కేసీఆర్‌తోనే తెలంగాణ సాధ్యమైతదని నమ్మిన జయశంకర్ సార్‌ది వరంగల్. వరంగల్ ప్రజలు ఎప్పుడూ బీఆర్ఎస్కు అండగా ఉన్నారు. రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాల నేపథ్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు నిర్వహిస్తున్న సభ ఇది. సభ విజయవంతంగా జరిగేందుకు అందరూ ఆశీర్వదించాలని కోరుతున్నాం.
– హరీశ్‌రావు
వరంగల్, ఏప్రిల్ 26(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా ప్రజలంతా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వైపే చూస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ‘తెలంగాణ ఆత్మగౌరవ బావుటాను ఎగరేసిన ఘనత బీఆర్ఎస్దేనని స్పష్టంచేశారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసం కష్టపడి పనిచేశామని చెప్పారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలోని బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ ఏర్పాట్లును హరీశ్‌రావు శనివారం పరిశీలించారు. అనంతరం అక్కడి మీడియా పాయింట్లో విలేకరులతో మాట్లాడారు.
బీఆర్ఎస్ అంటే తెలంగాణ.. తెలంగాణ అంటే బీఆర్ఎస్ అని పేర్కొన్నారు. రజతోత్సవ మహాసభ కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఉత్సాహంగా తరలి వస్తున్నారని తెలిపారు. కేసీఆర్‌ను చూడాలని, ప్రసంగం వినాలని ఎడ్లబండ్లు, వాహనాలు, సైకిళ్లపై తరలివస్తున్నారని, ఎందరో పాదయాత్రగా కూడా సభకు వస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్ ప్రస్థానంలో ఉద్యమ సమయంలో, సొంత రాష్ట్రంలో అతిపెద్ద సభలకు వరంగల్ వేదిక అయ్యిందని, ఇప్పుడు రజతోత్సవాన్ని ఇక్కడే నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారని చెప్పారు.
ఎల్కతుర్తి, హుస్నాబాద్ ప్రాంతాలు సమైక్య పాలనలో కరువు కాటకాలకు నిలయంగా ఉండేవని, కేసీఆర్ హయాంలో ఈ ప్రాంతాలను సస్యశ్యామలం చేశారని తెలిపారు. ఏడాదిన్నర కాలంలో పాలు, నీళ్ల తేడా తెలిసిందని, మళ్లీ కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక కొత్త పథకాలు లేవని, బీఆర్ఎస్ అమలు చేసిన పథకాలు బంద్ అయినయని విమర్శించారు.
సాగునీళ్లే కాదు తాగునీళ్లను కూడా ఈ కాంగ్రెస్ సర్కార్ ఇవ్వలేకపోతున్నదని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సమ్మక సాగ ర్ కడితే, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహణ బిల్లు లు ఇవ్వలేక పంటలను ఎండబెట్టిందని మం డిపడ్డారు. కృష్ణానదిలో తాత్కాలిక ఒప్పందం ప్రకారం మనకు 34శాతం వాటా ఉన్నదని, 27శాతం నీళ్లు కూడా ఈ దద్దమ్మ ప్రభుత్వం వాడుకోలేకపోయిందని ధ్వజమెత్తారు.
తెలంగాణ రాష్ర్టాన్ని తెచ్చింది, వచ్చిన రాష్ర్టాన్ని అభివృద్ధి చేసిందీ, తెలంగాణ ప్రయోజనాలను కాపాడేది బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే. బీఆర్ఎస్ రజతోత్సవం తెలంగాణ ప్రజలకు ఒక పండుగ రోజు.
– హరీశ్‌రావు
బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు రాష్ట్ర వ్యాప్తంగా అంచనాలకు మించిన జనం వస్తారని తమకు సమాచారం ఉన్నదని హరీశ్‌రావు వివరించారు. ఎవరికి వాళ్లుగా స్వచ్ఛందంగా వస్తున్నారి చెప్పారు. కేసీఆర్ ఏం మాట్లాడుతారో వినాలనే ఉత్సాహం కాంగ్రెస్ నాయకులకే ఎకువగా ఉన్నదని తెలిపారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది ముమ్మాటికీ బీఆర్ఎస్ ప్రభుత్వమేనని పునరుద్ఘాటించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ట్రాఫిక్ సమస్యను సృష్టించి, సభకు అంతరాయం కలిగించే ప్రయత్నం చేస్తున్నదని హరీశ్‌రావు విమర్శించారు. మరోసారి మన ప్రభుత్వం రావాలి, కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ప్రతిన పూనుదాం’ అని హరీశ్‌రావు పిలుపునిచ్చారు. సమావేశంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, ఒడితెల సతీశ్‌కుమార్, గండ్ర వెంకటరమణారెడ్డి, బీఆర్ఎస్ వరంగల్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి గ్యాదరి బాలమల్లు, రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, దేవీప్రసాద్, కే వాసుదేవారెడ్డి, నాగుర్ల వెంకటేశ్వర్లు, వై సతీశ్‌రెడ్డి పాల్గొన్నారు.