హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): మేడారం జాతరను తలపించేలా ఎల్కతుర్తి సభ ఉంటుందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ నాయకత్వంలో పురుడు పోసుకున్న టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీ 25 ఏండ్లు పూర్తిచేసుకున్న శుభ సందర్భంగా నిర్వహిస్తున్న రజతోత్సవ సభా ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పారు. తెలంగాణ భవన్లో శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుంచైనా ఎల్కతుర్తి సభకు సజావుగా చేరుకునేలా ఏర్పాట్లు జరిగాయని వివరించారు. సభా ఏర్పాట్లను రోజూ కేసీఆర్ పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. సభకు వచ్చే వాహనాల కోసం 1,200 ఎకరాల్లో పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు కాంగ్రెస్‌పై కసిగా ఉన్నారని, బీఆర్ఎస్ సభకు తరలివచ్చేందుకు తమ సొంత పనిగా భావిస్తున్నారని తెలిపారు. గ్రామాల నుంచి 80 ఏండ్ల వృద్ధులు కూడా ఈ సభకు వచ్చేందుకు ఉత్సాహంగా ఉన్నారని తెలిపారు. బీఆర్ఎస్ 25 ఏండ్ల సభ జరుపుకుంటుంటే.. ప్రజలు మాత్రం దీనిని కాంగ్రెస్ వ్యతిరేక సభగా భావించుకుంటున్నారని జగదీశ్‌రెడ్డి చెప్పారు. దేశ చరిత్రలోనే అతి పెద్ద భారీ సభలు నిర్వహించిన చరిత్ర ఉన్నదని, అలాంటి సభల రికార్డులు తిరిగే రాసేది కూడా బీఆర్ఎస్ అవుతుందని స్పష్టంచేశారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు రాష్ట్రంలోని ప్రతి గ్రామం నుంచి జనం తరలి వచ్చేందుకు సిద్ధమయ్యారని, కాంగ్రెస్, బీజేపీలు మాత్రం ఓర్వలేక పోతున్నాయని దుయ్యబట్టారు.
మేడిగడ్డ, కాళేశ్వరం, సుందిళ్లపై ప్రాజెక్టులపై ఇచ్చింది ఎన్డీఎస్ఏ నివేదిక కాదని, అది ఎన్డీఏ రిపోర్టు అని జగదీశ్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి ఇచ్చిన నివేదిక అంటూ ఆయన ఎద్దేవా చేశారు. గతంలో కూడా ఎన్నికలప్పుడు హడావుడి చేశారని, రజతోత్సవ సభ నేపథ్యంలో మళ్లీ ఇప్పుడు అదే హడావుడి చేస్తున్నారని దుయ్యబట్టారు. కే అది పనికిమాలిన రిపోర్టు అని, అది చెత్తబుట్టలో వేయడానికే పనికొస్తుందని మండిపడ్డారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్, బేవరేజ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కే కిషోర్‌గౌడ్, బీఆర్ఎస్వీ ఉపాధ్యక్షుడు తుంగబాలు, బీఆర్ఎస్ నేతలు నరసింహారెడ్డి, ధర్మేందర్, సంజీవరావు పాల్గొన్నారు.