ఖమ్మం జిల్లా ప్రొద్దుటూరులో ఆత్మహత్య చేసుకున్న రైతు ప్రభాకర్ కుటుంబాన్ని బీఆర్ఎస్ నేతలు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి పరామర్శించారు. అనంతరం మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రభాకర్ పట్టా భూమిని అధికార పార్టీలోని నేతలు కబ్జా చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతల అరాచకం వల్లే ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు ప్రభాకర్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు.
రైతు సమస్యను అధికారులు పట్టించుకోవడం లేదని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. రైతు పొలంలో అక్రమంగా చొరబడిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. రైతు కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. మరోవైపు ప్రభాకర్ ఆత్మహత్యపై ఖమ్మం జిల్లా సీపీకి బీఆర్ఎస్ నేతలు నిరంజన్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. అధికారులు సహకరించకపోవడం వల్లే రైతు ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.
భూ వ్యవహారంలో ఆత్మహత్యకు పాల్పడిన ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరుకు చెందిన రైతు బోజడ్ల ప్రభాకర్ కుటుంబాన్ని ఆదుకునే విషయంలోనూ ప్రభుత్వం రాజకీయాలు చేస్తున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తన పొలం ఆక్రమణకు గురైందని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళ్తే సమయం మించిపోయిందని చెప్పి పంపడంతో విధిలేని పరిస్థితుల్లో ప్రభాకర్ ఈ నెల 1న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సందర్భంగా వీడియో ద్వారా తన ఆవేదనను బయటపెట్టాడు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించకపోవడం,బాధిత కుటుంబాన్ని పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తున్నది. ప్రభాకర్ మృతిపై సమగ్ర విచారణ జరిపిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా ఇప్పటి వరకు ఆయన కుటుంబాన్ని కన్నెత్తి చూసినవారే కరువయ్యారు. ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఇప్ప టి వరకు చిన్నపాటి సాయం కాదు కదా, కనీస ఓదార్పు కూడా లేకపోవడంతో ప్రభాకర్ కుటుంబ సభ్యులను ఆవేదనకు గురిచేస్తున్నది.
కుమారుడి మృతితో కష్టాల్లో కూరుకుపోయిన కుటుంబం వెతలు చెప్పనలవి కాకుండా ఉన్నాయి. దివ్యాంగుడైన ఆయన తండ్రి వీరభద్రయ్య న్యాయం కోసం జోలెపట్టి మరీ వేడుకున్నా ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. ప్రభాకర్ పిల్లలు విచారణకు వచ్చిన చింతకాని తహసీల్దార్ కాళ్లపై పడి తమకు న్యాయం చేయాలని వేడుకోవడం చూసిన వారి హృదయాలను ద్రవింపజేసినా ప్రభుత్వంలో మాత్రం చలనం లేకపోవడం ఆశ్చర్యపరుస్తున్నది. కలెక్టర్‌ను వేడుకున్నా ముందడుగు పడలేదు. ప్రభాకర్ మరణించి వారం రోజులు గడుస్తున్నా కేసు విచారణలో ఎలాంటి పురోగతీ లేదు. ఆయన ఆత్మహత్యకు కారకులెవరన్న విషయాన్ని ఫిర్యాదులో పేర్కొన్నా పోలీసుల నుంచి ఎలాంటి స్పందన లేదని వీరభద్రయ్య వాపోతున్నాడు. తమ భూమికి సంబంధించి అధికారులు ఇప్పటికీ స్పష్టత ఇవ్వడం లేదని కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. బాధిత కుటుంబాన్ని ప్రతిపక్ష పార్టీల నేతలు పరామర్శిస్తున్నా ప్రభుత్వానికి మాత్రం చీమకుట్టినట్టు కూడా లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.