KTR | యూనివర్సిటీ భూములపై కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్‌లోని నందినగర్ నివాసంలో కేటీఆర్‌తో మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ( మనూ ) విద్యార్థులు సమావేశమయ్యారు. యూనివర్సిటీకి చెందిన 50 ఎకరాల భూమిపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై చర్చించారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ఉర్దూ యూనివర్సిటీని నిర్వీర్యం చేసే కుట్రలను విద్యార్థులు వివరించారని తెలిపారు.
ఓఆర్ఆర్ కోసం మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ గతంలో 32 ఎకరాలు ఇచ్చిందని కేటీఆర్ తెలిపారు. ఖాజాగూడ లింక్ రోడ్డు కోసం మరో 7 ఎకరాల భూమి ఇచ్చారని పేర్కొన్నారు. ఇప్పుడు మళ్లీ 50 ఎకరాల భూమిపై రేవంత్ సర్కార్ కుట్రలు చేస్తుందని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రం రియల్ ఎస్టేట్ బ్రోకర్ చేతిలో ఉందని అన్నారు. అగ్రికల్చర్ యూనివర్సిటీ, హెచ్‌సీయూ భూములపై రేవంత్ కుట్రలు చేశారని మండిపడ్డారు. హెచ్‌సీయూలో రూ.10వేల కోట్ల కుంభకోణం జరిగితే కేంద్రం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
యూనివర్సిటీ భూములపై రేవంత్ సర్కార్ విరుచుకుపడుతుందని కేటీఆర్ విమర్శించారు. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని రాహుల్ గాంధీ చేస్తున్నది ఇదేనా అని ప్రశ్నించారు. మైనార్టీలపై ప్రేమ అంటే ఇదేనా అని నిలదీశారు. రెండు లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రశ్నించారు. చేతగాని సన్యాసి రాహుల్ గాంధీ అని విమర్శించారు. యూనివర్సిటీల్లోని భూములంటే వినియోగంలో లేని భూములా అని మండిపడ్డారు. మనూ భూముల కోసం విద్యార్థుల పోరాటానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక మనూను మరింత అభివృద్ధి చేసుకుందామని తెలిపారు. ఢిల్లీ వరకు వచ్చి మనూ విద్యార్థులతో కలిసి పోరాడుతామని స్పష్టం చేశారు.