మణుగూరు టౌన్/అశ్వారావుపేట టౌన్/ ఖమ్మం, సెప్టెంబర్ 13 : రైతుల పక్షాన నిలిచి వార్తలు రాసిన టీ న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి సాంబశివరావుపై పోలీసులు అక్రమ కేసులు బనాయించడాన్ని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. సాంబశివరావు కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. శనివారం బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఖమ్మం బంగారయ్యనగర్లోని సాంబశివరావు ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం కేటీఆర్‌కు ఫోన్ చేసి సాంబశివరావు సతీమణి శ్రీదేవితో మాట్లాడించారు. పోలీసు కేసులతో అధైర్యపడొద్దని, బీఆర్ఎస్ అండగా ఉంటుందని కేటీఆర్ భరోసానిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లే జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురిచేయడం పరిపాటిగా మారిందని ఆవేదనచెందారు.
ధైర్యంగా ఉండాలని సాంబశివరావు సతీమణి శ్రీదేవి, అత్త మల్లమ్మ, కూతురు సహస్రకు ధైర్యం చెప్పారు. టీ న్యూస్ ప్రతినిధిపై తప్పుడు కేసులు బనాయించడంపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట జర్నలిస్టు లు, బీఆర్ఎస్ ఆధ్వర్యంలో స్థానిక రింగ్ సెంటర్లో రాస్తారోకో నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మాజీ ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ నిజాన్ని నిర్భయంగా రాస్తూ.. నిరంతరం సమస్యలను వెలికితీసి వాటి పరిష్కారానికి కృషి చేయడంలో ముందుంటున్న జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టి అణగదొక్కే ప్రయత్నంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు పడుతున్న కష్టాలను తెలుసుకునేందుకు వెళ్లిన టీ న్యూస్ ప్రతినిధి సాంబశివరావుపై అక్రమ కేసులు పెట్టడాన్ని మణుగూరు ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో మీడియా ప్రతినిధులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. మణుగూరులోని అంబేద్కర్ సెంటర్ నుంచి పోలీస్‌స్టేషన్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు ఎస్సై రంజిత్‌కు వినతిపత్రం అందజేశారు.