వరంగల్, డిసెంబర్ 16(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘స్థానిక పోరు’లో కాంగ్రెస్ (Congress) గూండాయిజంపై పల్లెలు తిరగబడుతున్నాయి. ఫ్యాక్షన్ తరహా దాడులతో పల్లెలో భయానకవాతావరణాన్ని సృష్టిస్తున్న మూకలపై ప్రజలు మర్లబడుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల అండతో అడ్డూఅదుపూ లేకుండా ద్వితీయ శ్రేణి నాయకత్వం రెచ్చిపోయి దౌర్జన్యకాండ సాగిస్తున్నా..గ్రామాలు ఎక్కడా వెరవడం లేదు. హత్యాయత్నాలు, దాడులు, కేసుల పేరుతో జరుగుతున్న దౌర్జన్యాలను.. జట్టు కట్టి తిప్పికొడున్నాయి. మొదటి, రెండు విడతల్లో ప్రజాబలంతో ‘బీఆర్ఎస్ జాతర’తో అంతా ఉత్సాహం నెలకొనగా, దండుగమారి హస్తాన్ని పాతర వేస్తున్నాయి. ఈ క్రమంలో పట్టుజారుతున్న పల్లెలను చూసి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు కకావికలమై, ‘చంపేస్తాం’ అని బెదిరిస్తూ తమ అక్కసు వెల్లగక్కుతున్నారు. కాంగ్రెస్ ఎన్ని కుయుక్తులు పన్నినా మూడో విడతలోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతుందని పల్లె నాడీ చెబుతున్నది.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లా జిల్లా గాలిమోటరేసుకొని గిరగిరా తిరిగినా, మంత్రులు కాలికి బలపం కట్టుకొని పల్లెల్లో ఇల్లిల్లూ గాలించినా ప్రజలు బీఆర్ఎస్కే పట్టం కడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని బెదిరింపులు, దాడులకు తెగబడినా పల్లెలు తమ తిరుగుబాటు స్వభావాన్ని ప్రదర్శిస్తూ కాంగ్రెస్‌పై ఓటుతో పోటు పొడుస్తున్నారు. అధికార దర్పాన్ని తుత్తునియలు చేస్తూ పల్లెలు గుండెల్లో గులాబీ గానాన్నే ఆలపిస్తున్నాయి. గెలుపు ఏకపక్షమే అని విర్రవీగిన కాంగ్రెస్ వెన్నులో పల్లెలు వణుకు పుట్టిస్తున్నాయి. ఇప్పటిదాకా రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ వైపే ప్రజలు మొగ్గుచూపుతారనే సంప్రదాయాన్ని ఈ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు మార్చేశాయి. ప్రజాబలం ఉన్న పార్టీ వైపే ఉంటామని ప్రజలు తమ ఓటుతో తీర్పు ఇస్తూ స్థానిక సంస్థల ఎన్నికల ట్రెండ్‌ను తిరగరాస్తున్నారు. మొదటి, రెండు విడతల్లో ప్రజలు బీఆర్ఎస్ వైపు నిలిచారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా 40శాతానికి మించలేదు. బుధవారం జరిగే మూడో విడత ఎన్నికల్లోనూ అదే పునరావృతం అవుతుందని పల్లెల్లో వాతావరణం తేల్చి చెబుతున్నది.
కాంగ్రెస్ గూండాగిరీపై తిరుగుబావుటా
గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ మొదలైనప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ పల్లెల్లో భీతావహ వాతావరణాన్ని సృష్టించటం మొదలుపెట్టింది. గ్రామాల్లో బలమైన బీఆర్ఎస్ పార్టీ నాయకులను, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలను బ్లాక్మెయిల్ చేసి బలవంతంగా తమ పార్టీలో చేర్చుకున్నది. మాటవినని వారిపై పోలీసులను ప్రయోగించింది. సామాజికవర్గాలను ఉసిగొలిపి దాడులకు తెగబడింది. ఉమ్మడి మహబూబ్‌నగర్, నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లో బరిలో నిలిచిన బీఆర్ఎస్ నాయకులే లక్ష్యంగా ప్రత్యక్ష దాడులకు ఉసిగొలిపింది. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అనేక చోట్ల దాడులకు దిగింది. ప్రజలను భయపెట్టి, బలవంతంగా తమ వైపు తిప్పుకోవాలని శతవిధాలా ప్రయత్నాలు చేసినా అంతా బీఆర్ఎస్ వైపే నిలిచారు.
ఉద్యమస్ఫూర్తితో బీఆర్ఎస్కు జైకొట్టి..
కాంగ్రెస్ పార్టీ ఎన్నికుయుక్తులు పన్నినా, ఆ పార్టీ నేతలు దాడులకు పాల్పడినా పల్లెలు ఉద్యమస్ఫూర్తిని ప్రదర్శిస్తూ గులాబీ జెండాను గుండెలకు హత్తుకుంటున్నారు. మంత్రి ధనసరి అనసూయ సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు నియోజకవర్గంలోని ఏటూరునాగారం, తాడ్వాయి మండలకేంద్రాల్లో గులాబీ జెండా రెపరెపలాడింది. ఏటూరునాగారం గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికల్లో సీతక్క అనుచరుడిని మట్టికరిపించి బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీలత 3230 ఓట్ల రికార్డును మెజారిటీతో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చరిత్ర సృష్టించారు. వనపర్తి జిల్లాలో గోపాల్పేట మండలకేంద్రంలో జనరల్ స్థానంలో దళిత మహిళ స్వప్న-భాస్కర్ 2,180 ఓట్ల మెజారిటీ సాధించారు. మంచిర్యాల, కామారెడ్డి, నిజామాబాద్, వరంగల్, నల్లగొండ, ఖమ్మం ఇలా ఏ జిల్లాకు ఆ జిల్లా పోటాపోటీగా పల్లెలు బీఆర్ఎస్కు పట్టంకడుతున్నాయి.
కాంగ్రెస్ ఓటమి భయానికి ఆనవాళ్లు
పంచాయతీ ఫలితాలు మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. బీఆర్ఎస్కు పట్టం కట్డడాన్ని చూసి జీర్ణించుకోలేక ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ‘బీఆర్ఎస్ సర్పంచులు ఒకవేళ గెలిచినా నేనే చంపేస్తా’ అని హెచ్చరించారు. అంతటి ఆగకుండా ‘గెలిచిన సర్పంచ్‌లకు నిధులు ఇచ్చేది కూడా నేనే. ఇందిరమ్మ ఇల్లు కావాలంటే నేనే సంతకం పెట్టాలి.. రేషన్ కార్డులు కావాలంటే నేనే ఇయ్యాలి’ అని బెదిరింపులకు దిగారు. అందుకు కారణమూ ఆయనే చెప్పారు. ‘మా ఊర్లో కాంగ్రెస్‌ను ఓడించి నన్ను గుండెలమీద కొట్టారు’ అంటూ కకావికలం అయ్యారు.
మంత్రులు, ఎమ్మెల్యేల అండ చూసుకొని కాంగ్రెస్మూకలు రెచ్చిపోతున్నకొద్దీ ప్రజలు కీలెరిగి వాత పెడుతున్నారు. బీఆర్ఎస్కు పట్టకడుతూ కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్తున్నారు. మొదటి విడత సర్పంచ్ ఎన్నికలకు ముందే సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం లింగంపల్లిలో బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకులు విచక్షణారహితంగా దాడిచేశారు. కత్తులు, కర్రలతో 15మందిపై దాడికి పాల్పడ్డారు. దాడిలో బీఆర్ఎస్ నాయకుడు ఉప్పుల మల్లయ్య దారుణహత్యకు గురయ్యాడు. పోలీసులు చోద్యం చూసినట్టు చూసినా ప్రజలు బీఆర్ఎస్ బలపర్చిన మాదాసు చినవెంకన్నను సర్పంచ్‌గా గెలిపించి, కాంగ్రెస్ హత్యారాజకీయాలకు చెంపపెట్టులాంటి సమాధానం చెప్పారు.
మరికొన్ని ఘటనలు