హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): మూసీ ప్రాజెక్టు పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్న అరాచక, దోపిడీ చర్యలకు వ్యతిరేకంగా భారత రాష్ట్ర సమితి విద్యా ర్థి విభాగం బీఆర్ఎస్వీ ప్రత్యక్ష పోరాటానికి దిగింది. మూసీ పరివాహక ప్రాంతాల్లో పేదల ఇండ్లు కూల్చుతున్న కాంగ్రెస్ సర్కారుపై రణభేరి మోగించింది. మూసీ పోరుబాట కార్యక్రమాన్ని శనివారం తెలంగాణభవన్ వద్ద మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ ఉప నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ జెండా ఊపి ప్రారంభించారు. బీఆర్ఎస్వీ పోరుబాట పోస్టర్‌నూ ఆవిష్కరించారు. శనివారం నుంచి పది రోజులపాటు సాగే ఈ కార్యక్రమంలో 50 బృందాలు మూసీ పరివాహక ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించనున్నాయి. బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో 50 బృందాలు మూసీ ప్రభావిత ప్రాంతాల్లోని ప్రతి ఇంటికీ వెళ్లనున్నాయి. మూసీ సుందరీకరణ వెనుక ఉన్న అసలు దోపిడీ ఆలోచనలను ప్రజలకు విద్యార్థి నాయకులు వివరిస్తారు. ఇళ్లు కోల్పోయే పేదలకు పార్టీ అండగా ఉంటుందని ధైర్యం కల్పిస్తారు.
మూసీ సుందరీకరణ నెపంతో ప్రభుత్వం పేదల ఇళ్లను కూల్చివేస్తున్నదని, తీర ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనల్లో ఉన్నారని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘ప్రభుత్వం మూసీని సుందరీకరణ చేస్తే మాకు అభ్యంతరం లేదు. కానీ, ఆ పేరుతో వేలాది మంది పేదల జీవితాలను విచ్ఛిన్నం చేస్తామంటే చూస్తూ ఊరుకోబోం’ అని హెచ్చరించారు. అధికారం ఉంది కదా అని ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే లక్షలాది మందితో అడ్డుకుంటామని వెల్లడించారు. మూసీ సుందరీకరణ పేరిట పేదలపై రేవంత్ ప్రభుత్వం జరుపుతున్న దమనకాండపై పోరాడేందుకు విద్యార్థులు నడుం బిగించడం హర్షించదగ్గ విషయమని చెప్పారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు మూసీపై తమ కార్యాచరణ కొనసాగుతుందని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి రావుల చంద్రశేఖర్‌రెడ్డి, బీఆర్ఎస్స్వీ ఉపాధ్యక్షులు పడాల సతీశ్, కడారి స్వామియాదవ్, తుంగ బాలు, జాయింట్ సెక్రటరీ మనీష, పెద్ద సంఖ్యలో విద్యార్థి విభాగం నాయకులు పాల్గొన్నారు.