హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): ఓ వైపు ‘చేతి’లో అధికారమున్నది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రచారం సాగించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో మోహరించారు. గ్రామీణులను అనేకవిధాలుగా ప్రలోభాలకు గురిచేశారు. ప్రతిపక్ష బీఆర్ఎస్కు చెందిన నేతలపై దాడులకు దిగారు. అక్రమ కేసులు బనాయించి నిర్బంధించారు. సామదానభేద దండోపాయాలన్నీ ప్రయోగించారు. హత్యారాజకీయాలకు సైతం తెరలేపారు. అయినా పల్లెల అభిమానాన్ని పొందలేకపోయారు. స్థానిక సమరంలో బొటాబొటీ మెజార్టీతోనే కాంగ్రెస్ పార్టీ సరిపెట్టుకున్నది. మరోవైపు పల్లెల గుండెల్లో గులాబీ వికసించింది. అధికారపక్షానికి ఢీ అంటే ఢీ అనే స్థాయిలో పోటీనిచ్చింది. హస్తం పార్టీకి ముచ్చెమటలు పట్టించింది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొదటివిడతలో ఇప్పటికే ఏకగ్రీవమైన 396 సర్పంచ్ స్థానాలు, నామినేషన్లు దాఖలు కానీ 5, హైకోర్టు స్టేతో నిలిచిన 1 స్థానం మినహాయించి మిగతా 3,834కు ఎన్నికలు నిర్వహించారు. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య గెలుపొందిన స్థానాల సంఖ్యలో స్వల్ప తేడానే ఉన్నది. ఈ ఫలితాలతో అధికార కాంగ్రెస్‌పై గ్రామీణ ఓటర్లలో ఎంత వ్యతిరేకత ఉన్నదో తేటతెల్లమైంది.
తొలివిడత 84.28 శాతం పోలింగ్
రాష్ట్రవ్యాప్తంగా తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో 84.28 శాతం పోలింగ్ నమోదైంది. 56.19 లక్షల మందికిగాను 45.15 లక్షల మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. తొలివిడతలో మొత్తంగా 31 జిల్లాల్లోని 4,236 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించగా 396 స్థానాలు ఏకగ్రీవయ్యాయి. 5 చోట్ల సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. ఒక సర్పంచ్ స్థానానికి సంబంధించి హైకోర్టు స్టే విధించింది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా 3,834 సర్పంచ్, 27,628 వార్డుసభ్యుల స్థానాలకు 37,562 పోలింగ్స్టేషన్లలో పోలింగ్ నిర్వహించారు. సర్పంచ్ స్థానాలకు 12,960 మంది, వార్డుస్థానాలకు 65,455 మంది పోటీపడ్డారు.
తొలివిడతలో మొత్తంగా 56,19,430 మంది ఓటర్లకు గాను 45,15,141 మంది (84.28శాతం) ఓటు హక్కు వినియోగించుకున్నారు. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో పోలింగ్ నమోదు కాగా, అత్యల్పంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నమోదైనట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగింది. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల కౌటింగ్ ప్రారంభించారు. గురువారం అర్ధరాత్రి ముగిసే సమయానికి 3,300 సర్పంచ్, 24,906 వార్డుసభ్యుల స్థానాలకు సంబంధించి ఫలితాలు ప్రకటించారు. అనంతరం ఉప సర్పంచ్ ఎన్నిక ప్రక్రియను సైతం పూర్తి చేశారు.
ఓటింగ్‌లో మహిళలే అత్యధికం
గురువారం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు పోలింగ్ మందకొడిగా కొనసాగింది. రెండు గంటల్లో దాదాపు 21.7శాతం మాత్రమే నమోదైంది. ఆ తర్వాత కాస్త పుంజుకున్నది. 9 గంటల నుంచి 11 గంటల వరకు 31.7 శాతం, ఆ ఒంటి గంటవరకు 26.13 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తంగా 84.28 శాతం పోలింగ్ జరిగింది. ఓటింగ్‌లో పురుషులకన్నా మహిళలే అత్యధికంగా పాల్గొన్నారు. మొత్తం 27,43,908 మందికి గాను 23,15,796 మంది (84.40 శాతం) మహిళలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల ప్రక్రియను ఎస్ఈసీ కమిషనర్ రాణి కుముదిని హైదరాబాద్‌లోని ఏసీ గార్డెన్స్‌లోని కార్యాలయం నుంచి పంచాయతీరాజ్‌శాఖ డైరెక్టర్ సృజన, ఎన్నికల కమిషన్ కార్యదర్శి మంద మకరందుతో కలిసి పర్యవేక్షించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పర్యవేక్షణకు సీఎస్, కలెక్టర్ల నేతృత్వంలో కమిటీలకు ఎప్పటికప్పుడు సూచనలు చేశారు.
పోస్టల్‌బ్యాలెట్ గుట్టురట్టు!
పోస్టల్ బ్యాలెట్ ఓట్లను గుట్టుగా ఉంచకుండా బహిరంగంగా ప్రకటించిన ఘటనలు అనేకచోట్ల జరిగాయి. దీనిపై ఉద్యోగవర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. వాస్తవంగా ప్రభుత్వ ఉద్యోగులు, ఎన్నికల విధుల్లో ఉన్న వారు పోస్టల్ బ్యాలెట్‌ను సమర్పిస్తారు. కౌంటింగ్ సమయంలో వాటిని ఓపెన్ చేసి లెక్కిస్తారు. ఆ ఓటు ఎవరికి వేశారనేది బయటపెట్టరు. కానీ తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో చాలా చోట్ల పోస్టల్ బ్యాలెట్ ఓట్లను బహిరంగంగా ప్రకటించారు. కౌంటింగ్ ప్రారంభానికి ముందే పోస్టల్ బ్యాలెట్లను తెరిచి, ఆ ఓటు ఏ అభ్యర్థికి వేశారని పోలింగ్ బూత్ అధికారి బహిరంగంగా ప్రకటించారు. ఆ తదుపరి పోలైన ఓట్లను లెక్కించారు. అయితే గుట్టుగా ఉంచాల్సిన పోస్టల్ బ్యాలెట్‌ను బహిరంగ పరచడంపై ఉద్యోగవర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
తొలివిడత పోలింగ్ 84.28%
ఓటుహక్కు వినియోగం
మొదటి విడత పోలింగ్ వివరాలు
అత్యధికంగా పోలింగ్ నమోదైన టాప్ 5 జిల్లాలు..
అత్యల్పంగా పోలింగ్ నమోదైన టాప్ 5 జిల్లాలు
మహిళలు అత్యధికంగా పాల్గొన్న జిల్లాలు
పురుషులు అత్యధికంగా పాల్గొన్న జిల్లాలు