యాదాద్రి భువనగిరి : ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ ఆందోళన చేపట్టిందన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో చిట్యాల – భునగిరి రహదారిపై ధాన్యం కొనుగోలు చేయాలని ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి రహదారిపై వడ్లు పోసి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆరుగాలం కష్టపడి రైతులు పంటలు పండిస్తే ప్రభుత్వ అసమర్ధతో పంటలు నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంటలు వర్షాలకు తడిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ధాన్యం కొనుగోళ్లు చేపట్టి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనకు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మద్దతు తెలిపారు.