చేర్యాల/మద్దూరు, జనవరి 4 : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాల, మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లో శనివారం ఆయన పర్యటించారు. చేర్యాల టౌన్, చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాలకు చెందిన పలువురికి సీఎంఆర్ఎఫ్, కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయకుండా కమిటీలు, కొర్రీలతో కాలయాపన చేస్తున్నదని విమర్శించారు. ఆరు గ్యారంటీలు, ఇతర హామీలు అమలు చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలేది లేదని స్పష్టంచేశారు. రైతుభరోసాకు మళ్లీ దరఖాస్తులు ఆహ్వానించడం సరికాదని అన్నారు.