హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): విదేశాల్లో ఉంటూ కూడా పార్టీకి ఎల్లప్పుడూ అండగా నిలుస్తూ అద్భుతంగా పనిచేస్తున్నారని ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్‌రెడ్డి బృందాన్ని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ప్రశంసించారు. అదే స్ఫూర్తిని కొనసాగించాలని, మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని చెప్పారు. ఎన్నారై బీఆర్ఎస్ యూకే విభాగం 15వ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం నందినగర్‌లో పార్టీ అధినేత కేసీఆర్‌తోపాటు కేటీఆర్‌ను ఎన్నారై నేతలు కలుసుకున్నారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఉద్యమ సమయం నుంచి లండన్ వేదికగా మీరు చేసిన పోరాటం ఎప్పటికీ మరువలేనిదని, తెలంగాణ ప్రజలకు అండగా ఉంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేయాలని సూచించారు. అనంతరం కేటీఆర్ కేక్‌కట్ చేసి యూకే విభాగానికి 15వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ఎన్నారై బీఆర్ఎస్ యూకే విభాగం కోఆర్డినేటర్ మహేశ్ బిగాల, సలహామండలి చైర్మన్ సికా చంద్రశేఖర్‌గౌడ్, ఉపాధ్యక్షుడు సతీశ్‌రెడ్డి గొట్టెముకల, కార్యదర్శి రవిప్రదీప్ పులుసు తదితరులు పాల్గొన్నారు.