హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ) : స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీరు రంగులు మార్చే ఊసరవెల్లిలా ఉన్నదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాకేశ్రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కడియం శ్రీహరిని బీఆర్ఎస్ డిప్యూటీ సీఎంను చేయడంతోపాటు, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజయ్యను కాదని ఎమ్మెల్యేగా గెలిపించిందని గుర్తుచేశారు. ఆయనతోపాటు కూతురు కడియం కావ్యకు సైతం ఎంపీ టికెట్ ఇచ్చిందని తెలిపారు. ఇన్ని చేసిన తర్వాత కూడా తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన చందంగా కడియం పార్టీ మారారని ధ్వజమెత్తారు. ఇన్నిరోజులు పార్టీ మార్పు విషయమై చెప్పడానికి భయపడిన కడియం.. నియోజక అభివృద్ధి కోసమే కాంగ్రెస్లో చేరానని చెప్పడం దిగజారుడుతనమేనని విమర్శించారు.
రాజకీయాల్లో నుంచి రిటైరయ్యే వయసులో ఆయన పార్టీ మారి అప్రతిష్ఠ మూటకట్టుకుని ఓరుగల్లు పరువు తీశారని విమర్శించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫిరాయింపు ఎమ్మెల్యేలను అష్టదిగ్భంధనం చేయడంతోనే నిన్న కాంగ్రెస్లో చేరినట్టు కడియం బహిరంగంగా ఒప్పుకున్నారని చెప్పారు. ఇన్నేండ్ల రాజకీయ జీవితం ఆయనకు అడ్డదారులు ఎలా తొకాలి? నమ్మినవాళ్ళను ఎలా నయవంచన చేయాలి? అని నేర్పిందా అని మండిపడ్డారు. ఉపాధ్యాయ వృత్తిలో పనిచేసిన ఆయన సమాజానికి ఇచ్చే సందేశం ఇదేనా? అని ప్రశ్నించారు. మళ్లీ ఏ ముఖం పెట్టుకొని నియోజకవర్గ ప్రజలను ఓట్లడుగుతారు? అని నిలదీశారు. కాంగ్రెస్ కార్యకర్తల శ్రమను సొమ్ము చేసుకోవడానికి వచ్చిన వ్యక్తిని ఓడించి ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు బీఆర్ఎస్ పార్టీతో ప్రజలు కలిసి రావాలని పిలుపునిచ్చారు.