వేములవాడ, డిసెంబర్ 16: రాజన్న కోడెల వ్యవహారంలో వేములవాడ ఎమ్మెల్యే, విప్ ఆది శ్రీనివాస్ మౌనం.. కబేళాకు విక్రయంచడం అంగీకారమేనా..? అని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గం ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు ప్రశ్నించారు. సోమవారం వేములవాడ ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు ఫొటోలు దిగడంలో ఉన్న శ్రద్ధ ఆలయ అభివృద్ధి, భక్తుల మనోభావాలపై లేదని విమర్శించారు. రాజన్న ఆలయ కోడెలు కబేళాలకు తరలిస్తున్నా, మంత్రి కొండా సురేఖ అనుచరులకు కట్టబెట్టిన తీరు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినా ఎందుకు మాట్లాడడంలేదో చెప్పాలని నిలదీశారు.
వరంగల్ జిల్లా గీసుకొండ పరిధిలోని ముగ్గురికి 33 మంది రైతుల పేరిట పంపిణీ చేసిన 66 కోడెల వ్యవహారం బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. వీటిలో 28 జీవాలను కబేళాలకు అమ్మడం బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు. గతంలో రైతులకు ఇచ్చామన్న 1,734 కోడెలపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల వేములవాడ పర్యటన సందర్భంగా భోజనాల కోసం రూ.32లక్షలు బిల్లు చేశారని, ఒక్కో ప్లేటుకు రూ.32 వేలు ఖర్చుచేయడం ప్రపంచంలో ఎక్కడా చూడలేదని చెప్పారు. రూ.2కోట్లను ఆలయం నుంచి చెల్లించాలనడం విడ్డూరమని ఎద్దేవాచేశారు.
కోడెలను అమ్ముకున్న మాదాసు రాంబాబుపై కేసు నమోదుకావడంతో ఆలయ అధికారులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ పట్ణణ అధ్యక్షుడు రేగుల సంతోష్‌బాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రజావాణిలో కలెక్టర్ సందీప్కుమార్ఝాకు వినతిపత్రాన్ని అందజేశారు.