మహబూబాబాద్ రూరల్/డోర్నకల్, సెప్టెంబర్ 8: వరద బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. ఆదివారం ఆమె మహబూబాబాద్ పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు వరద బాధితుల కోసం పంపిన నిత్యావసర సరుకులను బాధిత కుటుంబాలకు అందజేశారు. ఈ సందర్భంగా సత్యవతి మాట్లాడుతూ.. వరద బాధితులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి హడావుడిగా వచ్చి అనేక వాగ్దానాలు చేసి వెళ్లారని, రూ.10 వేల నష్టపరిహారం అని.. వారమైనా అందలేదని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు బానోత్ శంకర్‌నాయక్, రెడ్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.