హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): ‘బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సంబురాలను వివిధ ప్రపంచ దేశాల్లో జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నాం.. త్వరలో ఆస్ట్రేలియాలో సభ నిర్వహణకు అక్కడి ఎన్నారైలు ప్లాన్ చేస్తున్నారు’ అని బీఆర్ఎస్ ఎన్నారై గ్లోబల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల ఒక ప్రకటనలో తెలిపారు. యూకే, దక్షిణ ఆఫ్రికా, గల్ఫ్ తదితర దేశాల్లోనూ బీఆర్ఎస్ రజతోత్సవ సంబురాల నిర్వహణకు సన్నాహాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
అమెరికాలోని డాలస్లో విజయవంతంగా నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవాల స్ఫూర్తితో ఆస్ట్రేలియాలో సభ నిర్వహించేందుకు ఎన్నారైలు ముం దుకొచ్చారని తెలిపారు. ఇప్పటికే అక్కడ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలో సభ కోసం అక్కడి బీఆర్ఎస్ బృందంతో కలిసి మెల్బోర్న్లోని కొన్ని వేదికలను పరిశీలించామని, తనతోపాటు అక్కడి యూత్ విభాగం నేత సన్నీగౌడ్ మరికొందరు పాల్గొన్నారని తెలిపారు. ఇతర దేశాల్లో నిర్వహించే సభల తేదీలను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.