హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ) : మున్సిపల్ ఎన్నికల్లో 700కు పైగా స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచిందని, కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక పాలనకు ఈ ఫలితాలు నిలువుటద్దమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు స్పష్టంచేశారు. అధికార కాంగ్రెస్ అక్రమాలు, దౌర్జన్యాలకు ఎదురొడ్డి కార్పొరేటర్లు, కౌన్సిలర్లుగా గెలిచి, ఎన్నికల్లో సత్తా చాటిన బీఆర్ఎస్ నాయకులందరికీ శుక్రవారం ఓ ప్రకటనలో హృదయ పూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు.
కాంగ్రెస్ అరాచక, అప్రజాస్వామిక విధానాలకు తగిన రీతిలో బుద్ధి చెప్తూ, బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలూ శ్రమించిన గులాబీ నాయకులు, కష్టపడి పని చేసిన కార్యకర్తలు, సోషల్ మీడియా సైనికులందరికీ హరీశ్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి, మంత్రులతో సహా యావత్ ప్రభుత్వ యంత్రాంగం ఒకటై కొట్లాడి నా మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపును అడ్డుకోలేకపోయారని స్పష్టంచేశారు. అధికార దుర్వినియోగం, డబ్బు రాజకీయాలు, బెదిరింపులు వంటి అన్నింటినీ తట్టుకొని బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించడం కాంగ్రెస్ అప్రజాస్వామిక పాలనకు చెంపపెట్టు అని అభివర్ణించా రు. ప్రజల ఆశీస్సులతో తెలంగాణలో గులాబీ జెండా ఎగుర వేసేందుకు నిర్విరామ పో రాటం చేస్తూనే ఉంటామని స్పష్టంచేశారు.
భీమ్‌గల్, ఫిబ్రవరి 13: మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని, బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నామని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. నాయకులు, కార్యకర్తల కు శుక్రవారం పకటనలో ధన్యవాదాలు తెలిపారు. ప్రజల పక్షాన హామీల అమలకు నిరంతరం పోరాడుతూనే ఉంటామని చెప్పారు.