BRS @ 25 Years | హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి ఏప్రిల్ 27తో 25వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన త్వరలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నట్టు సమాచారం. అయితే, ముందు అనుకున్నట్టుగా ఈ ఫిబ్రవరిలో భారీ బహిరంగ సభ నిర్వహించి, అప్పటి నుంచి పార్టీ సంస్థాగత నిర్మాణం పూర్తి చేయాలని.. ఏప్రిల్ 27వ తేదీన ప్రతినిధుల సభను నిర్వహించుకోవాలా? లేదంటే పార్టీ అధ్యక్ష ఎన్నిక ఉన్న సెప్టెంబర్లో భారీ బహిరంగసభ నిర్వహించుకోవాలా? అనే విషయాలపై పార్టీ లోతుగా సమాలోచనలు జరుపుతున్నది. వీటిపై సమగ్రంగా చర్చించి, నిర్ణయం తీసుకోవటానికి పార్టీ నాయకత్వం త్వరలో కార్యవర్గ సమావేశం నిర్వహించాలని భావిస్తున్నట్టు తెలిసింది. అయితే, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదాపడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ నెల చివరిలో బహిరంగ సభ పెట్టడం ఎందుకనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పార్టీ ఆవిర్భావ వేడుకల నేపథ్యంలో ప్రతినిధుల సభ పెట్టడమా? ఏప్రిల్ నెలాఖరుతో మొదలుపెట్టి సంస్థాగతం నిర్మాణం పూర్తి చేసుకొని సెప్టెంబర్లో జరిగే అధ్యక్ష ఎన్నిక నాటికి భారీ బహిరంగ సభ పెట్టుకోవటమా? అనే అంశాలపై కార్యవర్గ సమావేశంలో విస్తృతంగా చర్చించే అవకాశాలున్నాయని తెలిసింది. ఏప్రిల్ 27వ తేదీన రజతోత్సవ సంవత్సరంలోకి అడుగుపెడుడుతున్నాం కనుక, రెండు రోజులు ప్రతినిధుల సభను నిర్వహించి అధ్యక్ష ఎన్నిక జరిగే సెప్టెంబర్లో భారీ బహిరంగ సభను నిర్వహిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు సైతం పార్టీ నేతల్లో వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఏప్రిల్లో బహిరంగసభ నిర్వహించి అప్పటి నుంచి సెప్టెంబర్ దాకా గ్రామస్థాయి…రాష్ట్రస్థాయిదాకా పార్టీ అన్నిస్థాయిల పార్టీల కమిటీలు, పార్టీ అనుబంధ కమిటీలను వేసుకొని ఆ తరువాత ప్రతినిధుల సభ నిర్వహిస్తే ఎలా ఉంటుంది? అనే కోణంలోనూ నాయకత్వం చర్చిస్తున్నట్టు జరుపుతున్నట్టు సమాచారం. అయితే, వీటిపై పార్టీ అన్నిస్థాయిల్లో సమాలోచనలు చేసి సుదీర్ఘంగా చర్చించి ఒక నిర్ణయం తీసుకునేందుకు త్వరలో పార్టీ కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నట్టు తెలుస్తున్నది.