హనుమకొండ, ఏప్రిల్ 13 : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈనెల 27న జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు లక్షలాదిగా తరలివెళ్లి విజయవంతం చేద్దామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన హనుమకొండలోని పార్టీ కార్యాలయంలో వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని ముఖ్య కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ సభను విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతీ ఒకరిపై ఉన్నదని చెప్పారు.
సభను పండగ వాతావరణం తలపించేలా నిర్వహించాలని అన్నారు. భూముల రేట్లు పెంచి అందరిని అభివృద్ధి చేసింది కేసీఆర్ అయితే, ఆ భూముల రేట్లు మొత్తం పడిపోయేలా చేసి నాశనం చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వమేనని దుయ్యబట్టారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కేసీఆర్ ముందు చూపుతో తండాలను గ్రామపంచాయతీలు చేస్తే, ఈ ప్రభుత్వం కనీసం ఆ గ్రామపంచాయతీల బిల్లులు చెల్లించడానికి కూడా ముందుకు రావడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
రైతుబంధు ఎగ్గొట్టిన ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలని అన్నారు. కాంగ్రెస్ హామీలకు మోసపోయి ఓటు వేశామని ఇప్పటికే ప్రజలకు అర్ధమైందని తెలిపారు. అన్ని రకాలుగా నష్టపోయిన రైతులకు బీఆర్ఎస్ నాయకులు అండగా నిలువాలన్నారు. మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వ పాలన నుంచి ప్రజలను రక్షించాల్సిన అవసరం ఉన్నదని సూచించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని పిలుపునిచ్చారు.