హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): అన్ని వర్గాలకు బీఆర్ఎస్ పార్టీలో సముచిత స్థానం ఉంటదని ఏపీ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్లోని బీఆర్ఎస్ ఏపీ కార్యాలయంలో కాపు సంక్షేమ యువసేన ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు, రాధారంగా మిత్ర మండలి తిరుపతి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఆరాట్ కృష్ణ ప్రసాద్ సహా పలు జిల్లాలకు చెందిన నాయకులు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ, వైసీపీ పాలనలో సామాన్యులు బతకలేని పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రత్యామ్నాయంగా మారిందని పేర్కొన్నారు. ఏపీలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేయాలని పార్టీలో చేరిన వారికి తోట సూచించారు.