హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ): గోడ దూకిన ఎమ్మెల్యేలను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ ఎన్నిసార్లు విఫలయత్నం చేసినా ప్రయోజనంలేదని, వాళ్లంతా ప్రజాకోర్టులో ఎప్పుడో ‘మాజీ’లు అయిపోయారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను నిస్సిగ్గుగా వెనుకేసుకొస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజ్యాంగాన్ని పరిహాసం చేస్తూ అడుగడుగునా తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, పోచారం శ్రీనివాస్‌రెడ్డిపై వేటు వేయాల్సిన స్పీకర్.. వ్యవస్థను రాజకీయ ఒత్తిళ్లతో భ్రష్టు పట్టించారని, కాంగ్రెస్ పార్టీ తన దిగజారుడుతనాన్ని మరోసారి చాటుకున్నదని గురువారం ఒక ప్రకటనలో విమర్శించారు.
గతంలోనూ ఐదుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటుపడకుండా అడ్డుపడిన అప్రజాస్వామిక శక్తులే ఇవాళ కూడా రాజ్యాంగ విలువలను నిలువునా పాతరేశాయని మండిపడ్డారు. వారు పార్టీ మారినట్టు కండ్లముందు కోటి సాక్ష్యాలు కనిపిస్తున్నా ఆధారాలు లేవనడం పవిత్రమైన శాసనసభను కూడా అవమానించడమేనని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగంపైనే కాదు, చివరికి అత్యున్నత న్యాయస్థానాలపై కూడా గౌరవం లేదని మరోసారి తేలిపోయిందని విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు కర్రుగాల్చి వాత పెట్టడంతో ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉపఎన్నికలకు వెళ్లేందుకు అధికార పార్టీ వణికిపోతున్నదని తాజా తీర్పుతో తేటతెల్లమైందని పేర్కొన్నారు. ప్రజాతీర్పును అవమానించిన జంప్ జిలానీలకూ, గడప గడపకూ వెళ్లి వారికి కాంగ్రెస్ కండువాలు కప్పిన ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పే దాకా బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని స్పష్టంచేశారు.