KCR | హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ) : ఓరుగల్లు వేదికగా నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో పార్టీ అధినేత కేసీఆర్ పోలీసులపై గర్జించారు. ‘రాజకీయాలు మీకెందుకు? మీకెందుకు దునుకులాట? ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్లపై ఎందుకు కేసులు పెడుతున్నరు?’ అంటూ నిలదీశారు. ఎల్కతుర్తిలో సభలో కేసీఆర్ మాట్లాడుతూ పోలీసు సోదరులను అడుగుతున్నా.. మీరెందుకు దుంకులాడుతున్నరు? మీకు ఏం అక్కెరొచ్చింది? మీకు ఒక్కటే చెప్తున్నా. మీకు తెల్వదా? మీరు చదువు కోలేదా? మీకు కూడా విజ్ఞానం ఉన్నది కదా? మీకు దొంగ వాగ్దానాలు చేయలేదా? ప్రజల్ని మోసం చేయలేదా? ప్రజాస్వామ్యంలో ప్రజలకు అడిగే హక్కులేదా? మీరెందుకు కేసులు పెడుతున్నరు? మీరెందుకు దుంకులాడుతున్నరు.. రేపు మీరెందుకు బలైతరు? మీకు రాజకీయాలెందుకు? మీ డ్యూటీ మీరు చేయండి! బీఆర్ఎస్ ఎప్పుడూ చట్టాలను ఉల్లంఘించదు. తెలిపారు.
పోగొట్టుకున్నకాన్నే వెతుక్కోవాలె
అవివేకంతో, అజ్ఞానంతో ఘోరం చేసి అడ్డమైన మాటలన్నీ చెప్పిండ్రు. ఆ మాటలతో మనం కూడా గోల్మాలైనం. తీర్థం పోదాం తిమ్మక్కా అంటే వాడు గుల్లె.. మనం సల్లె అనే గతికి తెచ్చిండ్రు. ప్రజలు కూడా ఆలోచన చెయ్యాలె. ఆవేశం పనికిరాదు. హైదరాబాద్లో ఓ తమ్ముడి ఇల్లు కూలగొడితే.. ఆ తమ్ముడన్నడు.. కేసీఆర్ అన్నా యాడున్నవ్ నువ్వు రావాలె అన్నడు. అంటె కత్తి వాడి చేతిలో పెట్టి యుద్ధం నన్ను చేయమంటున్నరు. గాడిదలకు గడ్డేసి బర్లకు పాలు పిండితే వస్తయా? జాగ్రత్త గా ఆలోచించాలె’ అని ప్రజలను కేసీఆర్ కోరా రు. ‘మీ వెంట బీఆర్ఎస్ ఉంటది.. మీ వెంట కేసీఆర్ ఉంటడు. వందశాతం మళ్లీ విజయం సాధించాలే. గులాబీ జెండా ఎగరేయాలె. అద్భుతమైన తెలంగాణను మళ్లీ సాధించాలె.
వీళ్లు చేస్తరు.. మనం బతుకుతమా?
మేం కూడా టైమివ్వాలని ఇచ్చినం. లేదంటే ఏమంటరు.. ప్రజలు మీకేసినట్టే మాకూ ఓట్లేసిండ్రు.. ఏడాదైనా టైం ఇయ్యరా? ఏడాదినర్ధమైనా టైం ఇయ్యరా? మీకు కన్నెర్ర అంటరని నేను నోరు తెరువలేదు. కృష్ణా జలాలపై గడబిడ జరిగితే నల్లగొండకు వెళ్లి గర్జన చేసొచ్చిన గానీ నేనెక్కడా బయటకు రాలేదు. కానీ ఏడాదినర్దం అయిపోయింది. ఇంకేం పాడైంది? పువ్వు పుట్టంగనే పరిమళిస్తదన్నట్టుగా ప్రభుత్వం కథ తెల్వదా? వీళ్లకు టైం ఎక్కడున్నది? చివరి ఆర్నెళ్లు ఎలక్షన్లే! వీళ్లకు ఉన్న సమయమే రెండున్నరేండ్లు! ఈ రెండున్నరేండ్లలో వీళ్లు పనులు చేస్తరు.. మనం బతికి ముందరపడతమా? అందుకే తెలంగాణ ప్రజలు, మేధావులు ప్రతి ఒక్కరూ దయచేసి ఆలోచించాలె. దీనికి పరిష్కారం ఏమిటో కనుక్కోవాలె. ఆలోచనతో పని చెయ్యాలె. ఆవేశంతో కాదు. ఆవేశంతో నినాదాలు ఇస్తే సరిపోదు. ముల్లును ముల్లుతోనే తియ్యాలె. ఏడ పోగొట్టుకున్నమో గాన్నే వెతుక్కోవాలె. జారిపోయిన చోటనే దొరకపట్టాలె. ఆ నైపుణ్యం, స్థాయి రావాలె అని చెప్పారు.
బీఆర్ఎస్ ప్రభంజనాన్ని ఎవడాపుతడు?
ఈ రోజు మనం ఇక్కడ సభ పెట్టుకుంటే ఎన్ని అడ్డంకులు సృష్టిస్తున్నరు. ప్రైవేటు స్కూలు వాళ్లు బస్సులిస్తే వాళ్లకు నోటీసులిస్తున్నరు. అడుగడుగునా ఆర్టీఏ అధికారులను, పోలీసులను పెట్టి ట్రాఫిక్ జామ్ చేస్తున్నరు. ఇప్పుడు కూడా సభకు రావాల్సిన వాళ్లు లక్ష.. లక్షాయాభై వేల మంది బయటనే ఆగిపోయిండ్రు. హనుమకొండ, హుజూరాబాద్, సిద్దిపేట దిక్కు ఇట్ల మూడు రోడ్లలో జామైంది. నేను మా నాయకులను అడిగితే.. ఇబ్బందులు పెడుతున్నరు.. రానిస్తలేరు సార్.. లారీలు తెచ్చి అడ్డం పెడుతున్నరని చెప్పిండ్రు. మరి ఓ ఆర్ద గంట ఆగి మాట్లాడుదామని నేనంటే లేదు సార్ వచ్చినవాళ్లు దూరం పోవాలె.. రానోళ్లు ఎలాగూ సభకు అందరు.. మాట్లాడి సభ ముగిద్దామని చెప్తే నేను వచ్చిన. ఇన్ని అడ్డంకులా? ఇంత కడుపుబ్బనా? ఆపుతరా? బీఆర్ఎస్ సభలను ఆపుతరా? ఈ ప్రభంజనాన్ని ఎవడు ఆపుతడు? ఆగవడితే ఆగుతదా..?
ప్రజాస్వామ్యంలో ప్రజలకు అడిగే హక్కు ఉంటది. తప్పకుండా అడుగుతరు. ఇంత అన్యాయం జరుగుతుంటే చూడలేక బీఆర్ఎస్కు సోషల్ మీడియా వారియర్స్ ప్రజలకు మద్దతుగా నిలబడుతున్నరు. ఇదేం అన్యాయమని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నరు. అలాంటి వాళ్లపై కేసులు పెడుతున్నరు. వాళ్లను పట్టుకుపోతున్నరు. పోలీసు సోదరులను అడుగుతున్నా.. మీరెందుకు దుంకులాడుతున్నరు? మీకు ఏం అక్కెరొచ్చింది? – కేసీఆర్
పోలీస్ మిత్రులారా ఈ రోజు రాత్రి మీ ఇండ్లకు వెళ్లి డైరీల్లో రాసుకోండి.. మీ డైరీల్లో రాసి పెట్టుకోండ్రి (మరోసారి అంటూ).. ఇయ్యాల తెలంగాణ చెలరేగిన పరిస్థితిని చూస్తే వందకు వంద శాతం మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే! దాన్ని ఎవడూ ఆపలేడు. అది ఎవని తరం కాదు.. ఎవని వశం కాదు
-కేసీఆర్
బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్లకు, కార్యకర్తలకు ఒక్కటే చెప్తున్నా.. ఎక్కడైనా ఎవరైనా మీపై అన్యాయంగా కేసులు పెడితే మన టీఆర్ఎస్ లీగల్ సెల్ వీరులున్నరు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీకు అండగా కేసీఆర్ ఉంటడు.. బీఆర్ఎస్ ఉంటది.. ఇక ఈడికెళ్లి ఊరుకోను.. నేను కూడా బయల్దేరుతా. ఎక్కడిదాకైనా మంచిదే.. ఎవరి సంగతేందో.. ఎవరి లెక్కేందో అన్ని లెక్కలు తీద్దాం..
-కేసీఆర్