హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ) : ఆదివారం జరిగిన రెండో విడత పంచాయతీ పోరులోనూ (Panchayathi Elections) బీఆర్ఎస్ (BRS) బలపరిచిన అభ్యర్థులు సత్తా చాటారు. అధికార కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులతో ఢీ అంటే ఢీ అనే రీతిలో తలపడ్డారు. తొలి విడత ఫలితాలతో కంగుతిన్న కాంగ్రెస్ (Congress) ప్రజాప్రతినిధులు, నేతలు రెండో విడత ఎన్నికల కోసం ఎక్కడికక్కడ తమ నియోజకవర్గాల్లో మోహరించి ప్రలోభాలకు గురిచేసినా ఫలితం లేకుండా పోయింది. కాంగ్రెస్ పాలనపై గ్రామీణుల్లోని వ్యతిరేకత మరోసారి బట్టబయలైంది. కాంగ్రెస్ ప్రభుత్వ రెండేండ్ల పాలనపై ఉన్న వ్యతిరేకత మలి విడత ఫలితాల్లోనూ ప్రతిబింబించింది. బీఆర్ఎస్ పార్టీపై ప్రజాభిమానం తేటతెల్లమైంది. రెండో విడత స్థానిక సమరంలో తొలివిడత కంటే దారుణంగా బొటాబొటీ మెజారిటీతోనే కాంగ్రెస్ సరిపెట్టుకున్నది. మరోవైపు, పల్లె గుండెలో గులాబీ వికసించింది.
అధికారపక్షానికి ముచ్చెమటలు పట్టించింది. రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 31 జిల్లాలు, 193 మండలాల్లోని 4,333 గ్రామాల్లో ఎన్నికలకు అధికారులు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందులో ఐదు గ్రామాల్లో వివిధ కారణాలతో నామినేషన్లు దాఖలు కాలేదు. మరో 415 జీపీలు ఏకగ్రీవమయ్యాయి. మరో రెండుచోట్ల ఎన్నికలు నిలిచిపోయాయి. మిగిలిన 3,911 జీపీలకు ఆదివారం పోలింగ్ నిర్వహించగా, 12,782 మంది అభ్యర్థులు బరి లో నిలిచారు. ఇందులో ఏకగ్రీవమైన స్థానా లు మినహాయించి అధికారపక్షమైన కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 1,982 స్థానాలు మా త్రమే గెలిచారు. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 1,297 స్థానాల్లో విజయకేతనం ఎగరవేశారు. ఇతరులు దాదాపు 381 స్థానాల్లో గెలుపొందగా, అందులోనూ 95 శాతానికిపైగా అభ్యర్థులు గులాబీ నేతలే కావడం గమనార్హం. వెరసి అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య సంఖ్యాబలం అత్యంత స్వల్పంగానే ఉన్నది. దీంతోనే కాంగ్రెస్‌పై గ్రామీణ ఓటర్లలో ఎంత వ్యతిరేకత ఉన్నదో స్పష్టంగా తేలిపోయింది.
రెండో దశ పంచాయతీ ఫలితాల్లోనూ సేమ్ సీన్ రిపీటైంది. ప్రలోభాలు, బెదిరింపులు, ఏకగ్రీవాల ముసుగులో కొనుగోళ్లు, దౌర్జన్యాలు, అధికార దుర్వినియోగం.. అన్నిటికీ తెగించినా పల్లెవాకిట కాంగ్రెస్‌కు మళ్లీ పరాభవమే ఎదురైంది. గ్యారెంటీల ధోకాతో గాయపడిన ఊరూరు గులాబీ గెలుపుతో గులాల్ చల్లుకుంటున్నది. రగులుతున్న జనం, ఎగురుతున్న గులాబీ జెండా.. అధికార పార్టీకి చుక్కలు చూపిస్తున్నాయి.
సాధారణంగా పంచాయతీ ఫలితాల్లో.. అధికార పక్షం మూడింట రెండొంతులు దక్కించుకుంటుంది. 2019లో ఏకగ్రీవాలను మినహాయిస్తే.. రెండోదశలో 4,130 గ్రామాల్లో ఎన్నికలు జరిగాయి. బ్యాలెట్ పోరులో తలపడి.. అప్పటి అధికార పార్టీ 64 శాతం పంచాయతీలను కైవసం చేసుకున్నది. కానీ ఇప్పుడేమైంది? అదిరించో బెదిరించో 50 శాతం పంచాయతీలనూ సాధించలేకపోవడం కాంగ్రెస్‌పై పెరుగుతున్న ప్రజావ్యతిరేకతకు సంకేతం.
రెండో దశలో 7 జిల్లాల్లో కాంగ్రెస్‌ను వెనక్కినెట్టిన బీఆర్ఎస్ పల్లెలపై తన పట్టును మరోసారి నిరూపించుకున్నది. మరో 17 జిల్లాల్లో హోరాహోరీగా తలపడుతూ అధికార పార్టీని కట్టడి చేసింది. దీంతో దిక్కుతోచని స్థితిలోపడిన కాంగ్రెస్.. క్షేత్రస్థాయి వాస్తవాలను దాచలేక ఆపసోపాలు పడుతున్నది. మీడియా మేనేజ్మెంట్తో తప్పుడు లెక్కలకు కుట్ర పన్నింది. పల్లెల్లో ఎవరు గెలిచినా.. అంకెల్ని తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నది. బీఆర్ఎస్ సంఖ్యను తగ్గించిచూపేలా వందిమాగధ మీడియాతో విఫలయత్నం చేస్తున్నది. అర‘చేతి’ని అడ్డుపెడితే గులాబీ సునామీ ఆగుతదా?
మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ పూర్తి ఆధిక్యం చాటింది. సిద్దిపేట అర్బన్, సిద్దిపేట రూరల్, చిన్నకోడూరు, నంగునూ రు, నారాయణరావుపేట మండలాల్లో 91 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించ గా బీఆర్ఎస్ 78 స్థానాలు కైవసం చేసుకున్న ది. హరీశ్‌రావుకు ఎవరూ పోటీలేరని మరోసారి నిరూపితమైంది. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు ఐదు స్థానాల్లో, బీజేపీ బలపర్చిన అభ్యర్థులు రెండు, ఇతరులు ఆరు స్థానాల్లో గెలుపొందారు. నూతనంగా గెలిచిన సర్పంచ్ అభ్యర్థులను హరీశ్‌రావు అభినందించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలోనూ బీఆర్ఎస్ ఆధిక్యం ప్ర దర్శించింది. రెండో విడతలో నియోజకవర్గం లో తంగళ్లపల్లి మండలంలో 30 స్థానాలకు 20 స్థానాల్లో గెలిచి గులాబీ ప్రభంజనం సృష్టించింది. జిల్లాలో మొత్తం 88 స్థానాలకు పోలింగ్ జరుగగా, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 38, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 36 స్థానాల్లో గెలిచారు. బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్నా ఆధిక్యం చాటుకున్నది. కేంద్ర మంత్రి బండి ఈ ప్రాంతం నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నా కనీస పోటీ ఇవ్వలేదు.

పలువురు మంత్రుల ఇలాకాల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటింది. సై అంటే సై అన్న తరహాలో పోటీ ఇచ్చింది. మంత్రి పొంగులేటి ఇలాకా ఖమ్మం జిల్లాలో అతిపెద్ద మూడు మేజర్ జీపీలు నేలకొండపల్లి, చెరువు మాదా రం, రాజేశ్వరపురాన్ని బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులే కైవసం చేసుకున్నారు. మంత్రి జూపల్లి నేతృత్వం వహిస్తున్న కొల్లాపూర్ నియోజకవర్గంలోనూ బీఆర్ఎస్ సత్తా చాటిం ది. మొత్తంగా 71 జీపీలకు ఎన్నికలు నిర్వహించగా, 30 మేజర్ జీపీలను బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులే గెలిచారు. సింగోటం, ఎడ్మపల్లె, పెద్దకొత్తపల్లి, కల్వకోలు, రాజాపూర్‌లో గులాబీ జయకేతనం ఎగురవేసింది. పెంట్లవెల్లి జీపీలో ఆరు వేల ఓట్లుండగా , బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థికి 1,572 ఓట్ల మెజారిటీ లభించడం విశేషం. కల్వకుర్తి, చేవెళ్ల నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థులు సత్తా చాటారు.
రెండో విడత ఎన్నికల్లో సగటున 85.86% ఓట్లు పోలయ్యాయి. పురుషులు 85.71, మహిళలు 86, ఇతరులు 41.96 శాతం ఓటుహక్కు వినియోగించుకున్నారు. మొత్తం 31 జిల్లాల్లో ఎన్నికలు నిర్వహించగా, 27 జిల్లాలో 80 శాతానికిపైగా, రెండు జిల్లాల్లో 90 శాతానికిపైగా, మరో రెండు జిల్లాల్లో 75 శాతానికిపైగా ఓట్లు పోలయ్యాయి. తొలి విడతతో పోలిస్తే రెండో విడతలో పోలింగ్ స్వల్పంగా పెరిగింది. తొలి విడతలో 84.28% పోలింగ్ నమోదుకాగా, రెండో విడతలో 85.86% నమోదైంది.
పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభంజనం వీస్తున్నది. వనపర్తి జిల్లాలో జరిగిన ఎన్నికే ఇందుకు నిదర్శనం. గోపాల్పేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ అభ్యర్థి స్వప్న భాస్కర్ (తొలివిడతలో ఎన్నిక జరిగింది) రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. 4,278 ఓట్లు పోలైన ఈ గ్రామంలో స్వప్న 2,180 మెజారిటీతో విజయం సాధించారు.

విశేషమేమిటంటే ఇది జనరల్ మహిళకు కేటాయించిన స్థానం కాగా, అక్కడ మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి దళిత మహిళ స్వప్నకు బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు. ఆమె అఖండ విజయం సాధించారు. రాష్ట్రంలో కేసీఆర్ పట్ల, బీఆర్ఎస్ పట్ల పల్లె జనం ఆదరణకు ఇంతకు మించిన నిదర్శనం లేదని పరిశీలకులు పేర్కొంటున్నారు.
యాదాద్రిభువనగిరి జిల్లాలో అత్యధికంగా 91.72% పోలింగ్ నమోదైంది, 2,02,716 మంది ఓటర్లకు 1,85,937 మంది ఓటేశా రు. పురుషులు 92,562మంది (91.83%), మహిళలు 93,375 (91.62%) మంది ఓటు వేశారు. ఖమ్మం జిల్లాలో 91.21% పోలింగ్ నమోదైంది. నిజామాబాద్ జిల్లాలో అత్యల్పంగా 76.71% ఓట్లు పోలయ్యాయి.
