కుమ్రంభీం ఆసిఫాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ) : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రెండో విడుత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో (Grama Panchayathi Elections) గులాబీ పార్టీ సత్తాచాటింది. అధికార కాంగ్రెస్ (Congress) పార్టీ కంటే రెట్టింపు స్థానాల్లో విజయం సాధించింది. బెజ్జూర్, చింతలమానేపల్లి, దహెగాం, పెంచికల్పేట్, కౌటాల, సిర్పూర్-టీ మండలాల్లో 113 సర్పంచ్ స్థానాలకు ఆదివారం ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో 48 స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకోగా, అధికార కాంగ్రెస్ 21 స్థానాల్లో, బీజేపీ 21 స్థానాల్లో, ఇతరులు 21 స్థానాల్లో గెలుపొందారు. మరో రెండు స్థానాల రిజల్ట్ కోసం అర్ధరాత్రి వరకు కౌంటింగ్ కొనసాగుతున్నది.
గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీపై ఎంతటి వ్యతిరేకత ఉందో ఈ ఫలితాలు నిదర్శనంగా నిలిచాయి. సిర్పూర్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. మొదటి విడుతలో లింగపూర్, సిర్పూర్-యూ, జైనూర్, కెరమెరి, వాంకిడి మండలాల్లోని 114 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 40 చోట్ల గెలుపొందగా, అధికార కాంగ్రెస్ పార్టీ 31 స్థానాల్లో, బీజేపీ 5 స్థానాల్లో, ఇతరులు 33 స్థానాల్లో గెలుపొందగా, ఐదు స్థానాల్లో ఏకగ్రీవాలు అయ్యాయి.
మహబూబ్‌నగర్/మూసాపేట(చిన్నచింతకుంట), డిసెంబర్ 3 : ఆదివారం జరిగిన రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. పలుచోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఇలాకాల్లో బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి సొంత గ్రామం దమగ్నాపూర్‌లో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి పావని.. కాంగ్రెస్ మద్దతుదారురాలు భారతిరెడ్డిపై 126 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి స్వగ్రామంలో కాంగ్రెస్ ఓడింది. నారాయణపేట జిల్లా డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్‌రెడ్డి సొంతూరిలో బీఆర్ఎస్ బీఆర్ఎస్ అభ్యర్థి మురారి గెలిచారు.