హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణ శాసనసభకు త్వరలో జరుగనున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ 100కుపైగా స్థానాలను కైవసం చేసుకుని వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని రాష్ట్ర మున్సిపల్ చైర్మన్ల చాంబర్ అధ్యక్షుడు ఎన్ రెడ్డిరాజు పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన చాంబర్ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపునకు మున్సిపల్ చైర్మన్లంతా క్రియాశీలక పాత్ర పోషించాలని సమావేశంలో నిర్ణయించారు. ప్రస్తుతం అనేక అంశాల్లో ఎమ్మెల్యేలకు, మున్సిపల్ చైర్మన్లకు మధ్య భిన్నాభిప్రాయాలున్నాయని, ఇరు వర్గాలను సమన్వయపరిచేందుకు బీఆర్ఎస్ నాయకత్వం జోక్యం చేసుకోవాలని తీర్మానించారు.
మున్సిపల్ చైర్మన్ పదవికి నేరుగా ఎన్నికలు నిర్వహించాలి
మున్సిపల్ చైర్మన్ పదవికి మున్ముందు నేరుగా ఎన్నికలు నిర్వహించేలా చట్ట సవరణ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్ల గౌరవ వేతనాన్ని పెంచడంతోపాటు సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపికలో ప్రాధాన్యం కల్పించాలని కోరారు. సమస్యలపై త్వరలో మంత్రి కేటీఆర్‌ను కలిసి వినతి పత్రం సమర్పించాలని నిర్ణయించారు. సమావేశంలో చాంబర్ కార్యదర్శి ఎడమ సత్యం, ఉపాధ్యక్షురాలు మంజుల, కేశవ్, రాజమౌళి గుప్తా, జమున, నరేందర్, సుష్మ, స్వప్న, ప్రణీత తదితరులు పాల్గొన్నారు.