హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలపై ఏర్పాటైన బీఆర్ఎస్ అధ్యయన కమిటీ తొలిసారి బుధవారం భేటీ కానున్నది. హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కమిటీ చైర్మన్, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి నివాసంలో మధ్యాహ్నం ఈ సమావేశం జరుగనున్నది. సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు కమిటీలోని సభ్యులు సత్యవతి రాథోడ్, జోగు రామన్న, పువ్వాడ అజయ్‌కుమార్, ఎంసీ కోటిరెడ్డి, యాదవరెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, రసమయి బాలకిషన్, అంజయ్యయాదవ్ హాజరుకానున్నారు. రాష్ట్రంలో వరుసగా జరిగే రైతు ఆత్మహత్యలు, క్షేత్రస్థాయిలో నెలకొన్న వ్యవసాయ సంక్షోభ పరిస్థితులు, తీసుకోవాల్సిన నివారణ చర్యలు, ప్రభుత్వానికి చేయాల్సిన సూచనలపై సమావేశంలో చర్చించనున్నారు.
యాదవరెడ్డికి చోటు..
రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలపై ఏర్పాటైన బీఆర్ఎస్ అధ్యయన కమిటీలో వరంగల్ జిల్లాకు చెందిన కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డికి చోటు కల్పించారు. దీనిపై ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హర్షం వ్యక్తంచేశారు.