హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ) : వరంగల్లో నిర్వహించబోతున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. సబ్బండ వర్గాల ప్రజలు లక్షలాదిగా ఈ సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు. శనివారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో పార్టీ నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. ప్రతి గ్రామంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలతో కలిసి ఉదయాన్నే గులాబీ జెండాలతో కదలిరావాలని సూచించారు. సభకు వచ్చేవారు గులాబీ రంగు దుస్తులు ధరించి రావాలని కోరారు. సభకు వచ్చేందుకు ప్రజలు ఉత్సాహం చూపుతున్నారని, వారందరినీ సమన్వయం చేసుకుని అనుకున్న సమయానికి సభా ప్రాంగణానికి తరలిరావాలని సూచించారు.
సభకు తరలివచ్చే ప్రతి వాహనానికి అన్ని వైపులా గులాబీ జెండాలు కట్టాలని కేటీఆర్ సూచించారు. ఎండలు తీవ్రంగా ఉండటంతో ప్రతి బస్సులోనూ మంచినీళ్లు, మజ్జిగ ప్యాకెట్లతోపాటు భోజన వసతికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. సభకు వచ్చే వాహనాలతో ట్రాఫిక్ జామ్ కాకుండా ఇప్పటికే పంపించిన రూట్ మ్యాప్ ప్రకారం సభా స్థలికి చేరుకోవాలని పేర్కొన్నారు. తమకు సూచించిన స్థలాల్లోనే వాహనాలను పార్క్ చేయాలని సూచించారు. సభకు చేరుకున్న వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ మంచినీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు అందించేందుకు వలంటీర్లు సిద్ధంగా ఉంటారని కేటీఆర్ తెలిపారు.
‘2001లో ఉద్యమ పార్టీగా పురుడు పోసుకొని, పదేండ్లు అధికారంలో ఉండి తెలంగాణ ప్రగతికి బాటలు వేసి..17 నెలలుగా ప్రతిపక్ష పాత్రలో ప్రజా సమస్యలను ఎలుగెత్తి చూపిన బీఆర్ఎస్ నేటితో 24 ఏండ్లు పూర్తిచేసుకొని 25వ ఏట అడుగుపెడుతున్నది. ఈ సందర్భంలో ఎల్కతుర్తి వేదికగా చరిత్రలో నిలిచిపోయేలా రజతోత్సవ సభను నిర్వహిస్తాం’ అని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో 14 ఏండ్లు అలుపెరగని పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నామని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో రాష్ర్టాన్ని అన్నింటా ముందు నిలిపామని గుర్తుచేశారు. 2023 ఎన్నికల్లో అతి తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయినా బాధ్యతాయుత ప్రతిపక్షంగా, తెలంగాణ ప్రయోజనాలే పరమావధిగా అధికార కాంగ్రెస్ పార్టీపై అలుపెరగని పోరాటం చేస్తున్నామని చెప్పారు. లగచర్ల గిరిజన రైతులపై కాంగ్రెస్ దాష్టీకాలను యావత్ దేశం దృష్టికి తీసుకెళ్లడంలో విజయం సాధించామని, మూసీ, హైడ్రా బాధితులకు అండగా నిలవడంతో పాటు హెచ్సీయూ విద్యార్థుల పోరాటానికి బాసటగా నిలిచి 400 ఎకరాల పచ్చటి అడవిని కాపాడుకున్నామని వివరించారు. త్యాగాల పునాదులపై అవతరించిన తెలంగాణను ఖతం చేసేందుకు కుట్రలకు తెరలేపిన కాంగ్రెస్ను దీటుగా ఎదుర్కొంటూనే రజతోత్సవ పండుగకు సిద్ధమయ్యామని తెలిపారు. ప్రజలు లక్షలాదిగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.