హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ స్పీకర్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌కుమార్‌ను మండలి నుంచి ఏకపక్షంగా సస్పెండ్ చేశారని, దీనిపై ఓటింగ్ నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ చేసిన డిమాండ్‌ను చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తోసిపుచ్చారు. శాసనమండలి సమావేశాలు బుధవారం ఉదయం ప్రారంభమైన వెంటనే బీఆర్ఎస్ పక్ష నేత మధుసూదనాచారి మాట్లాడుతూ.. బీఆర్ఎస్కు చెందిన ఇద్దరు ఎమ్మెల్సీల సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
సభ్యులపై సస్పెన్షన్ విధించడానికి ముందు వారి వివరణ తీసుకోవాలని చెప్పారు. సభ్యుల వివరణ తర్వాత ఓటింగ్‌కు అవకాశం కల్పించాల్సి ఉన్నప్పటికీ ఏకపక్షంగా సస్పెండ్ చేశారని అన్నారు. సభలో బీఆర్ఎస్కు 20 మంది సభ్యుల మద్దతు ఉన్నప్పటికీ సస్పెన్షన్‌పై ఓటింగ్ నిర్వహించకుండా చర్యలు తీసుకోవడం అన్యాయమని వాపోయారు. ఓటింగ్ జరుపాలన్న బీఆర్ఎస్ సభ్యుల డిమాండ్‌ను చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తోసిపుచ్చారు. వెంటనే ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు సస్పెన్షన్‌పై ఓటింగ్ నిర్వహించాలంటూ పెద్దఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.
బీఆర్ఎస్ విప్ దేశపతి శ్రీనివాస్, మండలి ఉప నేత పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, శంభీపూర్‌రాజు, నవీన్కుమార్రావు పోడియంలో బైఠాయించి నిరసన తెలిపారు. మిగతా సభ్యులు వారివారి సీట్ల వద్ద నిల్చొని నినాదాలు చేశారు. సభ్యులు నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ పట్టించుకోకుండా ప్రశ్నోత్తరాలను కొనసాగించడంపై బీఆర్ఎస్ పక్ష నేత మధుసూదనాచారి అభ్యంతరం వ్యక్తంచేశారు. సభ్యుల హక్కులను కాపాడాల్సిన చైర్మన్ పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తంచేశారు. ప్రభుత్వం సభ నిర్వహిస్తున్న తీరు గర్హనీయమని పేర్కొంటూ.. చైర్మన్ తీరును నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించారు. బీఆర్ఎస్ సభ్యులు సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభ నుంచి బయటకు వచ్చారు.
‘ఎథిక్స్ ’కమిటీకి సిఫారసు: గుత్తా
స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డిని సస్పెండ్ చేయాలంటూ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేసినట్టు చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రకటించారు. తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డి వ్యవహారంపై పూర్తి విచారణను ఎథిక్స్ కమిటీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. చైర్మన్ సిఫార్సు మేరకు గురువారం సాయంత్రం కౌన్సిల్ ఎథిక్స్ కమిటీ చైర్మన్ మహేశ్‌కుమార్‌గౌడ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డి స్పీకర్‌పై చేసిన వ్యాఖ్యలపై చర్చించారు. సభాహక్కుల ఉల్లంఘన కింద ఎథిక్స్ కమిటీ నివేదిక ఆధారంగా రాబోయే రోజుల్లో ఈ ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నారు.