సంగారెడ్డి : సిగాచీ పరిశ్రమలో పేలుళ్లు సంభవించి 54 మంది మరణించారని, ఈ దుర్ఘటన జరిగి నెలరోజులైనా బాధిత కుటుంబాలకు పరిహారం అందలేదని బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆవేదన వ్యక్తంచేశారు. సోమవారం బాధిత కుటుంబాలతో కలిసి ఆయన సంగారెడ్డి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అక్కడ అడిషనల్ కలెక్టర్‌ను కలిసి.. బాధిత కుటుంబాలకు మృతదేహాలను అందించడంలో, పరిహారం అందించడంలో ప్రభుత్వ వైఫల్యంపై నిలదీశారు.
ఆ తర్వాత హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ‘సిగాచి ఘటన జరిగి నెల రోజులు కావొస్తున్నది. బాధిత కుటుంబాలు కన్నీళ్ల మధ్య నెలమాసికాలు చేసుకుంటున్నారు. ఘటన జరిగినప్పుడు సీఎం వచ్చి కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఇప్పటికి నెల రోజులు అయ్యింది. ఒక్కరికి కూడా ఎక్స్‌గ్రేషియా అందలేదు. అంతిమ కార్యక్రమాలు జరిపేందుకు శవాలు కూడా ఇవ్వని దుస్థితి ఉంది. బూడిదను తీసుకువెళ్లి గోదావరిలో కలుపుకున్నమని బాధితులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఉమ్మడి ఏపీలో, మన రాష్ట్రంలో ఇంత దారుణమైన ప్రమాద ఘటన ఎన్నడూ జరగలేదు. 54 మంది చనిపోతే ప్రభుత్వ స్పందన అత్యంత దయనీయంగా ఉంది. ఇది పూర్తిగా బాధ్యతారాహిత్యం. ఎక్స్ గ్రేషియా, డెత్ సర్టిఫికెట్ ఎప్పుడు ఇస్తారని అడిగితే.. ఎస్ఎల్బీసీ ఘటనలో శవాలు కూడా దొరకలేదు, మీకు బూడిదైనా దొరికిందని అత్యంత అమానవీయంగా మాట్లాడుతున్నారని బాధితులు చెబుతున్నారు. ఏపీ, బీహార్, జార్ఖండ్, యూపీ నుంచి వచ్చి ఉండాలంటే 20 నుంచి 30 వేలు ఖర్చవుతుందని బాధితుల కుటుంబసభ్యులు బాధపడుతున్నారు.
సీఎం కోటి ఇస్తామన్నరు, ఎప్పుడు ఇస్తారు, ఎవరు ఇస్తారని అడిగితే ఎవరూ చెప్పడం లేదని బాధిత కుటుంబీకులు అంటున్నారు. చాలామంది ఆసుపత్రుల్లో వైద్యం పొందుతున్నారు. తీవ్రంగా గాయపడ్డవారికి సీఎం పది లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. కానీ రూ.50 వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు.
తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 లక్షలు ఇచ్చి, నెలనెలా వేతనం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం’ అన్నారు.
‘బాధితులకు పరిహారం ఇవ్వాలని సైంటిస్ట్ ఫర్ పీపుల్ స్వచ్చంధ సంస్థ హైకోర్టులో రిట్ పిటిషన్ వేసింది.
నెల గడిచినా ఎంతమంది చనిపోయారు, ఎంతమంది క్షతగాత్రులు అనే విషయాన్ని అధికారికంగా వెల్లడించలేదు. చనిపోయినవారి పేర్లు, ఎవరెవరికి ఎంత ఇచ్చారు, క్షతగాత్రులకు ఎంత ఇచ్చారు అనేది ఈ ప్రభుత్వం ఎందుకు దాచి పెడుతున్నది..? ఇప్పటివరకు నష్టపరిహారం వివరాలు వెల్లడించకుండా ఎందుకు గోప్యంగా ఉంచారో సమాధానం చెప్పాలి. చనిపోయిన జగన్మోహన్ కొడుకు యశ్వంత్ ఇచ్చిన ఫిర్యాదులో.. సిగాచి కంపెనీలో పాత మిషన్ వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందని అనేకసార్లు కార్మికులు చెప్పినా, కంపెనీ పట్టించుకోలేదని పేర్కొన్నారు. అంటే యాజమాన్యం పూర్తి నిర్లక్ష్యంగా ఉంది. ఎందుకు యాజమాన్యం మీద కేసు పెట్టలేదు. ఫిర్యాదులో స్పష్టంగా ఉంది. ఎఫ్ఐఆర్ కూడా అయ్యింది. ఎందుకు యాజమాన్యాన్ని కాపాడుతున్నవు రేవంత్ రెడ్డి..? ఎందుకు యాజమాన్యంతో కుమ్మక్కు అయ్యావు..? కంపెనీతో ఉన్న లాలూచి ఏమిటి? బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. శవాలు ఇవ్వకుండా 8 మంది మిస్సింగ్ అంటూ ఎందుకు వేధిస్తున్నారు. వెంటనే డెత్ సర్టిఫికెట్ ఇచ్చి, ఆ కుటుంబాలకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలి’ అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
‘మేం అందరం డిమాండ్ చేస్తే తెల్లారి మెల్లగ సీఎం వచ్చి, మీడియా ముందు ఫోజులు కొట్టిండు.
కంపెనీని తిట్టినట్లు బిల్డప్ ఇచ్చి పోయిండు. కోటి ఎవరు ఇస్తారు..? ప్రభుత్వమా, కంపెనీనా..? అని మీడియా అడిగితే ఎవరు ఇస్తే ఏందని ఆ రోజు సీఎం దబాయించిండు. కంపెనీ కూడా 15 రోజుల్లో పరిహారం ఇస్తామని పత్రికా ప్రకటన ఇచ్చింది. ఇప్పటికీ దిక్కులేదు. ఏపీలో 2024 ఆగస్టు 20న అనకాపల్లిలో ఓ కంపెనీలో ప్రమాదం జరిగి 17 మంది మరణించారు. పలువురికి గాయాలయ్యాయి. వారికి మూడు రోజుల్లో పరిహారం అందించారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు, తీవ్రంగా గాయపడితే రూ.50 లక్షలు, తక్కువగా గాయపడితే రూ.25 లక్షలు పరిహారం ఇచ్చారు. అక్కడ మూడు రోజుల్లో ఇస్తే, ఇక్కడ నెల రోజులు గడిచింది. అయినా ఎందుకు ఇవ్వడం లేదు. ఇచ్చిన హామీ మేరకు మరణించిన వారి కుటుంబాలకు కోటి రూపాయలు, తీవ్రంగా గాయపడితే రూ.50 లక్షలు. తక్కువగా గాయపడితే రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.
అసలు ఎవరు ఇస్తరు, ఎక్కడ ఇస్తరు..? నువ్వు పట్టించుకోవు. కంపెనీ పట్టించుకోదు. కరోనా సమయంలో కేసీఆర్ వలస కార్మికులను పట్టించుకున్నరు. సీఎస్‌కు బాధ్యతలు అప్పగించి కార్మికులను జార్ఖండ్, యూపీ, బీహార్ లాంటి వారి సొంత రాష్ట్రాలకు రైళ్లలో పంపించారు. వలస కార్మికులు తెలంగాణ అభివృద్దిలో భాగస్వాములు అని వారికి ఎంతో గౌరవం ఇచ్చాడు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం మృతదేహాలను నూనె డబ్బాల్లో ప్యాక్ చేసి ఇచ్చిండు. ఇది రేవంత్ రెడ్డి, ఈ కాంగ్రెస్ దుర్మార్గ, అమానవీయ చరిత్ర. వలస కార్మికుల డెడ్ బాడీలను అగౌరవపరిచావు. ఇంత దారుణం ఎందుకు రేవంత్ రెడ్డి’ అని మాజీ మంత్రి ప్రశ్నించారు.
‘అసలు ఈ సిగాచీ ప్రమాదం ఎలా జరిగిందో ఎందుకు బయట పెట్టడంలేదు. నువ్వు వేసిన కమీటి రిపోర్టు యాడ పోయింది..? నెల రోజులు గడస్తున్నా 54 మంది ప్రాణాలు తీసిన కంపెనీపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు. మృతుల్లో తెలంగాణకు చెందిన వారు ఇద్దరు, ఏపీకి చెందిన వారు 9 మంది, మరో 43 మంది యూపీ, బీహార్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల వారు ఉన్నారు. ఎవరిదైనా ప్రాణమే. ఎందుకు ఇంత నిర్లక్ష్యం..? చనిపోయిన వారికి కోటి రూపాయలు, తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.50 లక్షలు, తక్కువగా గాయపడితే రూ.25 లక్షలు వెంటనే అందించాలి. అందరికీ డెత్ సర్టిఫికెట్, పంచనామా కాపీ, ఎఫ్ఐఆర్ కాపీలు ఒక ఫోల్డర్లో పెట్టి కుటుంబసభ్యులకు ఇవ్వాలి. గతంలో ఇలాంటి ప్రమాదమే సంగారెడ్డిలో జరిగితే వారం రోజుల్లో రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా, సర్టిఫికెట్లు ఇంటికి వెళ్లి ఇచ్చినం. నెల గడుస్తున్నది తప్ప ఎప్పుడైనా ఈ ఘటన మీద సమీక్ష చేసావా..? ఢిల్లీకి వెళ్లడం రావడం తప్ప ఏనాడైనా బాధతో ఒక రివ్యూ అయినా చేసావా..? ఎస్ఎల్బీసీ ఘటన జరిగి 150 రోజులు అయినా శవాలు బయటికి రావడంలేదు. వారు
చనిపోయారో, బతికి ఉన్నారో తెలియదు. సిగాచి ఘటనలో 8 మంది శవాలు ఇవ్వలేదు. బొక్కలు ఇవ్వలేదు. బూడిద ఇవ్వలేదు’ అని హరీశ్‌రావు విమర్శించారు.
‘ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవడంలో రేవంత్ ప్రభుత్వం వైఫల్యం. ప్రమాదాలు జరిగినప్పుడు సకాలంలో స్పందించడంలో రేవంత్ ప్రభుత్వం వైఫల్యం. మృతదేహాలు అప్పగించడంలో రేవంత్ ప్రభుత్వం వైఫల్యం. పరిహారం చెల్లించడంలో రేవంత్ ప్రభుత్వం ఘోర వైఫల్యం. బాధితులను సకాలంలో మంచి ఆసుపత్రులకు చేర్చి ఉంటే ఆరు ప్రాణాలు దక్కేవి. ఆసుపత్రిలో చేరాక సరైన వైద్యం అందక ఆరుగురు చనిపోయారు. ఇప్పటికీ 14 మంది ఆసుపత్రిలో ఉంటే, అందులో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. వారు చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నరు. వారికైనా మంచి వైద్యం అందించు. నీ కుటుంబసభ్యులు ఆసుపత్రిలో ఉంటే ఇట్లనే చూస్తవా..? కాపాడుకోవా..? ఎస్ఎల్బీసీ ఘటన జరిగితే హెలికాప్టర్లు వేసుకొని వెళ్లారు తప్ప డెడ్ బాడీలు తేలేదు. చేపలు మంచిగుంటయని ఓ మంత్రి చేపల పులుసు తిన్నడు. పెట్టిన డేట్లు మారాయి తప్ప, డెడ్ బాడీలను బయటికి తేలేదు. ఎస్ఎల్బీసీ, సిగాచి ఘటనల్లో ప్రభుత్వ బాధ్యతారాహిత్యం స్పష్టంగా కనిపిస్తున్నది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే జైళ్లలో పెడతావు. కేసులు పెడతావు. 54 మంది ప్రాణాలు బలితీసుకున్న కంపెనీపై మాత్రం కేసు పెట్టవు. ఎస్ఎల్బీసీ ఘటన జరిగితే సమన్వయం చేయలేదు. సొరంగం భవిష్యత్తు ప్రశ్నార్థకం అయ్యింది. ఎస్ఎల్బీసీలో ఆరు శవాలు, సిగాచిలో 8 మంది శవాలు మొత్తం 14 శవాలు ఏమయ్యాయి..? మిస్సింగ్ అని ఎలా తప్పించుకుంటారు..? బాధితుల గోస వినపడటం లేదా..? సీఎం ఇలాంటి విషయంలో బాధ్యతారాహిత్యంగా ఉండటం సరికాదు. ఇప్పటికైనా కళ్ళు తెరువాలి. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే బీఆర్ఎస్ తరఫున పోరాటం తీవ్రతరం చేస్తాం’ మాజీ మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు.