KCR | హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ (సిల్వర్ జూబ్లీ) వేడుకలను ఏడాదంతా జరుపుకునే విధంగా కార్యాచరణ రూపొందించాలని పార్టీ అధినేత కే చంద్రశేఖర్‌రావు గులాబీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. బుధవారం తెలంగాణభవన్‌లో నిర్వహించిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ కోసం, తెలంగాణ సమాజంలోంచి ఉద్భవించి ఉజ్వల ప్రస్థానం సాగించిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలు జరుపుకోవడం మాములు విషయం కాదని చెప్పారు. మిగతా రాజకీయ పార్టీలు వేరు.. బీఆర్ఎస్ పుట్టుక, ప్రయాణం వేరని తెలిపారు. మిగితా రాజకీయ పార్టీలకు 25 ఏండ్ల చరిత్ర కేవలం పార్టీ చరిత్రే అవుతుందని, అదే బీఆర్ఎస్ పార్టీకి అలా కాదని వివరించారు. తెలంగాణలోని ప్రతివర్గం భాగస్వామ్యం అయ్యేలా, తెలంగాణలోని ప్రతిబిడ్డా వేడుకల్లో మమేకం అయ్యేలా కార్యక్రమాలు రూపొందించుకోవాలని సూచించారు. తెలంగాణ సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ, చైతన్యవేదిక బీఆర్ఎస్ పార్టీ అని స్పష్టంచేశారు. తొలుత ఫిబ్రవరిలోనే భారీ బహిరంగసభ నిర్వహించాలని భావించామని, అయితే, పార్టీ రజతోత్సవ సంవత్సరంలోకి అడుగిడుతున్న సందర్భంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవంనాడు భారీ బహిరంగ సభ నిర్వహించాలని పార్టీ నాయకులు, వివిధ వర్గాల పెద్దలు సూచించారని చెప్పారు. దీంతో ఏప్రిల్ 27న భారీ బహిరంగసభ నిర్వహించాలని నిర్ణయించాయమని చెప్పారు. అంతుకుముందే ప్రతినిధుల సభ నిర్వహిస్తామని తెలిపారు.
ప్రతినిధుల సభ నాటికే సభ్యత్వ నమోదు పుస్తకాలు సిద్ధం చేసుకోవాలని పార్టీ శ్రేణులను కేసీఆర్ ఆదేశించారు. ప్రతినిధుల సభ నుంచి నియోజకవర్గాలవారీగా సభ్యత్వ నమోదుకు అవసరమైన పుస్తకాల ను ప్రతినిధులకు అందించాలని సూచించారు. అదే సమయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భం గా నిర్వహించే భారీ బహిరంగ సభకు అవసరమైన ఏర్పాట్లతోపాటు కమిటీలు సైతం వేసుకునేలా సిద్ధం కావాలని చెప్పారు. ఆ తరువాత భారీ ఎత్తున ఏప్రిల్ 27న బహిరంగసభ నిర్వహిస్తామని వెల్లడించారు.
పార్టీకి గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి దాకా సంస్థాగత నిర్మాణం పూర్తి చేసుకుందామని కేసీఆర్ ప్రకటించారు. సంస్థాగత నిర్మాణం స్వరూపాన్ని రూపొందించాలని మాజీ మంత్రి హరీశ్‌రావును ఆదేశించారు. ఏప్రిల్ 27న భారీ బహిరంగసభ నిర్వహించిన తరువాత నుంచి, పార్టీ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ ముగిసే అక్టోబర్/నవంబర్ నాటికి అన్నిస్థాయిల పార్టీ ప్రధాన కమిటీలు, అనుబంధ కమిటీల ఎన్నికలు పూర్తిచేస్తామని తెలిపారు. రాష్ట్రస్థాయిలో పార్టీ అనుబంధ విభాగాలను బలోపేతం చేస్తామని చెప్పారు. పార్టీ మహిళ, విద్యార్థి, రైతు, కార్మిక విభాగాలు ఇలా అన్నిస్థాయిల్లో అనుబంధ కమిటీల నిర్మాణం, సదస్సులు, శిక్షణా తరగతులకు అవసరమైన కార్యాచరణ రూపొందించుకోవాలని ఆదేశించారు. మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లు చట్టంగా రూపొందిన నేపథ్యంలో మహిళా విభాగం చురుకైన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు మరింత చేరువ కావాలని పిలుపునిచ్చారు.
పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఏలోటూ రాకుం డా చూడాలని కేసీఆర్ ఆదేశించారు. దేశంలో మరే రాజకీయ పార్టీకి లేని చరిత్ర బీఆర్ఎస్కు ఉన్నదని వివరించారు. తెలంగాణ ప్రజానీకంతో, సంస్కృతితో మమేకమై, వారి జీవికలో భాగమైన రాజకీయ పార్టీ బీఆర్ఎస్ ఒక్కటేనని చెప్పారు. పార్టీకి ఇల్లు కిరాయికి ఇవ్వని స్థితి నుంచి ప్రతీ జిల్లా కేంద్రంలో సొంత పార్టీ కార్యాలయాలు ఉన్న ఏకైక పార్టీగా బీఆర్ఎస్ ఎదిగిందని, పార్టీకి పుష్కలమైన నిధులున్నాయని తెలిపారు.
రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల ముఖ్యనాయకులు, కార్యకర్తలు, ఉద్యమంలో పనిచేసిన వివిధ వర్గాలతో త్వరలో సమావేశాలు నిర్వహిస్తామని కేసీఆర్ వెల్లడించారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. ప్రభుత్వం కొత్తగా ఏర్పడిందని, సర్దుకోవటానికి తగినంత సమయం ఇచ్చామని స్పష్టంచేశారు.
‘ప్రజలకు ఈ ప్రభుత్వం నచ్చిరాలేదు…అచ్చిరాలేదు’ అని కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలు, అన్ని సమాజాలు కాంగ్రెస్ ప్రభుత్వంపై లెక్కలేనన్ని తిట్లు తిడుతున్నరని, తన రాజకీయ జీవితంలో ఇంత అధ్వాన్నమైన ప్రభుత్వాన్ని చూడలేదని చెప్పారు. 14 నెలలకే ప్రభుత్వం దిగుడుముఖం పట్టిందని, ఇక అది లేవలేదని తేల్చిచెప్పారు.
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎనిమిది మంది ఎంపీలను, బీజేపీకి ఎనిమిది మంది ఎంపీలను ఇస్తే ఆ రెండు పార్టీలు వెలగబెట్టింది ఏమిటని ? కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఆ పార్టీల 16 మంది ఎంపీలు తెలంగాణకు పైస పనిచేశారా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి తెలంగాణ ప్రజల ప్రయోజనాలు, హక్కుల సాధన కోసం పేగులు తెగేదాకా కొట్లాడిందని గుర్తుచేశారు. పార్టీ సిల్వల్జూబ్లీ సందర్భంగా పార్టీ అజరామర ఘట్టాలను, అద్వితీయ తెలంగాణ పోరాట చరిత్రను, సాంస్కృతిక వైభావాన్ని ప్రతీ ఒక్కరూ సెలబ్రేట్ చేసుకునేలా కార్యాచరణ ఉండాలని సూచించారు.
మిగతా రాజకీయ పార్టీలు వేరు.. బీఆర్ఎస్ పుట్టుక, ప్రయాణం వేరు. తెలంగాణ సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ, చైతన్యవేదిక బీఆర్ఎస్ పార్టీ. దేశంలో మరే రాజకీయ పార్టీకి లేని చరిత్ర బీఆర్ఎస్కు ఉన్నది.
-బీఆర్ఎస్ అధినేత కేసీఆర్