Economic Survey | హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): ‘పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయానికి, సాగునీటి రంగానికి చేసిందేమీలేదు’ అని కాంగ్రెస్ చేస్తున్న అడ్డగోలు విమర్శలు వాస్తవ దూరమని తేటతెల్లమైంది. తెలంగాణలో భూముల విలువను పెంచడంలో, ఐటీ, సేవారంగాన్ని విస్తరించడంలో కేసీఆర్ ప్రభుత్వ కృషి ఏమిటో సుస్పష్టమైంది. ‘కేసీఆర్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందలేదు’ అన్న బీజేపీ నేతల వ్యాఖ్యలకు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వమే లెక్కలతో సహా ముఖం పగిలేలా సమాధానం ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం శుక్రవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 2024-25 ఆర్థిక గణాంక సర్వే నివేదిక.. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ సాధించిన ప్రగతిని కండ్లకు కట్టింది. ఐటీ, రియల్ఎస్టేట్ రంగంలో పదేండ్ల బీఆర్‌ఎస్‌పాలనలో చేపట్టిన విప్లవాత్మకమైన కార్యక్రమాల కారణంగా సేవల రంగంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది.
2022-2023 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో జతచేరిన అదనపు విలువలో (గ్రాస్ స్టేట్ వ్యాల్యూయాడెడ్-జీఎస్వీఏ) సేవారంగం వాటా 60 శాతానికి పైగా నమోదైంది. జీఎస్వీఏ-సర్వీసు రంగంలో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. ఈ మేరకు ఆర్థిక సర్వే 2024-25 నివేదిక వెల్లడించింది. గడిచిన పదేండ్లలో తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఐటీ సేవల్లో వచ్చిన విప్లవాత్మకమైన మార్పులు, రియల్ఎస్టేట్ రంగంలో వృద్ధి సేవారంగం విస్తరించడానికి దోహదపడిందని నివేదిక అభిప్రాయపడింది. హైదరాబాద్‌లో ఆఫీసు, నివాస స్థలాలకు మంచి గిరాకీ ఏర్పడినట్టు వివరించింది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కేటీఆర్ ఐటీ శాఖ మంత్రిగా దేశ, విదేశాలు తిరిగి తీసుకొచ్చిన పెట్టుబడుల ఫలితమే ఈ ఘనత అని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
విస్తారంగా సాగు జలాలు అందుతున్న రాష్ర్టాల్లో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో పంటలకు అనువైన భూమిలో 86 శాతం విస్తీర్ణానికి నీళ్లు అందుతున్నట్టు ఆర్థిక సర్వే స్పష్టంచేసింది. 2016-2021 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా ఉన్న సాగుయోగ్యమైన భూములకు సాగునీరు అందే విస్తీర్ణం 49.3 శాతం నుంచి 55 శాతానికి పెరిగినట్టు నివేదిక స్పష్టం చేసింది. అత్యధికంగా పంజాబ్‌లో 98 శాతం సాగుభూమికి నీరు అందుతున్నదని, హర్యానా 94 శాతంతో రెండో స్థానంలో ఉన్నదని, ఆ తర్వాత తెలంగాణ మూడో స్థానంలో నిలిచిందని పేర్కొన్నది. ఇది పదేండ్ల కేసీఆర్ ప్రభుత్వం సాధించిన విజయమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగు చేయడం, కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టులు పూర్తి చేయడం, చెక్‌డ్యామ్‌ల నిర్మాణంతో నీటి వనరులు గణనీయంగా పెరిగాయని పేర్కొన్నారు. ఫలితంగా సాగుయోగ్యమైన భూములకు నీరు అందుతున్న రాష్ర్టాల్లో తెలంగాణ అగ్ర స్థానానికి ఎదిగిందని చెప్తున్నారు.
దేశంలోని 8 రాష్ర్టాల్లో మాత్రమే ప్రతి ఇంటికీ శుద్ధి చేసిన తాగునీరు అందుతున్నదని నివేదిక వెల్లడించింది. ఇందులో తెలంగాణ కూడా ఉన్నది. ఇది కేసీఆర్ మానసపుత్రిక ‘మిషన్ భగీరథ’ కారణంగా సాధించిన రికార్డు అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కేసీఆర్ సీఎంగా బాధ్యతలు స్వీకరించగానే మిషన్ భగీరథకు శ్రీకారం చుట్టారని.. 2016 ఆగస్టు 7న పథకానికి ప్రారంభోత్సవం చేశారని గుర్తు చేస్తున్నారు. దాదాపు రూ.40వేల కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ఫలితంగా రాష్ట్రంలో ప్రతి ఇంటికీ నల్లా ద్వారా శుద్ధిచేసిన జలాలు అందుతున్నాయని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ పథకంతో నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యకు చరమగీతం పాడిందన్నారు. బీఆర్ఎస్ సర్కారు తీసుకొచ్చిన ‘మిషన్ భగీరథ’ పథకం స్ఫూర్తితోనే కేంద్రప్రభుత్వం ‘జల్‌జీవన్ మిషన్’ను తీసుకురావడం తెలిసిందే.
మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో ఏర్పాటైన ‘వీ హబ్’పై ఆర్థిక సర్వే ప్రత్యేక ప్రశంసలు కురిపించింది. ప్రత్యేకంగా మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు చేపట్టిన తొలి ప్రయత్నంగా అభినందనలు కురిపించింది. అంతర్జాతీయ మార్కెట్లో మహిళా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు స్టార్టప్ ప్రారంభించేందుకు అవసరమైన ఆర్థిక, సాంకేతిక, పాలసీపరమైన సహకారాన్ని తెలంగాణ ప్రభుత్వం అద్భుతంగా అందించినట్టు సర్వే కొనియాడింది. ఇందుకు రూ.177 కోట్లు కేటాయించినట్టు తెలిపింది. వీ హబ్‌తో 6,376 అంకుర సంస్థలు, ఎస్ఎంఈ(స్మాల్ అండ్ మీడియం సైజ్ ఎంటర్ప్రైజెస్)లను ఏర్పాటు చేయగలిగిందని అభినందించింది. 87 స్టార్టప్ ప్రొగ్రామ్స్‌ను ప్రారంభించి 7,828 మంది మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు శిక్షణ ఇచ్చిందని వెల్లడించింది. ఇక్కడ ఊపిరి పోసుకున్న స్టార్టప్‌లలో 75 శాతం రెండేండ్ల నుంచి విజయవంతంగా కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయని పేర్కొన్నది. మొత్తంగా ‘వీ హబ్’ దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిందని కొనియాడింది.
వీ-హబ్ ద్వారా 6376 స్టార్టప్‌లు, ఎస్ఎంఈలు నమోదు కాగా ఇందులో 75 శాతం అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నాయి. ప్రీఇంక్యుబేషన్ కింద అప్‌సర్జ్, గ్రేటర్50-వీ స్పార్క్ కార్యక్రమాల ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలకు ఆర్థికపరమైన అంశాలపై శిక్షణనిచ్చి సహకరించింది. ఇంక్యుబేషన్ తర్వాత ఇంక్యుబేషన్ కోహోర్ట్-3, ఎఫ్ఎల్వో ఇంక్యుబేషన్, వీంచర్ ప్రోగ్రాముల ద్వారా అండగా నిలిచింది. ఈ పాలసీ ద్వారా స్టార్టప్ నుంచి స్కేలప్, గ్లోబల్ మార్కెట్ అవకాశాలను అందిపుచ్చుకునే అవకాశాలను పెంపొందించిందని ఎకానమిక్ సర్వే పేర్కొంది.
మహిళలను ఆర్థిక శక్తి చోదకులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో దేశంలోనే తొలిసారిగా కేసీఆర్ ప్రభుత్వం వీ-హబ్ వంటి ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మహిళలు పారిశ్రామికవేత్తలుగా నిలదొక్కుకునేలా ఇంక్యుబేషన్, ఫండింగ్, మార్కెటింగ్ మెలకువలతో నిష్ణాతులుగా తీర్చిదిద్దేందుకు వెన్నుతట్టి ప్రోత్సహించింది. ఈ కార్యక్రమం ద్వారా మెట్రో నగరాలతోపాటు, గ్రామీణప్రాంత మహిళలు కూడా పారిశ్రామికవేత్తగా ఎదిగే అవకాశం ఏర్పడింది. దేశంలో ఇప్పటివరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ తరహా కార్యక్రమాన్ని అమలు చేయలేదు. కేసీఆర్ హయాంలో ఆవిష్కరించిన వీ-హబ్ నేడు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది.
2024 ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య పోల్చినప్పుడు సొంత పన్ను ఆదాయ వసూళ్లలో (ఎస్వోటీఆర్)తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 88 శాతం వసూళ్లు నమోదు చేసింది. ఇది దేశంలోనే అత్యధికం. తర్వాత కర్ణాటక, హర్యానా రాష్ట్రాలు నిలిచాయి. కేసీఆర్ ప్రభుత్వం పదేండ్లలో చేసిన అభివృద్ధి పునాదులే ఇందుకు కారణమని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పదేండ్లలో సొంత పన్ను రాబడుల వృద్ధిలో తెలంగాణ దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఉన్నదని గుర్తు చేస్తున్నారు. వ్యాట్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ డ్యూటీలు, భూమి పన్ను, వాణిజ్య పన్నులు, అమ్మకాల పన్ను తదితర ఆదాయ వనరులను ఎస్వోటీఆర్గా పిలుస్తారు. కరోనా విపత్తు సమయంలోనూ అన్ని రాష్ర్టాలు మైనస్ వృద్ధి రేటు సాధిస్తే.. తెలంగాణ మాత్రమే ధనాత్మక వృద్ధి నమోదు చేసిందని గుర్తు చేస్తున్నారు. ఆర్థిక పునాదులు బలంగా ఉన్న కారణంగానే ఈ ఏడాది సైతం దేశంలోనే మొదటిస్థానంలో నిలిచినట్టు చెప్తున్నారు.