హైదరాబాద్, జూలై 21(నమస్తే తెలంగాణ): ‘బిల్స్ ఆఫ్ లేడింగ్ బిల్-2024’ దేశానికి ఎంతో ప్రయోజనకరమని, అందుకే ఈ బిల్లుకు తమ పార్టీ మద్దతునిస్తున్నదని బీఆర్ఎస్ ఎంపీ, రాజ్యసభలో పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ వద్దిరాజు రవిచంద్ర వెల్లడించారు. ఎగుమతుల్లో ఎంతో ముందున్న తెలంగాణ రాష్ర్టానికి ఈ బిల్లు మేలు చేస్తుందని చెప్పారు. అయితే కొన్ని లోపాలు ఉన్నాయని వాటిని సవరించుకోవాల్సి ఉందని అన్నారు. సోమవారం ప్రారంభమైన పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా ఓడరేవులు, నౌకా నిర్మాణం శాఖల మంత్రి సోనోవాల్ ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై వద్దిరాజు మాట్లాడుతూ.. తెలంగాణకు సముద్ర తీరం లేనప్పటికీ వాణిజ్యంలో ఎంతో ముందున్నదని, ముఖ్యంగా ఐటీ, ఫార్మా, టెక్స్టైల్స్ తదితర ఉత్పత్తులను అనేక దేశాలకు ఎగుమతి చేస్తున్నదని తెలిపారు.
హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ తదితర నగరాల్లో తయారవుతున్న ఉత్పత్తులు సముద్ర మార్గం ద్వారా విదేశాలకు ఎగుమతి అవుతున్నాయని అన్నారు. ఈ బిల్లుతో డాక్యుమెంట్లు, హక్కుల విషయంలో స్పష్టత వచ్చినందున ఫార్మా కంపెనీలు మాత్రమే కాకుండా అనేక చిన్న పరిశ్రమలకు కూడా ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. విశాఖపట్నం, చెన్నై పోర్టుల ద్వారా తెలంగాణ సరుకు విదేశాలకు ఎగుమతి అయ్యేలా ఈ బిల్లు దోహదపడుతుందని తెలిపారు.
ఈ బిల్లులో కొన్ని లోపాలు కూడా వద్దిరాజు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఈ-బిల్ (ఎలక్ట్రానిక్ బిల్స్ ఆఫ్ లేడింగ్) ఎక్కువగా ప్రాచుర్యంలో ఉందని, హైదరాబాద్ నగరంలో ఐటీ కంపెనీలు పెద్ద సంఖ్యలో ఉన్నందున ఈ బిల్లులో ఈ-బిల్ విధానానికి ప్రాధాన్యమివ్వాలని సూచించారు. తెలంగాణ ఎగుమతిదారులు ప్రధానంగా అమెరికా, ఐరోపా యూనియన్, యూఏఈ తదితర దేశాలకు నాన్-నెగోషియబుల్ సీ వేబిల్స్ ద్వారా ఎగుమతి చేస్తారని, వాటిని ఈ బిల్లులో పేర్కొనలేదని తెలిపారు.
ఈ-బిల్లకు చట్టబద్ధత, గుర్తింపు ఇవ్వాలని, హైదరాబాద్‌లోని ఐటీ ప్రతిభను దీనికి ఉపయోగించుకోవచ్చని సూచించారు. సీ వేబిల్స్ను కూడా గుర్తించాలని, ఇది చిన్న వ్యాపారులకు ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. హైదరాబాద్ డ్రైపోర్టు, రీజినల్ రింగ్‌రోడ్ ప్రాజెక్టులను ఈ బిల్లుతో అనుసంధానం చేయాలని, దీంతో మరింత ఉపయోగకరంగా ఉంటుందని వద్దిరాజు కోరారు. ఈ బిల్లుతో దేశ వాణిజ్య విధానాలు ప్రపంచ ప్రమాణాలకు దగ్గరగా వెళ్తున్నాయని, తెలంగాణకు ఇది ఎంతో ఊరట కల్పిస్తుందని చెప్పారు.