సిరిసిల్ల రూరల్, డిసెంబర్ 18: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దత్తత గ్రామమైన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం రామన్నపల్లె పంచాయతీ ఎన్నికల్లో మళ్లీ గులాబీ జెండా ఎగిరింది. ఇక్కడ వరుసగా మూడుసారి కూడా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులే విజయం సాధిస్తూ వస్తున్నారు. నాడు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌కు జైకొట్టిన రామన్నపల్లె.. తరువాత 2015లో రామన్నపల్లెను మంత్రిగా ఉన్న సమయంలో కేటీఆర్ దత్తత తీసుకున్నారు. 2013 పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి సిలువేరి రాజేశ్వరి,
2019లో ఆత్మకూరి రంగయ్యయాదవ్, ఈ నెల 14న జరిగిన రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఆత్మకూరి జ్యోతిఅనిల్యాదవ్ గెలుపొందారు. దీంతో బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉన్న రామన్నపల్లెలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కేటీఆర్ చరిష్మా, ఆయనపై ఉన్న అభిమానం చెక్కుచెదరకుండా ఉండటానికి ఈ పంచాయతీ ఎన్నికలే నిదర్శనమని చర్చించుకోవడం విశేషం. కాగా, రామన్నపల్లె తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌కు అండగా నిలిచింది. 2006లో కరీంనగర్ పార్లమెంట్ ఉపఎన్నికలు తెలంగాణ ఉద్యమానికి రెఫరెండమ్‌గా మారిన విషయం తెలిసిందే.
ఆ సమయంలో కేసీఆర్ రామన్నపల్లెకు ప్రచారానికి రాగా, ఊరు ఊరంతా జై కొట్టింది. వారి కోరిక మేరకు ఎల్లమ్మ చెరువుకు సొంత ఖర్చులతో కాలువ తవ్వించి నీళ్లువచ్చేలా చేశారు. అప్పటినుంచి కేసీఆర్‌కు ఈ గ్రామం అండగా నిలిచింది. ‘మా గ్రామం ఓట్లు మొత్తం కేసీఆర్‌కే వేస్తాం.. మా గ్రామానికి ఎవరూ ఓట్ల కోసం రావద్దు’ అంటూ తిప్పి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తెలంగాణ వచ్చిన తర్వాత స్వరాష్ట్రంలో సిరిసిల్లకు కేటీఆర్ ప్రాతినిథ్యం వహించడం, 2014లో అధికారంలోకి రాగానే పంచాయతీరాజ్ మంత్రిగా కేటీఆర్ పని చేయడంతో ఆ సమయంలో రామన్నపల్లెను దత్తత తీసుకుని అభివృద్ధి చేసి, గ్రామస్థులకు అండగా నిలిచారు. దీంతో కేసీఆర్, కేటీఆర్‌ను రామన్నపల్లె వాసులు ఇప్పటికీ మరువడం లేదు. గులాబీ పార్టీకి అండగా నిలవడం అనవాయితీగా మారింది.
గ్రామాన్ని కేటీఆర్ సార్ దత్తత తీసుకున్నరు. చాలా అభివృద్ధి చేసిన్రు. మాకు అండగా ఉన్నరు. నా గెలుపు కోసం కృషి చేసిన్రు. రామన్నపల్లెలో గెలిచి కేటీఆర్ సార్‌కు కానుకగా ఇవ్వాలనుకున్నం. అనుకుట్టుగానే గెలిచినం. చాలా సంతోషంగా ఉన్నది. నా గెలుపు కోసం సహకరించిన గ్రామస్థులకు కృతజ్ఞతలు. కేటీఆర్ సహకారంతో గ్రామాన్ని మరింతగా అభివృద్ధి చేస్తాం. కేటీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు.
– ఆత్మకూరి జ్యోతి, రామన్నపల్లె, సర్పంచ్