పదేండ్లలోనే తెలంగాణ వందేండ్ల అభివృద్ధిని సాధించింది. మహారాష్ట్రలోనూ ప్రజలు మనకు బ్రహ్మరథం పడుతున్నారంటే కారణం మనం ఆచరించి చూపించిన మాడల్. మన ప్రతిభను, మన విజయాలను ఇతర రాష్ర్టాలవాళ్లు గొప్పగా చెప్పుకుంటున్నారు. చేసిన పనులను మనం చెప్పుకోవటంలేదు. మన విజయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి. జూన్ 2 నుంచి 21 రోజులపాటు నిర్వహించే దశాబ్ది ఉత్సవాలతో రాష్ట్రమంతా పండుగ వాతావరణం నెలకొనాలి.
– సీఎం కేసీఆర్
CM KCR | హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ) : ‘రాష్ట్రంలో మళ్లీ మనమే అధికారంలోకి వస్తున్నాం. ఇందులో ఎవరికీ ఎటువంటి అనుమానం అక్కరలేదు. మనం కచ్చితంగా 95 ఉంచి 105 స్థానాలు గెలబోతున్నాం. నేను చెప్పినట్టు వింటే, అందరూ పనిచేస్తే.. ప్రతి ఒక్కరికీ 50 వేల కన్నా ఎక్కువ మెజారిటీ కచ్చితంగా వస్తుంది’ అని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టంచేశారు. సర్వేలన్నీ తమకే అనుకూలంగా ఉన్నాయని ఆయన వెల్లడించారు. పదేండ్ల కాలంలో మనం అద్భుతమైన ప్రగతిని సాధించాం కాబట్టే ఈరోజున తెలంగాణ మాడల్‌ను దేశం కోరుకుంటున్నదని చెప్పారు. బుధవారం తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జడ్పీ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు సహా పలువురు ముఖ్యనాయకుల సమావేశం జరిగింది.
రాష్ట్రం ఆవిర్భవించక ముందు.. ఆ తర్వాత పదేండ్లలో వివిధ రంగాల్లో తెలంగాణ సాధించిన ప్రగతిని సీఎం కేసీఆర్ వివరించారు. అనతికాలంలోనే తెలంగాణ దేశానికి ఎలా రోల్‌మాడల్ అయ్యిందో ఆవిష్కరించారు. చేసిన పనులనూ బీఆర్ఎస్ శ్రేణులు పూర్తిస్థాయిలో చెప్పుకోవటం లేదని అన్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇలా అన్ని స్థాయిల్లో పార్టీ ప్రతినిధులంతా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ‘మనశక్తిని ఏకీకృతం చేసుకోవాలె. ఎంపీలు, ఎమ్మెల్సీలు, జడ్పీచైర్మన్లు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు.. ఇలా అందరితో ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలె’ అని సీఎం పేర్కొన్నారు. ఏ నియోజకవర్గంలో ఏం జరుగుతున్నదో అన్నీ తనకు తెలుసునని, ప్రతి అంశాన్ని తాను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నానని కేసీఆర్ చెప్పారు.
95 నుంచి 105 సీట్లు గ్యారెంటీ
వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే గరిష్ఠంగా సీట్లు అని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ‘మనం కచ్చితంగా 95 నుంచి 105 స్థానాలు గెలవబోతున్నాం. ఇందు లో ఎవరికీ అనుమానాలు, అపోహలు అక్కరలేదు. సర్వేలన్నీ మనకే అనుకూలంగా ఉన్నాయి. నేను చెప్పినట్టు చేస్తే 50 వేల మెజారిటీ గ్యారెంటీ’ అని కేసీఆర్ స్పష్టంచేశారు. పదేండ్లలో మనం చేసిన పనులు చెప్పుకోవటం లేదని, ఇప్పటి నుంచి అలా ఉండకూడదని సూచించారు. నియోజకవర్గాలవారీగా ఎమ్మెల్యేలు పదేండ్ల ప్రగతి ప్రస్థానాన్ని ఆవిష్కరించే కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.
నిత్యం ప్రజల్లో వారి సమస్యలను చిత్తశుద్ధితో మనసుపెట్టి పరిష్కరిస్తే ఎవరినైనా తప్పక ఆదరిస్తారని కేసీఆర్ ఉదహరించారు. రాజకీయాలు అంశాలవారీగా చేయాలే కానీ చిల్లరమల్లర విషయాలపై కాదని చెప్పారు. కుత్సిత మనసుతో రాజకీయాలు చేయకూడదన్నారు. ‘కులం, మతం ప్రాతిపదికన ఏ పార్టీ ప్రజల మనసులను గెలువలేదు. అన్ని వర్గాలను సమాన దృష్టితో చూడటమే బీఆర్ఎస్ విజయ రహస్యం’ అని సీఎం చెప్పారు. సమాజంలో ఎటువంటి ఆదరణలేక నిరాధారంగా ఉన్న ఒంటరి మహిళలను, బీడీ కార్మికులను మానవీయకోణంలో ఆదుకుంటున్న విషయాన్ని కూడా బలంగా చెప్పుకోవాలని సూచించారు.
గుజరాత్ మాడల్ బోగస్
గుజరాత్ మాడల్ బోగస్ అని ఇవ్వాళ దేశమంతా గుర్తించిందని, అదే సమయం లో తెలంగాణ మాడలే దేశానికి శరణ్యమని చెప్పుకోవటం ప్రతి తెలంగాణ బిడ కు గర్వకారణమని సీఎం కేసీఆర్ చెప్పా రు. ప్రధాని మోదీ దేశాన్ని మోసం చేస్తున్నాడని నిప్పులు చెరిగారు. ‘ఔరంగాబాద్‌లో ఒక ఐఏఎస్ ఆఫీసరే తెలంగాణ మా డలే శరణ్యమని బహిరంగ ప్రకటన చేసిం డు. ఇదీ తెలంగాణ సాధించిన అద్భుత విజయం. సూర్యాపేటలోనో, కామారెడ్డిలోనో లేదా మరో తెలంగాణ ప్రాంతంలో సభలు పెట్టుకుంటే వేలాదిమంది ప్రజలు రావడం సహజం. కానీ మహారాష్ట్రలోనూ అదే తరహాలో ప్రజలు మనకు బ్రహ్మరథం పడుతున్నారంటే దానికి బలమైన కారణం మనం ఆచరించి చూపించిన మాడల్. దీన్నిమనం బాగా చెప్పుకోవాలి. ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి’ అని కేసీఆర్ పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశా రు.
తెలంగాణ సాధించిన ఈ అపూర్వ ఘనతను చూసి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వంటి అనేక రాష్ర్టాలు ఆశ్చర్యపోతున్నాయన్నారు. మన ప్రతిభను, విజయాలను ఇతర రాష్ర్టాలవాళ్లు గొప్పగా చెప్పుకుంటున్నారని కానీ, మనం చేసిన పనులను చెప్పుకోవటంలేదని సీఎం కేసీఆర్ అన్నా రు. ‘దేశంలో గుణాత్మక మార్పు రావాలె. అందుకోసమే మనం బయల్దేరాం’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అదే క్రమం లో కాంగ్రెస్ పార్టీ అనుసరించిన విధానాలనూ ఆయన తూర్పారబట్టారు. ‘చెత్త కాంగ్రెస్.. 60 ఏండ్లల్ల దేశానికి ఏం చేసిం ది?’ అని ప్రశ్నించారు. ‘నెహ్రూ జమానాలో పంచవర్ష ప్రణాళికలు అమలు చేసి కొంతలో కొంత చేసిండు. ఆ తరువాత ఎవరూ ప్రణాళికాబద్ధ్దంగా దేశాన్ని ముం దుకు తీసుకుపోవాలని ఆశించలేదు’ అని ఆయన పేర్కొన్నారు.
ప్రజలే మనకు భగవద్గీత, వేదాలు
ఎమ్మెల్యేలు పిల్లలకోడిలా వ్యవహరించాలని, అందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత వారిపై ఉన్నదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని అన్నిస్థాయిల ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ ముం దుకు సాగాలని ఆయన ఎమ్మెల్యేలకు సూచించారు. అదే క్రమంలో పదేండ్ల కాలం లో మనం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలన్నారు. ‘మన బాస్‌లు తెలంగాణ ప్రజలే. వాళ్లే మనకు భగవద్గీత, వేదాలు’ అని ఆయన అన్నారు. ప్రజల మనసులను ప్రేమతో గెలవాలన్నారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాలు చాలా నియోజకవర్గాల్లో అద్భుతంగా జరిగాయని, కొన్నిచోట్ల మాత్రం అనుకున్నంతస్థాయిలో జరగలేదని చెప్పారు.