BRS | హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : లగచర్లలో పోలీసుల దౌర్జన్యకాండ, గిరిజన రైతులపై థర్డ్ డిగ్రీ, రైతుకు బేడీలు వేసిన ఘటనను నిరసిస్తూ సోమవారం బీఆర్ఎస్ సభ్యులు చేసిన ఆందోళనలతో ఉభయసభలు దద్దరిల్లాయి. బాధిత రైతులకు న్యా యం జరిగేదాకా కాంగ్రెస్ సర్కార్‌ను వదిలేది లేదని గులాబీ పార్టీ హెచ్చరించింది. బీఏసీ సమావేశం తర్వాత మధ్యాహ్నం రెండున్నరకు శాసనసభ సమావేశం కాగానే పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యాటక బిల్లుపై చర్చ ప్రారంభించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సభ్యులు ముందుగా లగచర్ల గిరిజన రైతులపై పోలీసులు సాగించిన దమనకాండపై చర్చించేందుకు అనుమతించాలని పట్టుబట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ లగచర్ల రైతులపై పోలీసు దౌర్జన్యకాండను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. ఈ అంశంపై తాము ఇచ్చిన వాయిదా తీర్మానాలను ఆమోదించి చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. లగచర్లలో ఫార్మా పేరిట ప్రభుత్వ నిర్బంధ భూసేకరణను ప్రతిఘటించిన అమాయక గిరిజన రైతులపై సర్కార్ నిర్బంధకాండ, పోలీసుల థర్డ్ డిగ్రీ ప్రయోగం, నెల రోజులుగా వారిని జైళ్లలో బంధించిన అంశంపై చర్చ కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు వాయిదా తీర్మానం ఇచ్చారు.
దీనిని తిరస్కరిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించడంతో బీఆర్ఎస్ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘ఇదేమి రా జ్యం ఇదేమి రాజ్యం.. దొంగల రాజ్యం దోపిడి రాజ్యం’ ‘నహీచలేగా నహీచలేగా.. తానాషాహీ నహీచలేగా’ ‘నహీచలేగా నహీచలేగా.. లాఠీ లూటీ నహీచలేగా’ అంటూ పెద్దపెట్టున నినదించారు. శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు జోక్యం చేసుకుంటూ, విపక్ష సభ్యులు సభాసంప్రదాయాలు పాటించాలని కోరారు. ఆందోళన విరమించాలని, మాట్లాడే అవకాశం కల్పిస్తామని సభాపతి సూచించారు. బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన కొనసాగించడంతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రూల్ బుక్‌లోని అంశాలను చదివి వినిపించారు. సభలో నినాదాలు చేయడం, ప్లకార్డులు ప్రదర్శించడం నిబంధనలకు విరుద్ధమని చెప్పారు. అయినా బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన కొనసాగించడంతో నిరసన మధ్యనే మంత్రి జూపల్లి ప్రసంగం కొనసాగించాలని స్పీకర్ సూచించారు. విపక్ష సభ్యుల వద్ద ఉన్న ప్లకార్డులను తీసుకోవాలని మార్షల్స్‌కు స్పీకర్ ఆదేశించారు. మార్షల్స్ దగ్గరకు రావడంతో బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్ పోడియంవైపు దూసుకెళ్లారు. బీఆర్ఎస్ సభ్యుల నినాదాలు, ప్లకార్డులు తీసుకునేందుకు మార్షల్స్ ప్రయత్నించడంతో కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో సభను స్పీకర్ మంగళవారానికి వాయి దా వేశారు. మరోవైపు మూసీ ప్రక్షాళన -నిర్వాసితుల సమస్యలు, భయాందోళనలపై చర్చకు సీపీఐ శాసనసభాపక్షనేత కూనంనేని సాంబశివరావు, కాగజ్‌నగర్ ప్రాంతంలో పెద్దపులి దాడులు, నష్టపరిహారం చెల్లింపుపై బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు ఇచ్చిన వా యిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు.
మండలి పోడియాన్ని చుట్టుముట్టిన సభ్యులు
శాసన మండలిలోనూ లగచర్ల అంశంపై చర్చకు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టారు. ఆ మేరకు వాయిదా తీర్మానం కోరారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి నిరాకరించారు. దీంతో ‘లగచర్ల బాధితులకు న్యాయం చేయాలి.. రైతులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తి వేయాలి’ అంటూ శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ఆధ్యరంలో బీఆర్ఎస్ సభ్యులు చైర్మన్ పోడియాన్ని చుట్టుముట్టారు. రైతులకు న్యాయం చేయాలని ప్లకార్డులు ప్రదర్శించారు. పెద్ద పెట్టున నినాదాలు చేయడంతో మండలి హోరెత్తింది. సభ ముం దుకు సాగకపోగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడే ప్రయత్నం చేసినా వీలుకాలేదు. దీంతో మండలిని మంగళవారానికి వాయిదా వేస్తూ చైర్మన్ ప్రకటించారు.
చైర్మన్ కార్యాలయం ఎదుట ధర్నా
సమావేశం వాయిదా పడిన అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్సీలంతా మండలి చైర్మన్ కా ర్యాలయం ఎదుట బైటాయించి ధర్నా చేశా రు. లగచర్ల రైతులపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన నినాదాలతో మండలి ప్రాంగణం మార్మోగింది. అనంతరం మండలి మీడియా పాయింట్లో మధుసూదనాచారి మాట్లాడుతూ లగచర్ల అంశంపై మండలిలో వాయిదా తీర్మానం కోరితే చైర్మన్ అనుమతించలేదని, రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి కనీసం మానవత్వం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. గతంలో రేవంత్‌రెడ్డిపై పట్నం నరేందర్‌రెడ్డి గెలిచిన నేపథ్యంలో ఆయనపై సీఎం కక్ష సాధింపు చర్యలకు దిగారని విమర్శించారు. ఇప్పటి వరకు నరేందర్‌రెడ్డికి బెయిల్ రాలేదని చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వాణీదేవి, సత్యవతి రాథోడ్, తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎల్ రమణ, తాతా మధు, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, కోటిరెడ్డి, డాక్టర్ యాదవరెడ్డి, నవీన్‌రెడ్డి పాల్గొన్నారు.
దద్దరిల్లిన మీడియా పాయింట్
లగచర్ల రైతుల అంశంపై చర్చించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీని వాయిదా వేసిన వెంటనే బీఆర్ఎస్ ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలంతా కలిసి సభ నుంచి లాబీల వైపు నినాదాలు చేస్తూ బయటకు వచ్చారు. ఎమ్మెల్యేల ఎంట్రీ గేటు వద్ద ఫ్లకార్డులు ప్రదర్శించి పెద్దపెట్టున నినాదాలు చేశారు. ‘గిరిజన రైతులకు సంకెళ్లా? సిగ్గు సిగ్గు’ ‘గిరిజన బిడ్డలకు బేడీలా? సిగ్గు సిగ్గు’ ‘ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం.. లాఠీరాజ్యం.. లూటీ రాజ్యం’ ‘రైతులకేమో జైళ్లు.. మంత్రులకేమో జల్సాలు?’ అంటూ రైతుల పక్షాన నినదించారు. ఈ క్రమంలో మీడియా ప్రతినిధులు వారిని ఫొటోలు తీస్తుంటే అసెంబ్లీ సిబ్బంది ఫోన్లు గుంజుకునే ప్రయత్నం చేశారు. అప్పటికప్పడే పెద్ద సంఖ్యలో పోలీసులు చేరుకొని, వ్యాన్లను తెప్పించి, వారిని అరెస్టు చేసేందుకు ప్రయత్నించడంతో బీఆర్ఎస్ నేతలు నేరుగా మీడియా పాయింట్ వద్దకు వచ్చి నినాదాలు చేశారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు పెద్దపెట్టన నినాదాలు చేసి, ప్రభుత్వ తీరును ఎండగట్టారు.