హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ నియామకాల విషయంలో ‘మందికి పుట్టిన బిడ్డను మా బిడ్డ’ అని ప్రచారం చేసుకున్నట్టుందని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి ఒక ప్రకటనలో ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం నియామకపత్రాలు ఇస్తూ డబ్బా కొట్టుకుంటున్నదని విమర్శించారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 30 వేల ఉద్యోగాలు ఇచ్చిందని ఆ పార్టీ నేత రాహుల్‌గాంధీ చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉన్నదని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లో ఇప్పటివరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని, ఒక్క నియామక పరీక్ష కూడా నిర్వహించలేదని తెలిపారు. మరి అలాంటప్పుడు 30 వేల ఉద్యోగాలు ఎలా ఇచ్చారో చెప్పాలని రాహుల్‌గాంధీని డిమాండ్ చేశారు.
గురుకుల, స్టాఫ్‌నర్స్, పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే నోటిఫికేషన్ వచ్చి, పరీక్షలు జరిగి, ఫలితాలు కూడా వెల్లడయ్యాయని తెలిపారు. అలాంటప్పుడు ఏ లెకన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నాలుగు నెలల్లో 30 వేల ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆఘమేఘాల మీద ఇచ్చిన ఉద్యోగ నియామకపత్రాలతో సీఎం రేవంత్‌రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి ప్రచారం తప్ప అభ్యర్థులకు ఒరిగిందేమీ లేదని మండిపడ్డారు.