BRS | హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడం లాంఛనమేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈసారి కూడా ప్రతిపక్షాల కలలు నెరవేరే అవకాశం లేదని తేల్చి చెప్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో మాదిరిగానే 2018 ఎన్నికల్లో కూడా చాలామంది అభ్యర్థులను సీఎం కేసీఆర్ మళ్లీ బరిలోకి దించారని, 2014 కన్నా మెరుగైన ఫలితాలు సాధించారని ఉదహరిస్తున్నారు. ఈసారి కూడా ‘సీన్ రిపీట్’ అవుతుందన్న విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
సగం కన్నా ఎక్కువ ఓట్లు బీఆర్ఎస్కే
2014లో బీఆర్ఎస్ 63 సీట్లు గెలుచుకోగా ఆ పార్టీకి చెందిన 19 మంది అభ్యర్థులు 50% కన్నా ఎక్కువ ఓట్ షేర్ సాధించారు. 2018లో బీఆర్ఎస్ 88 సీట్లు గెలుచుకోగా.. 50 స్థానాల్లో 50% కన్నా ఎక్కువ ఓట్ షేర్ లభించింది. ఆ మేరకు ప్రజాదరణ పెరిగిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 2018లో మంత్రి హరీశ్‌రావుకు 78.59%, మంత్రి కేటీఆర్‌కు 70.89%, ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌కు 69.35%, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్‌కు 65.27% శాతం ఓటు షేర్ వచ్చింది. బీఆర్ఎస్ పట్ల ప్రజాదరణ ఇంత బలంగా ఉన్న 50 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులను ఓడించడం ప్రతిపక్షాలకు కష్టమేనని చెప్తున్నారు. అంతర్గత కుమ్ములాటలతో సతమతం అవుతున్న కాంగ్రెస్, ఉనికిలో లేకుండా పోతున్న బీజేపీ వంటి పార్టీల ప్రభావం ఆయా స్థానాల్లో నామమాత్రమేనని స్పష్టం చేస్తున్నారు.
బీఆర్ఎస్ శ్రేణుల కదనోత్సాహం
కాంగ్రెస్ నేతలు, శ్రేణులు కొన్నేండ్లుగా ప్రజల మధ్య లేరని, ఎన్నికల నేపథ్యంలో కాస్త హడావుడి చేస్తున్నారనేది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. బీజేపీకి అనేకచోట్ల లీడర్లు, క్యాడర్ లేరు. ఇదే సమయంలో బీఆర్ఎస్ కదనోత్సాహంతో కదులుతున్నదని, ప్రణాళిక ప్రకారం సాగుతున్నదని వివరిస్తున్నారు. సీఎం కేసీఆర్ ఏ పథకాన్ని ప్రారంభించినా బీఆర్ఎస్ నేతలు ప్రజల మధ్యకు వెళ్లి లబ్ధిదారులను నేరుగా కలుస్తున్నారని, ఇది ఆ పార్టీకి ఓటింగ్ శాతాన్ని పెంచుతుందని భావిస్తున్నారు. గత ఏడాది నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాలతోనే బీఆర్ఎస్ శ్రేణులను ఎన్నికలకు సిద్ధమయ్యాయయని, అప్పటికి కాంగ్రెస్, బీఆర్ఎస్ సోదిలోనే లేవని గుర్తుచేస్తున్నారు. బీఆర్ఎస్ పూర్తి జాబితా విడుదల చేయడంతో తాము ఎవరి గెలుపుకోసం పనిచేయాలో, ప్రజలకు ఏమని చెప్పాలో బీఆర్ఎస్ కార్యకర్తలకు స్పష్టత ఉన్నదని, కాంగ్రెస్, బీజేపీలో ఆ పరిస్థితి లేదని చెప్తున్నారు.
అభ్యర్థులను మార్చకపోయినా..
2018 ఎన్నికల్లో 50 శాతానికిపైగా ఓట్ షేర్ సాధించిన ఎమ్మెల్యేల్లో 13 మంది 2014లో గెలిచి, మరోసారి బరిలో నిలిచినవారే. చాలామందికి ఓటు షేర్ ఐదేండ్లలో మరింత పెరిగింది. దీనిని బట్టి వారికి ప్రజల్లో ఆదరణ పెరిగిందని వివరిస్తున్నారు. ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ చాలా బలంగా ఉన్నదని చెప్తున్నారు. ఉమ్మడి మెదక్, ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో కలిపి 37 సీట్లు ఉండగా ఇందులో 31 సీట్లు (84%) బీఆర్ఎస్ గెలుచుకోవడం విశేషం. ఇందులో 24 సీట్లలో 50 శాతానికిపైగా ఓట్ షేర్ సాధించినట్టు విశ్లేషిస్తున్నారు.
కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు జిల్లాలపై ఆయా రాష్ర్టాల రాజకీయాల ప్రభావం కూడా కొంత ఉంటుందని చెప్తున్నారు. కర్ణాటకలో బీజేపీ ఎందుకు ఓడిపోయిందో, కాంగ్రెస్ గెలిచిన తర్వాత రాష్ట్రం క్రమంగా అంధకారంలో ఎలా మునిగిపోతున్నదో వారు స్వయంగా చూస్తున్నారని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. మహారాష్ట్రలో అభివృద్ధిని పక్కనబెట్టి రాజకీయ అనిశ్చితి, ప్రభుత్వాలు కూలిపోవడం, పార్టీలు చీలిపోవడం వంటి పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారని వివరించారు. సరిహద్దు నియోజకవర్గాల ప్రజలు సీఎం కేసీఆర్ నేతృత్వంలోని సుస్థిర, అభివృద్ధి, సంక్షేమ పాలనను, పొరుగు రాష్ర్టాల్లోని పరిస్థితిని బేరీజు వేసుకుంటారని చెప్తున్నారు.
