ప్రజల కోసం మరింత కష్టపడి పనిచేస్తం. కాంగ్రెస్, బీజేపీలతో పోరాడుతూనే ఉంటం. 2014, 2018లో ఒంటరిగా అధికారంలోకి వచ్చినం. 2023లో 1.8 శాతం ఓట్ల తేడాతో ఓడిపోయినం. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సారి ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడుతం. తప్పకుండా తిరిగి అధికారంలోకి వస్తం.
-కేటీఆర్
హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ) : వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు 150 సీట్లకు మించి రావని, కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే వస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తంచేశారు. సంకీర్ణ ప్రభుత్వంలో ప్రధాన ప్రాంతీయ పార్టీలే కీలక భాగస్వాములుగా ఉంటాయని తేల్చిచెప్పారు. అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలపై నిత్యం నిలదీస్తున్నందునే తనపై సీఎం రేవంత్‌రెడ్డి డ్రగ్స్, అవినీతి అం టూ అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తాను జీవితంలో కనీసం సిగరెట్ కూడా తాగలేదని, పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నా.. ఎలాంటి డ్రగ్స్ అలవాటు లేదని స్పష్టంచేశారు. తన ఫెయిల్యూర్‌ను కప్పిపుచ్చుకోడానికి ప్రతిపక్ష నేతలపై రేవంత్‌రెడ్డి బురదజల్లుతున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో తామే అధికారంలోకి వస్తామని, అనంతరం ఇతర రాష్ర్టాలపైనా దృష్టి పెడతామని చెప్పారు. ఇప్పుడు ఇంత బలంగా కనిపించిన బీజేపీకి కూడా గతంలో ఇద్దరు ఎంపీలే ఉన్నారని గుర్తుచేశారు. ‘దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పోట్లాడుతున్నాయి.. కానీ తెలంగాణలో కలిసి పనిచేస్తున్నయి’ అని విమర్శించారు. ‘ది దేశ్‌భక్త్’ చానల్లో ‘దేశ్‌భక్త్ సంభావన్’ పేరిట ఆకాశ్ బెనర్జీ జరిపిన ఇంటర్వ్యూలో కేటీఆర్ అనేక అంశాలపై విస్పష్టంగా సమాధానాలిచ్చారు. లోక్‌సభ స్థానాల సంఖ్య పెంపుపై (డీలిమిటేషన్) అందరికీ ఒకే విధానం ఉండాలని చెప్పారు. యూపీలో రెండు శాతం సీట్లు పెంచితే, తెలంగాణలో కూడా రెండు శాతం సీట్ల పెంచాల్సిందేనని డిమాండ్ చేశారు. హిందీని దక్షిణాది రాష్ర్టాలపై బలవంతంగా రుద్దడం తగదని, తెలుగు, తమిళం, కన్నడను ఉత్తరాది రాష్ర్టాల్లో మూడో భాషగా చేరుస్తారా? అని నిలదీశారు. మనదేశం విభిన్న సంస్కృతుల సమ్మేళనమని, విభిన్న రాష్ర్టాల, పార్టీల సమ్మేళనమని, అదే మన బలం, బలగమని చెప్పారు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నంత వరకు దేశంలో ఎలాంటి చీలికలు రాబోవని స్పష్టంచేశారు.
నా జీవితంలో ఎన్నడూ సిగరెట్ కూడా తాగలేదు. నాకు ఎలాంటి డ్రగ్స్ అలవాటు లేదు. నా పిల్లల మీద ఒట్టేసి చెప్తున్న. డ్రగ్స్ ఏనాడూ తీసుకోలేదు.
ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి ఓట్లు పొంది రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చారు. అడ్డగోలు హామీలిచ్చి వాటిని అమలుచేయ చేతగాక, తన ఫెయిల్యూర్‌ను ప్రజలకు కనిపించకుండా ఉండేందుకు ప్రతిపక్ష నేతలపై బురదజల్లుతున్నారు. ఆడలేక పాత గజ్జెలు అన్నట్టు.. ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ రీట్వీట్ చేసిన యువకుడిని 20 రోజులు జైలుకు పంపిన ఘటన ఎక్కడైనా చూశారా? తెలంగాణ ప్రభుత్వం అదే చేస్తున్నది. ప్రభుత్వాన్ని నేను విమర్శిస్తే నాపై అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారు. ఒకసారి ఫోన్ ట్యాప్చేశానంటారు. మరోసారి డ్రగ్స్ తీసుకున్నానంటారు. ఇంకోసారి అవినీతికి పాల్పడిన అంటారు. 7-8 గంటలు విచారణ పేరుతో వేధిస్తున్నరు. నేను తప్పు చేశానని ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలని చూస్తున్నరు. కానీ, నేను ఎలాంటి తప్పు చేయలేదు. నాపై చేస్తున్న ఆరోపణలకు సంబంధించి వారి దగ్గర ఎలాంటి ఆధారం, సాక్ష్యం లేదు.
డీలిమిటేషన్ చేయాలనుకుంటే ప్రజలకు సమీపంగా ఉండే ఎమ్మెల్యేల సీట్లు పెంచండి. ప్రజలకు ఫస్ట్ ప్రొటోకాల్ ఎమ్మెల్యేనే.. ఎంపీ కాదు. ఎంపీల సంఖ్య పెంచాలనుకుంటే అందరికీ ఒకే విధానం అమలుచేయండి. ఉత్తరప్రదేశ్‌లో 2 శాతం సీట్లు పెంచితే, తెలంగాణలో కూడా అలానే పెంచాలి. అలా కాకుండా చేస్తే ప్రజలు తిరగబడుతరు. ఉత్తరాదిరాష్ర్టాలపై పట్టున్నది కాబట్టి ఉత్తరభారతం నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానంటే కుదరదు. కచ్చితంగా దక్షిణ భారత ప్రజలు కేంద్రాన్ని నిలదీస్తరు. కొట్లాడుతరు.
–కేటీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు కావస్తున్నది. ఇంకా ఎన్ని రోజులు అవినీతి ఆరోపణలు చేస్తారు. అధికారంలో ఉన్నది వాళ్లే కదా? అవినీతి జరిగితే నిరూపించాలి. అడ్మినిస్ట్రేషన్, ఏజెన్సీలు వాళ్ల చేతుల్లోనే ఉన్నయి. హోంశాఖ సీఎం వద్దే ఉన్నది. అవినీతిపై ఆధారాలుంటే నిరూపించి జైలులో వేయండి.
కాంగ్రెస్ నేతలను ఎవరూ ఆపడం లేదు కదా?
పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు ఎంతో బాధ్యతగా పనిచేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వాన్ని అన్ని రకాలుగా ప్రజల తరఫున అడుగవచ్చు. ప్రశ్నించవచ్చు. సవాల్ విసరవచ్చు. అంతకు మించి ప్రతిపక్ష బాధ్యతలను పోషిస్తున్నం. ప్రభుత్వం వెంట పడుతున్నం. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూనే ఉంటం. రోజూ నిలదీస్తూనే ఉన్నాం. ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం లేదు. అందుకే మాపై అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నరు. ఈ స్కామ్, ఆస్కామ్ అని వేధిస్తున్నరు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కాబట్టి మా ప్రత్యర్థి కాంగ్రెస్. జాతీయ స్థాయిలో బీజేపీతో రాజకీయంగా ఏకాభిప్రాయం కలిగి ఉండము.
ఉత్తర, దక్షిణ ప్రాంతాల కలయిక తెలంగాణ. దేశ చిత్రపటాన్ని గమనిస్తే మేము మధ్యలో ఉంటాం. దోశ, పరోటా కలిసినట్టుగా ఉండేదే హైదరాబాద్. దేశానికి ఒక జాతీయభాష ఉండాల్సిన అవసరం లేదు. దేశంలో 22 అధికార, సుమారు 300కు పైగా అనధికారిక భాషలు ఉన్నాయి. లిపిలేని భాషలు కూడా కొన్ని ఉన్నాయి. ప్రతి 250 కిలోమీటర్లకు మనదేశంలో భాష, సంస్కృతి, ఆహారం, ఆహార్యం తీరు మారుతాయి. ఇలాంటి దేశంలో ఇది తినవద్దు, ఇది మాట్లాడవద్దు, ఇదే మాట్లాడాలి అంటే ఎవ్వరూ ఒప్పుకోరు. బీజేపీ బలవంతంగా దేశంపై హిందీని రుద్దాలని భావిస్తే తిరుగుబాటు వస్తుంది. మాకు పెద్దగా ఇబ్బంది లేదు. తెలంగాణలో చాలా మంది హిందీ మాట్లాడుతరు. అర్థం చేసుకుంటరు. ఒకవేళ హిందీని దక్షిణాది రాష్ర్టాల్లో అమలు చేయాలనుకుంటే, ఉత్తరాది రాష్ర్టాల్లో తెలుగు, తమిళం, కన్నడ, బెంగాళీ భాషలను అక్కడ అమలు చేస్తరా? ఉత్తరాదిన మూడో భాషగా వీటిని అమలుచేస్తారా? అమలుచేయరు కదా? మరి హిందీని మాపై బలవంతంగా ఎందుకు రుద్దాలని చూస్తున్నరు? నేర్చుకోవాలని ఆసక్తి ఉంటే నేర్చుకోవచ్చు. ఎవరైనా తమ భాష నేర్చుకోవాలని బలవంతం చేయవద్దు.
అలాంటిదేం లేదు. కొన్ని రాజకీయ అంశాలు బయటకు కనిపిస్తయి. మరికొన్ని కనిపించవు. భారత ప్రజలకు అన్ని వసతులు ఉన్నాయి. ఉద్యోగానికి వెళ్తున్నామా? కుటుంబాన్ని పోషించుకుంటున్నామా? అనే చూస్తారు తప్ప ఇలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకోరు. అవసరం అనుకుంటే భాష నేర్చుకుంటారు. లేదనుకుంటే నేర్చుకోరు. అంతేతప్ప ప్రభుత్వం నుంచి గానీ, పార్టీ నుంచి గానీ ఈ భాష మాట్లాడాల్సిందేనని రుద్దాల్సిన అవసరం లేదు. హిందీతోపాటు ఇతర రాష్ర్టాల్లో తమ రాష్ట్ర భాషే మాట్లాడాలని బలవంతం చేయడం కూడా తప్పే.
తెలంగాణలో కేసీఆర్, బెంగాల్లో మమత, తమిళనాడులో స్టాలిన్ ఇలా దేశంలో 13 ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నయి. ఈ పార్టీలు ఏ కూటమిలోనూ కలవవు. ఎన్డీయేతోగాని, ఇండియాతో గాని కలవవు. ఇవి ప్రధాన పార్టీలతో ఎన్నికల్లో పోటీపడుతయి. 16 ఎంపీ సీట్లతో ఏపీ సీఎం చంద్రబాబు, 12 మంది ఎంపీలతో నితీశ్ ఏం చేస్తున్నారో గమనిస్తున్నం. నాకు నమ్మకం ఉన్నది. రాబోయే రోజుల్లో ప్రజలు ప్రాంతీయ పార్టీలనే విశ్వసిస్తరు. ప్రాంతీయ పార్టీయే దేశాన్నేలే పరిస్థితి వస్తది.
–కేటీఆర్
బీజేపీని అడ్డుకున్నవి ప్రాంతీయ పార్టీలే కదా? ఢిల్లీలో బీజేపీ మొత్తం ఆగిపోయింది. తెలంగాణలో కేసీఆర్, బెంగాల్లో మమత, తమిళనాడులో స్టాలిన్ ఇలా దేశంలో 13 ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నయి. ఈ పార్టీలు ఏ కూటమిలోనూ కలవవు. ఎన్డీయేతోగానీ, ఇండియాతో గానీ కలవవు. ఏపీలో వైఎస్సార్సీపీ, కేరళలో సీపీఎం.. ఇవి ప్రధాన పార్టీలతో ఎన్నికల్లో పోటీపడతాయి. 16 ఎంపీ సీట్లతో ఏపీ సీఎం చంద్రబాబు ఏం చేస్తున్నాడో చూస్తున్నాం. 12 మంది ఎంపీలతో నితీశ్ ఏం చేస్తున్నారో గమనిస్తున్నాం. నాకు నమ్మకం ఉన్నది. రాబోయే రోజుల్లో ప్రజలు ప్రాంతీయ పార్టీలనే విశ్వసిస్తరు. ప్రాంతీయ పార్టీయే దేశాన్నేలే పరిస్థితి ఉంటుంది.
ఏ ప్రాంతీయ పార్టీ నాయకుడైనా బీజేపీలో చేరితే అన్ని కేసులూ మాఫ్ అవుతున్నయి. హిమంత బిశ్వశర్మ, సీఎం రమేశ్, సుజనా చౌదరిపై కేసులు ఉండె. బీజేపీలోకి వెళ్లగానే మాఫీ అయినయి. బీజేపీ మాపైకి ఈడీని పంపితే కాంగ్రెస్ ఖుషీ చేసుకుంటది. అదే బీజేపీ కాంగ్రెస్ నేతలపైకి ఈడీని పంపితే వ్యతిరేకిస్తున్నది. కాంగ్రెస్, బీజేపీలు ఏజెన్సీలను ఒకే తీరుగా వాడుకుంటున్నయి. థర్డ్ పార్టీ, ప్రాంతీయ పార్టీలపై ఏజెన్సీలను వదులుతాయి. సీబీఐని గతంలో కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అన్నారు. ఇప్పుడు బీజేపీ కూడా ఈడీని తన టూల్‌గా వాడుకుంటున్నది. రాజకీయ ప్రయోజనాల కోసం రెండు పార్టీలు కేంద్ర ఏజెన్సీలను వాడుకుంటున్నయి.
ఇప్పడు తెలంగాణలో అధికారంలో ఉన్నది నిజమైన కాంగ్రెస్ కాదు. పైన బడా మోదీ, కింద చోటా మోదీ ఉన్నరు. అంతే తప్ప పెద్ద తేడా లేదు. ఒక పోస్టు పెట్టాడని యూనివర్సిటీ ప్రొఫెసర్‌ను బీజేపీ ప్రభుత్వం జైలులో వేసింది. ఓ యువకుడు రీట్వీట్ చేశాడని తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 20 రోజులు అతడిని జైలులో వేసింది. ఈ రెండు పార్టీల మధ్య తేడా ఏమున్నది? యూపీలో బుల్డోజర్‌రాజ్ అని రాహుల్‌గాంధీ అంటరు. కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బుల్డోజర్లతో పేదల ఇండ్లను కూల్చుతున్నా పట్టించుకోరు. తెలంగాణ నుంచి డబ్బులు అందుతున్నాయి కాబట్టి, తెలంగాణ తమకు డబ్బులు అందించే ఏటీఎంలా మారింది కాబట్టి రాహుల్ నోరు మెదపడం లేదు. అందుకే బీజేపీకి, కాంగ్రెస్ మధ్య తేడా ఏమీ లేదు.
కేంద్రంలో ప్రాంతీయ పార్టీలు ఎందుకు వాయిస్ వినిపిస్తలేవు?
త్వరలో భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను కలుస్తా. బీహార్‌లో 5 లక్షల ఓట్లు గల్లంతైనట్టు ఆరోపణలు ఉన్నయి. ఈసీఐ ఏంచేస్తున్నది? ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఏం చేస్తున్నది? ఈ విషయంలో ఎందుకు స్పందించడం లేదు? అసలు దేశంలో ప్రధాన ప్రతిపక్షం ఉన్నదా? ఇలాంటి విషయంలో కాంగ్రెస్ మిగతా పక్షాలను కలుపుకొని ఎందుకు వెళ్లడం లేదు? ఎవరి సమస్యలను పట్టించుకుంటున్నరు? బీహార్‌తో మాకు ఎలాంటి సంబంధం లేదు. ఓట్ల గల్లంతుపై మేమెందుకు స్పందించాలి చెప్పండి?
నేను 2014లో రాహుల్‌ను కలిశాను. వ్యక్తి మంచోడే.. కానీ ఆయన ఇప్పుడు పార్టీ నడపడం లేదు. ఎన్జీవో నడుపుతున్నారు.
గుజరాత్, బీహార్‌లో వంతెనలు కూలుతున్నయి. నేను విపక్షనేతగా ఉంటే కూలిన వంతెనలను పరిశీలించేవాడిని. మౌలిక సదుపాయాలు, వైద్యరంగంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. 11 ఏండ్లలో ఏమీ జరగలేదు. మాటిమాటికీ 5 ట్రిలియన్ ఎకానమీ అని ఊదరగొడుతున్నరు. స్వతహాగా జరిగిన అభివృద్ధిని వారు సాధించిన విజయంగా ప్రచారం చేసుకుంటున్నరు. ఎన్నో వైఫల్యాలున్నా ప్రధాన ప్రతిపక్షం ప్రశ్నించలేకపోతున్నది. వారు చెప్పింది వాస్తవమైతే 2022 నాటికి అందరికీ ఇండ్లు వచ్చి ఉండాల్సింది. అందరికీ మంచినీటి కనెక్షన్లు వచ్చి ఉండాల్సింది. 5 ట్రిలియన్ ఎకానమీ అయి ఉండాల్సింది. కానీ 2025 వచ్చినా ఇంకా ఈ హామీలు అలాగే ఉన్నాయి. రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తరు.. యాత్ర గుజరాత్ వద్దకు రాగానే రైట్ టర్న్ తీసుకొని వెళ్లిపోతరు. ఇదేం ప్రతిపక్ష పాత్ర?
ఇప్పడు తెలంగాణలో అధికారంలో ఉన్నది నిజమైన కాంగ్రెస్ కాదు. పైన బడా మోదీ.. కింద చోటా మోదీ ఉన్నరు. అంతేతప్ప పెద్ద తేడా లేదు. బీజేపీ, కాంగ్రెస్‌కు పెద్ద తేడా లేదు. ఒక పోస్టు పెట్టాడని యూనివర్సిటీ ప్రొఫెసర్‌ను బీజేపీ ప్రభుత్వం జైలులో వేసింది. ఓ యువకుడు రీట్వీట్ చేశాడని తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 20 రోజులు అతడిని జైలులో పెట్టింది. ఈ రెండు పార్టీల మధ్య తేడా ఏమున్నది?
-కేటీఆర్
ఆపరేషన్ సిందూర్ విషయంలో తాను చెప్తేనే యుద్ధం ఆగిందని ట్రంప్ చెప్తున్నరు. కేంద్రం మాత్రం విజయం సాధించామని చెప్పుకొన్నది. వాస్తవానికి పహల్గాం ఘటనపై దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆగ్రహజ్వాలలు పెల్లుబికాయి. ప్రతీకారం తీర్చుకోవాలని అంతా కోరుకున్నారు. ఇప్పటివరకు పహల్గాం దోషులు దొరకలేదు. యుద్ధం ఎందుకు ఆపారో కేంద్రం ఇంతవరకు వెల్లడించలేదు. జాతీయవాద ప్రభుత్వమని చెప్పుకొంటున్న ఈ ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకోకుండా వెనుకడుగు వేసింది. దీంతో వారిపట్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లింది. మన సైన్యాన్ని నిరుత్సాహపర్చడం ఇష్టం లేదనుకుంటే వివరాలు వెల్లడించకున్నా పరవాలేదు. అదే సమయంలో భారత్‌కు చెందిన ఫైటర్ జెట్లను పాకిస్థాన్ కూల్చివేసినట్టు ట్రంప్ చెప్తున్నప్పుడు కేంద్రం దీనిపై వివరణ ఇవ్వాల్సి ఉన్నది. ఆయన చెప్తున్నది వాస్తవమా? కాదా? అనేది చెప్పాల్సి ఉన్నది. పహల్గాం ఘటనతో పాకిస్థాన్‌కు బుద్ధిచెప్పే గొప్ప అవకాశం ఉన్నా భారత ప్రభుత్వం చేజేతులా జారవిడుచుకున్నది అనడంలో సందేహం లేదు.
జనగణన, కులగణన లెక్కలు తేలిన తర్వాత కేంద్రం రిజర్వేషన్లపై ఏదైనా విధానం ప్రకటిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కులగణన ఎందుకు చేస్తున్నారో? దీనిద్వారా ఏమి చేయాలనుకుంటున్నారో కేంద్రం చెప్పాల్సిన అవసరం ఉన్నది. దీనివల్ల ఓబీసీలకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో చెప్పాలి. విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో రిజర్వేషన్లు ఇస్తారా? లేక రాజకీయాలకు వాడుకుంటారా? అనేది చెప్పాలి. ఒకవేళ రాజకీయాలకు వాడుకుంటే మాత్రం మేము పోరాటం చేస్తం
ప్రజల కోసం మరింత కష్టపడి పనిచేస్తం. వాళ్ల ఆకాంక్షలు నెరవేరాలనేదే మా కోరిక. కాంగ్రెస్, బీజేపీలతో పోరాడుతూనే ఉంటం. 2014, 2018లో ఒంటరిగా అధికారంలోకి వచ్చినం. 2023లో 1.8 శాతం ఓట్ల తేడాతో ఓడిపోయినం. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సారి ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడుతం. తప్పకుండా తిరిగి అధికారంలోకి వస్తం.
గ్రామీణ ప్రాంతాలపై ఎక్కువ దృష్టి పెట్టినం. వ్యవసాయరంగంలో ఎక్కువ పనులు చేసినం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి ముందు ధాన్యం ఉత్పత్తిలో 14వ ర్యాంకు. ఆ తర్వాత పంజాబ్, హర్యానాను దాటేసి నంబర్‌గా నిలబడ్డం. పెద్ద ఎత్తున ప్రాజెక్టులు కట్టినం. దేశంలో ఏ ప్రభుత్వం చేపట్టని కార్యక్రమాలు రైతుల కోసం చేసినం. దేశంలో తొలిసారిగా రైతుబంధు తెచ్చినం. సీజన్‌కు ఎకరానికి రూ.5 వేల చొప్పున 11 సార్లు రైతు బంధు ఇచ్చినం. 73 వేల కోట్ల రైతుబంధును రైతుల ఖాతాల్లో వేసినం. ఈ సక్సెస్ చూసే ప్రధాని కిసాన్ యోజన తెచ్చారు. 12 రాష్ర్టాల్లో ఇలాంటి తరహా పథకాలు తీసుకొచ్చారు. దేశంలో రైతుబీమా తీసుకొచ్చిందే తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వం. గ్రామీణ ప్రాంతాల రూపురేఖలను, అన్నదాతల జీవితాలను మార్చివేసినం. కానీ, కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠాన్ని చూపెట్టి ఓట్లు వేయించుకున్నది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్కు తొలిసారి 63 సీట్లు వచ్చాయి. రెండోసారి 88 వచ్చాయి. మూడోసారి 39 వచ్చాయి. కానీ, 1.8 శాతం ఓట్ల తేడాతో అధికారాన్ని కోల్పోయినం. 14 సీట్లలో కేవలం 5 వేల ఓట్ల మెజార్టీతో దూరమైనం. కొన్ని లోపాలు, తప్పులు జరిగినయి. ప్రజల ఆశలు, రెండుసార్లు అధికారంలోకి రావడం వంటి అంశాలు ఉండవచ్చు. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. నాడు 278 సీట్లు వచ్చినయి. రెండోసారి 303 సీట్లు వచ్చినయి. మూడోసారి 240 వచ్చినయి. బీజేపీ సీట్లు కూడా తగ్గినయి.
డీలిమిటేషన్ అసలు ఎందుకు చేస్తరు? 1) ప్రజల ప్రాతినిధ్యం సమపాళ్లలో ఉండాలి. 2) ప్రజల సమస్యలను ప్రతిబింబించేలా సభ్యుల సంఖ్య పార్లమెంటులో ఉండాలి. 3) పరిపాలన వికేంద్రీకరణ జరిపాలి. ఈ మూడు అంశాలతో పార్లమెంట్ లోక్‌సభ నియోజకవర్గాల డీలిమిటేషన్ జరిపారు. పదేండ్లకు ఒకసారి జనగణన జరగాలి. అందుకు అనుగుణంగా జనాభా ప్రకారం డీలిమిటేషన్ జరపాలని రాజ్యాంగ సవరణ చేశారు. కానీ, దేశంలో ఇలాగే జనాభా పెరుగుతూపోతే అనేక సమస్యలు వస్తాయని, పేదరికం పెరుగుతుందని, జనాభాకు సరిపడా వసతులు తీసుకురాలేమని నాడు రాజకీయ పెద్దలు భావించారు. కుటుంబ నియంత్రణ అంశాన్ని నాడు తెరపైకి తెచ్చారు. 1971లో రాజ్యాంగ సవరణ చేసి భారత పార్లమెంట్ స్థానాలను 543 దగ్గర ఫ్రీజ్ చేశారు. అన్ని రాష్ర్టాలు కుటుంబ నియంత్రణను కఠినంగా అమలు చేయాలని భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 30 ఏండ్ల వరకు డీలిమిటేషన్ చేసేది లేదని రాజ్యాంగ సవరణ చేశారు. కేంద్రం ఆదేశాల మేరకు దక్షిణ భారతంలో కుటుంబ నియంత్రణ పకడ్బందీగా అమలైంది. తద్వారా 1971 నుంచి 2011 వరకు జనాభాను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. కేరళలో 69 శాతం, తమిళనాడులో 89 శాతం, తెలంగాణలో 130 శాతం జనాభా గ్రోత్ ఉన్నది. అదే ఉత్తర భారతంలో కుటుంబ నియంత్రణ సక్రమంగా అమలు కాకపోవడంతో బీహార్‌లో 230, రాజస్థాన్‌లో 220 శాతం గ్రోత్ పెరిగింది. కేంద్ర ఆదేశాలను అమలుచేయని ఉత్తరాది రాష్ర్టాలకు ఎలాంటి శిక్ష విధించకపోగా, కేంద్ర సర్కారు ఆదేశాలను పక్కా అమలుచేసిన దక్షిణాది రాష్ర్టాలను శిక్షిస్తామన్నట్టుగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరించడం ఎక్కడి న్యాయం? భారతదేశం విభిన్న జాతుల సమ్మేళనం. భిన్నత్వంలో ఏకత్వం మన భారతీయుల బలం. ఇందులో ఏ వర్గానికి చెందిన, ఏ రాష్ర్టానికి ప్రాతినిధ్యమైనా తక్కువ అయితే అక్కడి ప్రజలు తట్టుకోలేరు. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ తప్పు అని 2024 నుంచి మేము వాదిస్తూ వస్తున్నం. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తుంది. అసమానతలను పెంచుతుంది. ఉత్తరభారతంలోనే బుల్లెట్ రైలు నడుస్తున్నది. అహ్మదాబాద్ నుంచి ఢిల్లీ మధ్యనే చక్కర్లు కొడుతున్నది. సెమీ కండక్టర్ ఫ్యాక్టరీలు గుజరాత్లో పెడతారు. పరిపాలన కేంద్రం ఒక్కచోట ఉండటం, ఒకరి చేతిలో ఉండటం చాలా ప్రమాదకరం. స్వాతంత్య్రం వచ్చిన 1947లో దక్షిణ భారతంలో 25 శాతం జనాభా ఉండేది. ఇప్పుడు కుటుంబ నియంత్రణ కారణంగా 19 శాతానికి పడిపోయింది. ఆ మేరకు మా లోక్‌సభ సీట్లలో కోతపెడతామనడం చాలా తప్పు. కేంద్ర ప్రభుత్వానికి ఇది మా ఆవేదన, వినతి. డీలిమిటేషన్ కచ్చితంగా చేయాలనుకుంటే జనాభా ప్రకారం.. ప్రజాప్రతినిధుల సంఖ్య పెంచాలనుకుంటే.. ప్రజలకు సమీపంగా ఉండే ఎమ్మెల్యేల సీట్లను పెంచండి. ప్రజలకు ఫస్ట్ ప్రొటోకాల్ ఎమ్మెల్యేనే.. ఎంపీ కాదు. కాబట్టి ఎమ్మెల్యేల సంఖ్యను పెంచండి. ఎంపీల సంఖ్యను గతంలో మాదిరిగా 543 ఉంచండి. ఒకవేళ ఎంపీల సంఖ్య కచ్చితంగా పెంచాలనుకుంటే అందరికీ ఒకే విధానం అమలుచేయండి. ఉత్తరప్రదేశ్‌లో 2 శాతం సీట్లు పెంచితే, తెలంగాణలో కూడా అలానే పెంచాలి. అలా కాకుండా చేస్తే మీపై ప్రజలు తిరగబడతారు. ఉత్తరాదిరాష్ర్టాలపై పట్టున్నది కాబట్టి ఉత్తరభారతం నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానంటే కుదరదు. కచ్చితంగా దక్షిణ భారత ప్రజలు కేంద్రాన్ని నిలదీస్తరు. కొట్లాడుతరు.
ఇది ఓపెన్ సీక్రెట్. రెండు పార్టీల మధ్య మంచి అవగాహన ఉన్నది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలి 8 మంది చనిపోయారు. నేటికీ ఢిల్లీ నుంచి ఎలాంటి విచారణ కమిటీ రాలేదు. మా ప్రభుత్వంలో మేడిగడ్డ ప్రాజెక్టులో ఒక పిల్లర్‌కు చిన్న పగులు ఏర్పడితే దానిపై హంగామా చేయడానికి రేవంత్‌రెడ్డి వెళ్లాడు. ఆయన రాహుల్‌గాంధీని తీసుకొస్తాడు. పెద్దం స్కామ్ జరిగింది.. మొత్తం ప్రాజెక్టు కూలిపోయిందని ఆరోపణలు చేస్తడు. వెంటనే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) వస్తది. ఎన్డీయే తరహాలో 24 గంటల్లోనే కమిటీ నివేదిక ఇస్తది. గుజరాత్లో బ్రిడ్జి కూలిపోయింది. బీహార్‌లో వంతెనలు కూలిపోతూనే ఉంటయి. తెలంగాణలో టన్నెల్ కూలిపోయింది. అయినా, ఎక్కడా ఎలాంటి విచారణ జరగదు. ఎక్కడికీ ఎన్డీఎస్ఏ వెళ్లదు. 24 గంటల్లోపు రిపోర్టు ఇవ్వదు. అంతా సైలెంట్. ఇది వారిద్దరి మధ్య కొనసాగుతున్న ఆత్మీయ బంధం. వారి బంధం ఎలా ఉన్నా మాకు ఇబ్బంది లేదు. కానీ, రెండూ కలిసి బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తున్నయి. రేవంత్ నాపై ఏదో ఆరోపణ చేస్తడు. వెంటనే ఈడీ నా వచ్చి విచారణ చేస్తది. ఇదేం విధానం?
ప్రధాన ప్రతిపక్ష పాత్ర బాగా పోషిస్తున్నం. కేంద్రంలో బీజేపీపై కాంగ్రెస్ ఎలా వెళ్తున్నదో చూస్తున్నరు. దేశవ్యాప్తంగా బీజేపీ, కాంగ్రెస్ కొట్లాడుతాయి. కానీ, తెలంగాణలో మాత్రంలో బీజేపీ, కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయి. నేను ఉట్టిగా ఆరోపణ చేయడం లేదు. ఇందుకు ఉదాహరణలున్నయి. తెలంగాణ రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లో ఈడీ రైడ్ జరిగింది. తొమ్మిది నెలలైంది. నోట్ల లెక్కింపు మిషన్లు వెళ్లాయని, ఇంత నగదు దొరికిందని టీవీల్లో బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. కానీ, రైడ్‌పై ఇప్పటివరకు ఈడీ నోరు మెదపదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా మాట్లాడదు. అధికారిక ప్రకటన వెలువడదు. కాంగ్రెస్, బీజేపీ మధ్య మంచి దోస్తానా కొనసాగుతున్నది. తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడల్లా ప్రధాని మోదీ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తరు. ఇక్కడ రేవంత్‌రెడ్డి-రాహుల్‌గాంధీ (ఆర్ఆర్) ట్యాక్స్ కాంట్రాక్టర్ల నుంచి వసూలు చేస్తున్నారని ఫైరవుతరు. ఏడాదిగా విమర్శలు చేస్తున్నరు. కర్ణాటక నుంచి తెలంగాణ మంత్రికి రూ.45 కోట్లు వచ్చాయి. ఆయన ఖాతాలో నగదు జమైనట్టు వార్తలు వచ్చాయి. కర్ణాటకలో బ్యాంకు మేనేజర్‌తోపాటు పలువురు అరెస్టయ్యారు. కానీ, దానిపై తెలంగాణలో ఎలాంటి సోదాలు లేవు. ప్రకటన లేదు. ఇదీ బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఉన్న పరస్పర సహకారం కాదా? రాహుల్ కారణంగా రేవంత్‌రెడ్డికి ఉద్యోగం వచ్చింది. కానీ, మోదీ ప్రాంగణంలోనే రేవంత్ ఉద్యోగం చేస్తున్నరు. లోపల మోదీ కోసం, బయట రాహుల్ కోసం రేవంత్‌రెడ్డి పనిచేస్తున్నరు.
ఉత్తర, దక్షిణ ప్రాంతాల కలయిక తెలంగాణ. దేశ చిత్రపటాన్ని గమనిస్తే మేము మధ్యలో ఉంటాం. దోశ, పరోటా కలిసినట్టుగా ఉండేదే హైదరాబాద్. దేశానికి ఒక జాతీయ భాష ఉండాల్సిన అవసరం లేదు. బలవంతం చేస్తే తిరుగుబాటు తప్పదు.
-కేటీఆర్
మీరు ఒక్కసారి భారత చరిత్రను గమనిస్తే సంకీర్ణ ప్రభుత్వాలే దేశాన్ని పాలించాయి. 1991 నుంచి చూస్తే అధికశాతం మన దేశాన్ని 35 ఏండ్లలో సంకీర్ణ ప్రభుత్వాలే పాలించాయి. ఇప్పుడు ప్రధాన రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్‌గాని, బీజేపీగాని వచ్చే ఎన్నికల్లో 150 సీట్లు మించి సాధించలేవు. దేశంలోని ప్రాంతీయ ప్రధాన పార్టీలు సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటులో కీలక భూమిక పోషిస్తాయి. అందుకే భారత్‌ను ఎవరూ విభజించలేరు. భారతదేశ అభివృద్ధి, రాజకీయంలో అందరి భాగస్వామ్యం ఉన్నది. అందుకే ఎవరూ దీనిని విడదీయలేరు. డీలిమిటేషన్‌తో ఉత్తర భారతాన్ని కేంద్రీకృతం చేస్తాం, దేశ ప్రజలందరిపై హిందీని రుద్దుతామంటే కుదరదు. తెలంగాణలో కేసీఆర్, బెంగాల్లో మమత, తమిళనాడులో స్టాలిన్ వంటి నేతలపై ప్రజల అభిమానం ఉన్నంతకాలం దేశానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా కాపాడుతారు. ఇది దేశ ఐక్యతకు ఎంతో మేలుచేస్తుంది.
టీఆర్ఎస్ను స్థాపించి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించినం. రెండు సార్లు అధికారంలోకి వచ్చినం. రాష్ర్టాన్ని నంబర్ వన్‌గా నిలిపినం. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర, ఇతర పొరుగు రాష్ర్టాల్లో అక్కడి ప్రజల అభిప్రాయం మేరకు పోటీ చేసేందుకు టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చినం. గోవా వెళ్తే మమత ఫొటో చూస్తాం. జాతీయ నాయకుడిగా ఎదగాలంటే ప్రాంతీయ పార్టీలకు కొంత కష్టమే కానీ, ఒక్కసారి చరిత్ర చూస్తే మీకే తెలుస్తుంది. బీజేపీ ఇంత పెద్దగా, గట్టి పార్టీగా కనిపిస్తున్నది కాని, ఒకప్పుడు ఆ పార్టీకి కూడా ఇద్దరు ఎంపీలే ఉన్నరు. ప్రాంతీయ పార్టీలు ఎదగడానికి కూడా సమయం పడుతుంది. స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలు పెట్టుకొని సాగితే సాధ్యమవుతుంది. మనసు పెట్టి పనిచేస్తే బీఆర్ఎస్, ఆప్, ఎన్డీయే, టీఎంసీ రాష్ట్రంతోపాటు ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తాయనే నమ్మకం నాకున్నది.
అబ్కీ బార్ కిసాన్ సర్కార్..ఇదే మా ఎజెండా. దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనన్ని రైతు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినం. మేము వరి ఉత్పత్తిలో తెలంగాణను నంబర్‌వన్‌గా తీర్చిదిద్దినం. కానీ, ఓట్లు రాలేదు. తప్పు మాత్రం చేయలేదు. మాకు జాతీయ ఎజెండా ఉన్నది. పాలసీ ఉన్నది. దేశంలో గంగ, యమున, కృష్ణ, గోదావరి లాంటి నదుల్లో 4,000 టీఎంసీల నీరు పారుతున్నది. దేశంలోని సాగుకు అనుకూలమైన ప్రతి ఇంచుకు, తాగునీటి అవసరాలకు 20 వేల టీఎంసీల నీరు సరిపోతుంది. కానీ, ఇన్ని సంవత్సరాల్లో ఇన్ని ప్రభుత్వాలు మారినా నీటిని పూర్తి స్థాయిలో ఎవరూ వినియోగించడం లేదు. నీళ్లు నిరుపయోగంగా సముద్రంలో కలుస్తున్నయి. దేశంలో 4 లక్షల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి మనకు అందుబాటులో ఉన్నది. ఇప్పటికే కరెంట్ లేని గ్రామాలు అనేకం ఉన్నయి. ఇలాంటి జెండా మాకు ఉన్నది. దురదృష్టవశాత్తు సొంత రాష్ట్రంలోనే ఓడిపోయాం. మళ్లీ పుంజుకుంటాం. రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం. ఇతర రాష్ర్టాలకు కూడా విస్తరిస్తాం.
రాహుల్ నాలుగు తరాల రాజకీయ వారసుడు. నాది రెండో తరమే. ఐదో తరం వాళ్లు పార్టీని అజమాయిషీలోకి తీసుకొని వారసత్వ రాజకీయమంటూ మా మీద పడి ఏడుస్తున్నరు. దానికి మేము ఏమని జవాబివ్వాలి? కాంగ్రెస్ పార్టీది ద్వంద్వ వైఖరి. రెండు నాలుకల ధోరణి. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అదానీని తిడుతది. కానీ, తెలంగాణ అదానీతో కలిసి పనిచేస్తది. వ్యాపారం సాగిస్తున్నది. రేవంత్‌ను చోటా మోదీ అనాలా? చోటా రాహుల్ అనలా? కాంగ్రెస్‌కు కపటత్వం, అహంకారం ఎక్కువ. ఇప్పటికీ అది పెద్ద పార్టీ అని ఫీలింగ్. కానీ, మా దృష్టిలో కాంగ్రెస్ పెద్ద ప్రాంతీయ పార్టీ మాత్రమే. యూపీలో కూటమి ఎందుకు కూలిపోయింది? ఎక్కువ సీట్లు కోరినందుకే కదా? బీహార్‌లో తేజస్విని ఎందుకు ముందు పెడుతున్నరు? రాహుల్ ఇలాగే ఉండాలని రోజూ మోదీ దేవున్ని ప్రార్థిస్తున్నారు కావచ్చు. కాంగ్రెస్‌కు రాహుల్ ఉన్నంత కాలం మోదీ హాయిగా ఉంటారు. మోదీకి రక్షణ రాహులే.
ముందుగా తెలంగాణలో సత్తా చాటాల్సి ఉన్నది. రానున్న రోజుల్లో తెలంగాణలో అధికారం చేపట్టాకా 14-15 ఎంపీ స్థానాలు గెలవడంపై దృష్టి సారిస్తాం. తర్వాత జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేస్తాం. హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణలో మళ్లీ అధికారంలోకి రావడమే మా ముందున్న లక్ష్యం.