Harish Rao | హైదరాబాద్ సిటీబ్యూరో/చర్లపల్లి, నవంబర్ 14(నమస్తే తెలంగాణ) : పట్నం నరేందర్‌రెడ్డి అరెస్ట్ ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమని, తన ప్రత్యర్థిగా ఉన్న పట్నంపై ప్రతీకారంతో రేవంత్ కుట్రపూరితంగా అరెస్ట్ చేయించారని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే మేలు జరుగుతుందనుకున్న పాపానికి లగచర్ల గిరిజనుల భూములను గుంజుకోవడమే వారికి నువ్వు చేసే మేలా అని సీఎంను ప్రశ్నించారు. కొడంగల్ నుంచే ప్రజాపాలనమీద ప్రజల తిరుగుబాటు మొదలైందని, రేవంత్‌ను గద్దె దించే వరకు నిద్రపోమని హెచ్చరించారు. లగచర్ల కేసులో అరెస్టయిన కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డితో గురువారం చర్లపల్లి సెంట్రల్ జైలులో హరీశ్‌రావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, నాయకులు వంటేరు ప్రతాప్‌రెడ్డి, కార్తీక్‌రెడ్డి, నందికంటి శ్రీధర్ ములాఖత్ అయ్యారు.
ఈ సందర్భంగా పట్నంను పరామర్శించి పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జైలువద్ద హరీశ్‌రావు మాట్లాడుతూ ప్రశ్నించే గొంతుక కేటీఆర్‌పై కూడా కుట్రలు చేస్తున్నారని, ప్రజలకు ఇబ్బంది తలెత్తినప్పుడు ప్రతిపక్షనేతలుగా ప్రశ్నిస్తే కేసులు పెట్టి ఇరికిస్తారా? రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎక్కడుందని ప్రశ్నించారు. కొంతకాలంగా లగచర్లలో రైతులు ఫార్మా కంపెనీకి భూములు ఇవ్వబోమని పోరాటాలు చేస్తున్నారని, సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోకపోగా గూండాలు, రాజకీయ నాయకులతో బెదిరింపులకు గురిచేసి అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. లగచర్లలో అక్రమ కేసులకు భయపడి రైతులు ఊరి నుంచి పిల్లపాపలతో తరలిపోతున్నారని అవేదన వ్యక్తంచేశారు. రైతులకు అండగా నిలిచిన పట్నం నరేందర్‌రెడ్డికి ఎలాంటి సంబంధం లేకపోయినా అక్రమ కేసులు బనాయించారని మండిపడ్డారు.
ప్రజలకు అన్యాయం జరిగితే పోరాడటం ప్రతిపక్షంగా మా బాధ్యత. మాపై కోపం ఉంటే మమ్మల్ని అరెస్ట్ చేయాలి తప్ప అమాయక గిరిజన రైతులపై కేసులెలా పెడతారు? మాపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపాలని అనుకుంటున్నారు. మాకు జైళ్లు, కేసులు కొత్త కాదు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కేసులు ఎదుర్కొన్నాం, జైళ్లకు కూడా వెళ్లొచ్చాం.
రాష్ట్రంలో ఎక్కడ ఏ ఉద్యమం జరిగినా, ఎవరు నిరసన వ్యక్తం చేసినా బీఆర్ఎస్ చేయిస్తున్నదని అంటున్నారని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. నిరుద్యోగులు, రైతులు, స్పెషల్ పోలీసులు, హాస్టల్ విద్యార్థులు తమ సమస్యలపై స్వచ్ఛందంగా ధర్నా చేస్తే అది బీఆర్ఎస్ చేయించిందని రేవంత్ అంటున్నారని పేర్కొన్నారు. రేవంత్ సొంత నియోజకవర్గంలో తమ భూముల కోసం గిరిజనులు పోరాటం చేస్తే అది కూడా బీఆర్ఎస్ చేసిందనే అంటున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మల్లన్నసాగర్లో రేవంత్‌రెడ్డి రెండురోజులపాటు నిరసన చేస్తే తాము ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించామని గుర్తుచేశారు. అర్ధరాత్రి మహిళల చాతీమీద కాళ్లు పెట్టి అరెస్టులు చేయడం సరికాదని హితవు పలికారు. లగచర్లకు వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులు మధుసూదనాచారి, ఆర్ఎస్ ప్రవీణ్, కార్తీక్‌రెడ్డితో పాటు బీజేపీ నాయకురాలు డీకే అరుణను అడ్డుకోవడం సరికాదన్నారు. తననో, కేటీఆర్నో, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలనో అరెస్ట్ చేయండి, కానీ గిరిజన రైతులను అరెస్టు చేయడం సరికాదని, అక్రమంగా అరెస్ట్ చేసిన గిరిజన రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
నరేందర్‌రెడ్డికి ఈ కేసుతో సంబంధం లేదు. రిమాండ్ రిపోర్ట్‌లో ఏముందో ఆయనకు తెలియదు. మేజిస్ట్రేట్ ముందు తనను హాజరుపరచడానికి ఒక్క నిముషం ముందు తనపై ఒత్తిడి చేసి సంతకం పెట్టించినట్టు నరేందర్‌రెడ్డి నాతో చెప్పారు. కేటీఆర్‌తో పట్నం ఫోన్‌కాల్స్‌పై కాంగ్రెస్ నాయకులు గోబెల్స్ ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.
పీడిత వర్గాల ప్రజలకు అండగా నిలబడటమే తన బాధ్యత అని హరీశ్ అన్నారు. దేశంలో నాటి ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలన నేడు రాష్ట్రంలో మళ్లీ కనిపిస్తుందని విమర్శించారు. ఇందిరమ్మ ముసుగులో దళితులు, గిరిజనుల భూములు గుంజుకుంటున్నారని, రైతుల భూములు గుంజుకోవడమే ఇందిరమ్మ పాలనా అని నిలదీశారు. తొమ్మిది నెలల గర్భిణి, మహిళల ఛాతీ మీద తొక్కుకుంటూ పోలీసులు ఇంట్లోకి వెళ్లారని, ఇదేనా ప్రజాపాలన అని నిలదీశారు. రేవంత్ సొంత నియోజకవర్గంలో తనకు ఓట్లేసి గెలిపించిన గిరిజనుల భూములను అన్యాయంగా లాక్కుంటున్నారని, ఎదురుతిరిగిన అమాయక ప్రజలపై కేసులు పెట్టి జైలుకు పంపడం ఎంతవరకు కరెక్టని ప్రశ్నించారు.
బీఆర్ఎఎస్ పాలనలో హైదరాబాద్‌లో ఫార్మాసిటీ కోసం కేసీఆర్ 14 వేల ఎకరాలు సేకరించారని ఆ భూముల్లో ఫార్మాసిటీ ఎందుకు పెట్టడం లేదని హరీశ్‌రావు ప్రశ్నించారు. కొడంగల్‌లో ఫార్మాసిటీ కట్టడం ద్వారా గతంలో తాము సేకరించిన ప్రాంతంలో రియల్ ఎస్టేట్ చేయాలన్న కుట్ర జరుగుతున్నదని ఆరోపించారు. పచ్చటి పొలాల్లో రేవంత్‌రెడ్డి చిచ్చు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్ పాలన కేవలం అదానీ, తన తమ్ముళ్లు, అల్లుళ్లు, బడాబాబుల కోసమేనని విమర్శించారు.
బీఆర్ఎస్ పార్టీ పేదల పక్షాన నిలబడుతుందని హరీశ్‌రావు స్పష్టం చేశారు. ప్రజలకు సమాధానం చెప్పలేక ప్రశ్నించే గొంతుక కేటీఆర్ మీద కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తనను అనవసరంగా ఇరికించారని, కేటీఆర్‌ను కూడా ఇరికించాలని చూస్తున్నారని పట్నం తనతో చెప్పినట్టు తెలిపారు. నరేందర్‌రెడ్డి ధైర్యంగా ఉన్నారని, ఆయనకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ధర్మమే గెలుస్తుందని, నరేందర్‌రెడ్డి నిర్దోషిగా బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.