హైదరాబాద్: ఫార్మా విలేజ్ కోసం భూసేకరణలో భాగంగా ప్రజాభిప్రాయ సేకరణకు లగచర్ల వెళ్లిన అధికారులపైకి రైతులు ఎదురుతిరిగిన ఘటనలో అరెస్ట్‌ల పర్వం కొనసాగుతున్నది. ఇప్పటికే కొడగంల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి సహా లగచర్ల గ్రామానికి చెందిన 20 మంది రైతులను పోలీసులు రిమాండ్ చేసిశారు. మరో నలుగురి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. కాగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను (KTR) సైతం అరెస్టు చేస్తారనే వార్తల నేపథ్యంలో.. హైదరాబాద్ నందీనగర్‌లోని ఆయన నివాసానికి పెద్ద సంఖ్యలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు చేరుకున్నారు. బుధవారం రాత్రి పొద్దుపోయిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, ముఖ్యనేతలు, కార్యకర్తలు ఒక్కొక్కరిగా పెద్ద సంఖ్యలో కేటీఆర్ నివాసానికి చేరుకున్నారు. గురువారం ఉదయం వరకు అక్కడే వేచిఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు.
మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యావ్, కార్తీక్ రెడ్డి, మన్నె క్రిశాంక్ తదితర నేతలు కూడా అక్కడే ఉన్నారు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అక్కడికి చేరుకుని కేటీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా లగచర్ల ఘటన అనంతరం జరుగుతున్న రాజకీయ పరిణామాలపై చర్చించారు. కాగా, కావాలనే తమ నాయకుడి పేరును కేసులో ఇరికించారని, బలవంతంగా భూసేకరణ చేస్తుండటంతో కడపు మండిన రైతులు తిరగబడ్డారే తప్ప మరొకటి కాదని నేతలు, కార్యకర్తలు పేర్కొన్నారు.
కేటీఆర్ ఇంటి వద్దకు భారీగా చేరుకున్న కార్యకర్తలు pic.twitter.com/FYP4USvaop
— Telugu Scribe (@TeluguScribe) November 13, 2024
బుధవారం ఉదయం హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్కులో వాకింగ్ చేస్తున్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం 10 గంటలకు వికారాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ శిక్షణా కేంద్రానికి తీసుకువచ్చి ఐజీ సత్యనారాయణ, జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో మధ్యాహ్నం 2 గంటల వరకు విచారించారు. అనంతరం ఆయనను తొలుత పరిగి పోలీస్‌స్టేషన్‌కు ఆపై కొడంగల్‌లోని ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. ఆ తరువాత కొడంగల్ కోర్టులో నరేందర్‌రెడ్డిని హాజరుపర్చగా, కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. రిమాండ్ రిపోర్ట్‌లో మొదట బోగమోని సురేశ్‌ను ఏ1గా పేర్కొన్న పోలీసులు ఇప్పుడు పట్నం నరేందర్‌రెడ్డిని ఏ1గా మార్చారు.