BRS Public Meeting | వరంగల్, ఏప్రిల్ 15(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. భారీ బహిరంగ సభల నిర్వహణలో రికార్డులున్న బీఆర్ఎస్.. ఎల్కతుర్తి సభను అదే స్థాయిలో నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నది. లక్షలాది మంది ప్రజలు, తెలంగాణవాదులు, బీఆర్ఎస్ శ్రేణులు, కేసీఆర్ అభిమానులు హాజరయ్యే రజతోత్సవ మహాసభ వేదిక నిర్మాణం మొదలైంది. 120 ఫీట్ల పొడవు, 80 ఫీట్ల వెడల్పుతో వేదిక ఏర్పాటవుతున్నది. వేదిక నిర్మాణం కోసం కంకర పనులు ప్రారంభమయ్యాయి. దాదాపు 50 వేల వాహనాల్లో లక్షలాది మంది ఈ సభకు వస్తారనే అంచనా ఉండటంతో అందుకు అనుగుణంగా 1,213 ఎకరాల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. 154 ఎకరాల్లో సభా ప్రాంగణం, 1,059 ఎకరాల్లో పార్కింగ్ వసతులు ఏర్పాటు చేస్తున్నారు.
మహాసభ ప్రాంగణం మొత్తం చదును చేశారు. సిద్దిపేట, వరంగల్, కరీంనగర్ నుంచి జాతీయ రహదారి జంక్షన్‌గా ఎల్కతుర్తి రజతోత్సవ సభకు అనువుగా ఉన్నది. రాష్ట్రంలోని ప్రతి జిల్లా, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి అనుసంధానమయ్యేలా ఎల్కతుర్తి నుంచి జాతీయ రహదారులు ఉన్నాయి. రజతోత్సవ సభ ఏర్పాట్లతో ఎల్కతుర్తి కొత్త కళను సంతరించుకున్నది. నెల రోజుల్లోనే గుర్తుపట్టలేనంతగా ఎల్కతుర్తిలోని ప్రధాన రహదారులు, అంతర్గత రోడ్లు అభివృద్ధి అయ్యాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాలు, సూచనలతో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు వొడితల సతీశ్‌కుమార్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, బీఆర్ఎస్ వరంగల్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి గ్యాదరి బాలమల్లు ఆధ్వర్యంలో మహాసభ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.
తెలంగాణ ప్రజల గుండె చప్పుడుగా నిలిచిన బీఆర్ఎస్ 25 ఏండ్ల ఉద్యమ, అభివృద్ధి, రాజకీయ ప్రస్థానాన్ని వివరిస్తూనే… రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తుపై భరోసానిచ్చేలా ఎల్కతుర్తిలో జరుగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ ఉంటుందని గులాబీ పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు. ఏడాదిన్నరగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో వారికి బీఆర్ఎస్ అండగా నిలుస్తుందని అంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తెలంగాణ, ముఖ్యంగా రైతులు, పేదలు ఆర్థికంగా సాధికారత వైపుగా అడుగులు వేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో ఏడాదిన్నరగా సంక్షేమ పథకాలు అమలు కాకపోవడంతో రాష్ట్ర పురోగతి మందగించింది. ముఖ్యంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఆగమవుతున్నది. ఈ నేపథ్యంలో అన్ని వర్గాలకు అండగా నిలిచేలా బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఉంటుందని గులాబీ పార్టీ నేతలు చెబుతున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా 2001 ఏప్రిల్‌లో ఆవిర్భవించిన బీఆర్ఎస్ అలుపెరుగని ఉద్యమంతో తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన విషయం విదితమే. 2014 నుంచి పదేండ్ల సుపరిపాలనతో తెలంగాణను బీఆర్ఎస్ దేశంలో అగ్రగామిగా నిలిపింది. రాష్ట్ర సాధన ఉద్యమం, 10 ఏండ్ల సుపరిపాలన కలయికగా ఏప్రిల్ 27న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ జరగనున్నది.