కొత్తగూడెం అర్బన్, మే 15: అందాల పోటీలతో రాష్ర్టానికి ఒరిగిందేముందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘పోటీల నిర్వహణతో వరంగల్, హైదరాబాద్ నగరాల ఖ్యాతి ఇసుమంతైనా పెరుగుతుందా?’ అంటూ నిలదీశారు. భద్రాద్రి కొత్తగూడెంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడారు. ‘రూ.200 కోట్లు ఖర్చు పెట్టి నిర్వహిస్తున్న ఈ అందాల పోటీల వల్ల తెలంగాణలోని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలేమైనా పెరుగుతాయా?’ అని ప్రశ్నించారు.
వరంగల్‌లో అందాల భామల కాళ్లను తెలంగాణ ఆడబిడ్డలతో కడిగించడాన్ని తెలంగాణ సమాజం వ్యతిరేకిస్తోందని తెలిపారు. ఈ ఘటనపై తక్షణమే సీఎం క్షమాపణ చెప్పాలని, మంత్రులు శ్రీధర్‌బాబు, సీతక్క, కొండా సురేఖ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.