KTR | సూర్యాపేట : సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి చెప్పిన ఏతుల వెంకటయ్య కథ విని కాంగ్రెస్ ప్రభుత్వానికి బర్దాష్ కాలేదు.. అందుకే ఆయనను సస్పెండ్ చేశారు అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. మరి ఇది అసెంబ్లీ.. గాంధీ భవన్ కాదు అన్న ఎంఐఎం ఎమ్మెల్యేపై చర్యలు తీసుకునే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా..? అని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. సూర్యాపేటలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
స్పీకర్ పదవికి కుల, మత పట్టింపులు ఉండవు. స్పీకర్ పదవి అంటే బీఆర్ఎస్కు ఎంతో గౌరవం. ప్రసాద్ కుమార్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడంలో మా పాత్ర కూడా ఉంది. శాసనసభ మన అందరిదీ అన్న జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేస్తే, గాంధీభవన్ లెక్క సభను నడుపుతున్నారని అన్న అక్బరుద్దీన్ ఓవైసీ మీద చర్యలు తీసుకోలేదు. మజ్లిస్ మీద చర్య తీసుకునే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదా..? పంచ పాండవుల మాదిరి ఆ కౌరవసభలో 100 మందిని ఎదుర్కొంటున్నది కేసీఆర్ గులాబీ దండు మాత్రమే అని కేటీఆర్ తెలిపారు.
ప్రతి గ్రామం నుంచి వరంగల్ సభకు కార్యకర్తలు తరలి రావాలి. గులాబీ జెండా కప్పుకున్న ప్రతి బిడ్డ వరంగల్ రావాలి. వరంగల్ సభ తర్వాత మే నెలలో పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభమవుతుంది. కొత్త కమిటీలను పటిష్టంగా నిర్మించుకుందాం. గ్రామస్థాయి వార్డు స్థాయి, బూత్ స్థాయి, రాష్ట్ర కమిటీ దాకా అద్భుతంగా కమిటీలను ఏర్పాటు చేసుకుందాం. కష్టకాలంలో పార్టీనే నమ్ముకొని ఉన్న వారికే పెద్దపీట వేస్తాం. వారికే అవకాశాలు ఇస్తాం. చిన్న పెద్ద అనే తేడా పార్టీలో లేదు. పార్టీ ఆఫీసులను చైతన్య కేంద్రంగా మార్చుకొని కార్యకర్తలకు అద్భుతంగా శిక్షణ ఇస్తాం అని కేటీఆర్ స్పష్టం చేశారు.
చివరి సంవత్సరంలో ఏదో ఒక పథకం ఇచ్చినట్టు చేస్తే ప్రజలు తమనే మళ్లీ గెలిపిస్తారన్న నమ్మకంతో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. ఈ విషయాలను ప్రజలకు అర్థమయ్యేలా గులాబీ కార్యకర్తలే చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలంటే కేసీఆర్ లాగా ప్రతీ కార్యకర్త కథానాయకుడిలాగా విజృంభించాలి. ఏప్రిల్ 27 నాడు దానికి తొలి అడుగు పడాలి. ఈ సంవత్సరం అంతా బీఆర్ఎస్ పోరాటనామ సంవత్సరం అని కేటీఆర్ పేర్కొన్నారు.