీజిల్ ధరలు లీటరుకు రూ. 40 చొప్పున పెరిగినట్టు వివరించారు. దీనికి బాధ్యులెవరని, ఎవరిని నిందించాలని ప్రశ్నించారు.
పెరిగిన పెట్రో ధరల వల్ల నిత్యావసర ధరల ఆకాశాన్నంటుతున్నాయని, దీనికి ఎవరిని బాధ్యులను చేయాలని నిలదీస్తూ 2014 నాటి ధరలను, ఇప్పటి పెట్రో ధరల వివరాలను ఎక్స్‌లో షేర్ చేశారు. అప్పట్లో గుజరాత్ సీఎంగా ఉన్న మోదీ అప్పటి యూపీఏ ప్రభుత్వంపై చేసిన విమర్శలను ఈ సందర్భంగా గుర్తుచేశారు. ‘ప్రస్తుతం రూపాయి ఐసీయూలో ఉంది. రూపాయి రికవర్ అవుతున్నదని మూడు నెలలుగా చెప్తున్నారు. కానీ ఏమీ చేయలేకపోతున్నారు. ఢిల్లీలో కూర్చున్నవారు అవినీతిలో బిజీగా ఉండడం వల్లే రూపాయి పతనమవుతున్నది’ అంటూ అప్పట్లో మోదీ చేసిన ట్వీట్‌ను కేటీఆర్ పోస్ట్‌చేశారు. ప్రస్తుతం పెట్రో ధరల పెరుగుదలవల్ల రూపాయి గతంలో ఎన్నడూ లేనంతగా పతనమైందని నిపుణులు చెబుతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.