కరీంనగర్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి/కరీంనగర్): ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కీలక స్థానాల్లో కాంగ్రెస్కు చుక్కెదురైంది. ఆ పార్టీ మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సొంతూరులో, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఉన్న పంచాయతీలో హస్తం పార్టీ ఓటమిపాలైంది. ఆ రెండూళ్లలో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించిన ఓటర్లు ఎమ్మెల్యేకు ఝలక్ ఇచ్చారు. ఇదే జిల్లాలోని మంత్రి పొన్నం సొంత మండలంలో హస్తం పార్టీ డీలాపడగా, సీపీఐ జాతీయ నేత చాడ వెంకట్రెడ్డి సొంతూరిలో ఆ పార్టీ అభ్యర్థి ఓటమిపాలయ్యాడు. మానకొండూరు నియోజకవర్గంలో మేజర్ పంచాయతీలను బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు కైవసం చేసుకోవడం మరో విశేషం.
ఎమ్మెల్యే కవ్వంపల్లి సొంతూరైన మానకొండూర్ మండలం పచ్చునూర్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి కనకం అశోక్ ఐదో స్థానంలో నిలిచారు. ఈ గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి పార్నంది కేశవ్ 150 ఓట్లతో ఘన విజయం సాధించగా, స్వతంత్ర అభ్యర్థి ఆసాడి భాగ్యలక్ష్మి రెండో స్థానంలో నిలిచారు. నియోజకవర్గ కేంద్రమైన మానకొండూర్లో బీఆర్ఎస్ అభ్యర్థి తాళ్లపల్లి వర్షిణి ఘనవిజయం సాధించారు. కవ్వంపల్లి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు ఉన్న మహాత్మానగర్ను హస్తంపార్టీ దక్కించుకోలేకపోయింది.
సీపీఐ జాతీయ నాయకుడు చాడ వెంకట్రెడ్డికి ఈ ఎన్నికల్లో పరాభవం ఎదురైంది. ఆయన సొంత గ్రామమైన రేకొండలో సీపీఐ బలపర్చిన అభ్యర్థి ఓటమి పాలయ్యారు. సీపీఐ నుంచి పోటీచేసిన నీలం వెంకన్న తరఫున చాడ ప్రచారం కూడా చేశారు. గెలుస్తారని ధీమా వ్యక్తం చేసారు. కానీ, బీఆర్ఎస్ అభ్యర్థి అల్లెపు సంపత్కు ప్రజలు పట్టంగట్టడంతో చాడ వెంకట్రెడ్డికి చుక్కెదురైంది.
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ప్రస్తుతం మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిథ్యం వహిస్తున్న హుస్నాబాద్ నియోకవర్గంలో ఉన్నది. ఈ మండలంలో మొత్తం 17 పంచాయతీలు ఉండగా 9 స్థానాలను బీఆర్ఎస్ కైవలం చేసుకున్నది. కాంగ్రెస్ 7 స్థానాలకే పరిమితం కాగా, బీజేపీ ఒక స్థానం దక్కించుకున్నది.
ముఖ్యమంత్రిగా కేసీఆర్ తన హయాంలో దత్తత తీసుకున్న చిన్న ముల్కనూరులో బీఆర్ఎస్కు ప్రజలు పెద్ద ఎత్తున పట్టంగట్టారు. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన సాంబారి భారతమ్మ కొమురయ్య దాదాపు 400 పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు. ఈ గ్రామాన్ని దక్కించుకోవడానికి కాంగ్రెస్ శత విధాలుగా ప్రయత్నాలు చేసింది. సీపీఐ కూడా తోడయింది. అయినా ఇక్కడి ప్రజలు కేసీఆర్పైనే మరోసారి తమ అభిమానం చాటుకున్నారు.