KTR | మంచిర్యాల, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రవ్యాప్తంగా ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తూ ముందుకు వెళ్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు. పాదయాత్ర చేయాలి కానీ, అన్ని పటాకులు ఒకేసారి కాల్చొద్దని వ్యాఖ్యానించారు. తమకు ఇంకా రెండేండ్ల సమయం ఉన్నదని, వేగిర పడాల్సిన అవసరం లేదని చెప్పారు.
మొన్నటికి మొన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై హైకోర్టు ఓ సంచలన తీర్పు ఇచ్చిందని గుర్తుచేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ ప్రభుత్వం ఇస్తలేదని, తల్లిదండ్రుల నుంచి వసూలు చేసుకోవాలని చెప్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రేపటి నుంచి తల్లిదండ్రుల వెంట పడుతారని, ఆ సమస్యపై ఫోకస్ చేస్తామని తెలిపారు. ‘సింగరేణిలో ఎన్నో సమస్యలున్నాయి. మెడికల్ బోర్డు పెట్టడం లేదు. ఉద్యోగాలు ఇవ్వడం లేదు. వాటిపై కొట్లాడుతామ’ని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో సంక్షేమ శాఖలో గురుకుల పాఠశాలలకు సంబంధించి ఒకరిద్దరు కాదు, ఏకంగా 12 వేల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల నుంచి చిన్నచిన్న కాంట్రాక్టర్లను తయారు చేశామని వివరించారు.
కాంగ్రెస్ సర్కార్ జీవో-17 తెచ్చి చిన్న కాంట్రాక్టర్లను పక్కనపెట్టి మొత్తం కార్పొరేట్లకు అప్పగించాలని చూస్తున్నదని మండిపడ్డారు. ఇంకా ఇలాంటి సమస్యలు వంద ఉన్నాయని, వాటిపై పోరాటాలు చేస్తామని స్పష్టంచేశారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో జిల్లా పార్టీ అధ్యక్షుడు, బాల్క సుమన్ నివాసంలో మీడియాతో కేటీఆర్ చిట్‌చాట్ చేశారు. నియోజకవర్గాల పునర్విభజనతో రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలు పెరుగుతాయని, దీంతో బీఆర్ఎస్కు భవిష్యత్తులో అవకాశాలు మరిన్ని పెరుగుతాయని చెప్పారు.
పార్టీ లీడర్లందరికీ పోటీ చేసే చాన్స్ వస్తుందని పేర్కొన్నారు. పార్లమెంట్లో దక్షిణాది రాష్ర్టాలకు అన్యాయం జరుగుతుందని ముందుగా డీలిమిటేషన్‌పై మాట్లాడిందే కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీయేనని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తుచేశారు. అసెంబ్లీ, పార్లమెంట్లో 50% స్థానాలు పెరిగితే బీఆర్ఎస్కు లాభమే తప్ప, ఎలాంటి నష్టమూ లేదని స్పష్టంచేశారు. తమకు ఎలాంటి అభ్యంతరమూ లేదని స్పష్టం చేశారు.
‘ఒంటరిగానే ఎన్నికల్లో గెలిచే సత్తా బీఆర్ఎస్కు ఉన్నది. 2014లో ఒంటరిగానే గెలిచినం. 2018లోనూ ఒంటరిగానే గెలిచినం. 2023లో అతితక్కువ తేడాతో మాత్రమే ఓడిపోయినం. అందువల్ల ఎప్పుడైనా ఒంటరిగా గెలిచే సత్తా బీఆర్ఎస్కు ఉన్నది. అదీకాకుండా, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో పెట్టుకున్న పొత్తులు బీఆర్ఎస్కు పెద్దగా కలసిరాలేదనే అభిప్రాయం ఉన్నది. ఒంటరిగా పోటీ చేసినప్పుడే పార్టీ బలమైన ప్రదర్శన చేయగలిగింది. మంచి ఫలితాలను చూపించగలిగింది. అందువల్ల భవిష్యత్తులో అప్పటి పరిస్థితులు, సందర్భాల మేరకు పొత్తులపై నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
‘రాష్ట్రవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో నాయకత్వాన్ని మార్చాల్సి వస్తే తప్పకుండా మారుస్తాం. గోదావరి పరీవాహక ప్రాంతమనే కాదు.. ఎవరు ఎక్కడ పోటీ చేస్తే గెలుస్తారో వాళ్లను అక్కడ పోటీ చేయిస్తాం. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తాం. గత ఎన్నికల్లో 12 సీట్లు మారిస్తే 10 గెలిచాం. దీని అర్థం కేసీఆర్‌పై వ్యతిరేకతేదీ లేదనే’ అని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, మండల స్థాయి నాయకత్వాన్ని సమన్వయం చేసుకోవడంపై ఇకపై ప్రత్యేక దృష్టి సారిస్తామని కేటీఆర్ తెలిపారు.
కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి లక్షలాది మంది కార్మికులు గల్ఫ్ దేశాల్లో ఉన్నప్పటికీ, వారి ప్రయోజనాల కోసం సరైన ’గల్ఫ్ పాలసీ’ని తీసుకొనిరాలేకపోయామని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమం, కొన్ని రంగాలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడంతో కొన్ని అంశాలపై దృష్టి తక్కువైపోయిందని చెప్పారు. ఈ సారి అలా కాకుండా ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. బీజేపీ తీరుపై కేటీఆర్ మండిపడ్డారు.. కరీంనగర్ కార్పొరేషన్ గెలిచిన తర్వాత నిధులు తెస్తామని చెప్పిన నాయకులు మాట నిలబెట్టుకోలేదని, దేశంలో అభివృద్ధి అంతా ఒకే నాయకుడు మోదీ కారణంగానే జరిగిందనే భావనను ప్రజలపై రుద్దుతున్నారని విమర్శించారు. మోదీ చేసిందేమిటో ప్రజల ముందు ఐదు నిమిషాలు అనర్గళంగా చెప్పగలరా? అని సవాల్ విసిరారు.
‘కాంగ్రెస్ దుష్టపాలనతో రాష్ట్ర ప్రజలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నరు. అనేక సమస్యలతో సతమతమవుతున్నరు. దగాపడిన వివిధ వర్గాలకు భరోసా కల్పించేందుకు పాదయాత్ర రూపంలో ప్రజల్లోకి వెళ్లాలనే ఆలోచన ఉన్నది. 2027లో పాదయాత్ర ద్వారా ప్రజల ముందుకు వెళ్లాలని, వారి కష్టసుఖాలు తెలుసుకోవాలని, భరోసా ఇవ్వాలనే ఆలోచనైతే ఉన్నది. పార్టీ నాయకత్వంతో చర్చించిన తర్వాత, అందరి అభిప్రాయాలూ తీసుకొన్నాకే ఆ విషయంలో తుది నిర్ణయం ఉంటుంది’ అని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ పార్టీగా, పదేండ్లు అధికార పార్టీగా, గత రెండున్నరేండ్లుగా ప్రతిపక్ష పార్టీగా మూడు పాత్రలను విజయవంతంగా నిర్వహించామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ను బలోపేతం చేసే దిశగా పార్టీ చేపట్టనున్న కార్యాచరణను కూడా కేటీఆర్ వివరించారు.
పార్టీని బలోపేతం చేసే దిశగా మే, జూన్ నెలల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని, కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి బీఆర్ఎస్లో చేరడం వల్ల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పార్టీ బలం మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. పార్టీ నిర్మాణంపై మాట్లాడుతూ.. కార్యకర్తలతో నేరుగా కనెక్ట్ కావాల్సిన అవసరం ఉన్నదని, ఈ విషయంలో తెలుగుదేశం లాంటి ఇతర పార్టీల్లో ఉన్న సంప్రదాయాన్ని గుర్తిస్తూ, అక్కడి మంచి లక్షణాలను నేర్చుకుంటామని చెప్పారు. బీఆర్ఎస్లో ఆధిపత్య పోరులేదని, అందరం కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తున్నామని కేటీఆర్ స్పష్టంచేశారు. తన వయసుకు మించిన పదవులను పార్టీలో పొందానని, కొత్తగా ఎలాంటి ఆశలు లేవని చెప్పారు. కేసీఆర్ ఏ బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యతను ఒక పార్టీ సైనికుడిగా నిర్వహిస్తానని స్పష్టంచేశారు. తాను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాత్రమేనని, కేసీఆర్ ఏ పని అప్పజెప్తే ఆ పని చేయడమే తన కర్తవ్యమని పేర్కొన్నారు. పార్టీలో పార్టీ జనరల్ సెక్రెటరీ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు ఎంత ప్రాధాన్యం ఉన్నదో తనకు అంతే ఉన్నదని, పార్టీలో కేసీఆర్ నిర్ణయమే ఫైనల్ అని చెప్పారు.
ప్రాణహిత ప్రాజెక్టు విషయంలో మహారాష్ట్ర నుంచి అభ్యంతరాలు ఉన్న మాట వాస్తవమని కేటీఆర్ తెలిపారు. తమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ కట్టడం కుదరదని.. కాకపోతే ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూర్ నియోజకవర్గాల్లో సాగునీరు అందించేందుకు ప్రాణహిత, గోదావరి జలాలను ఎలా వాడుకోవచ్చో అలా వాడుకోవడంపై ఆలోచన చేయాలని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం వస్తే రానున్న రోజుల్లో కచ్చితంగా ఇది చేసి చూపిస్తామని స్పష్టంచేశారు. చెన్నూరు ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో రైతుబంధు, రైతు రుణమాఫీ సక్రమంగా అమలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ అందక విద్యార్థులు కష్టాలు పడుతున్నారని, ప్రస్తుత ముఖ్యమంత్రిపై ప్రజల్లో విశ్వాసం క్రమంగా తగ్గుతున్నదని వ్యాఖ్యానించారు. జైలుకు వెళ్తేనే సీఎం అవుతారనేది ఒక భ్రమ మాత్రమేనని, నలభై ఏండ్ల క్రితం అలాంటి రాజకీయ సంస్కృతి లేదని చెప్పారు. సింగరేణి సమస్యలపై మాట్లాడుతూ, ఓపెన్ కాస్ట్ గనుల విస్తరణతో కార్మికుల సంఖ్య తగ్గుతున్నదని, ప్రస్తుత ప్రభుత్వంపై కార్మికుల్లో తీవ్ర అసంతృప్తి ఉన్నదని కేటీఆర్ పేర్కొన్నారు. ఏఐటీయూసీ నేతలు తనను కలిసిన విషయాన్ని గుర్తు చేస్తూ, వారి సమస్యలపై చర్చించేందుకు హైదరాబాద్‌కు రావాలని ఆహ్వానించానని తెలిపారు. టీబీజీకేఎస్ కార్మిక సంఘాన్ని త్వరలోనే పునర్నిర్మించి, కొత్త నాయకత్వానికి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు.
తెలంగాణను కాపాడగల ఏకైక నాయకత్వం కేసీఆర్‌ది అని కేటీఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ‘చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించింది కేసీఆర్ నాయకత్వమే. పదేండ్లలో ఎంతో అభివృద్ధి చెందిన రాష్ర్టాన్ని తయారు చేశామని, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రెండేండ్లలోనే దెబ్బతీసిందని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో సింగరేణి సహా అన్ని స్థాయిల్లో బీఆర్ఎస్ ఘనవిజయం సాధిస్తుందని, ప్రజలు కచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిరస్కరిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ‘బీఆర్ఎస్ పేరును మళ్లీ టీఆర్ఎస్గా మార్చాలని అనేక వర్గాల నుంచి, పలువురు పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి సూచనలు, సలహాలు వస్తున్నయ్. ఈ విషయంలో పార్టీ పెద్దలతోనూ, ముఖ్యనేతలతోనూ సమాలోచనలు జరుపుతాం. అన్నివిధాలుగా ఆలోచించిన తర్వాతనే దీనిపై ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నరు. అనేక సమస్యలతో సతమతమవుతున్నరు. దగాపడిన వివిధ వర్గాలకు భరోసా కల్పించేందుకు పాదయాత్ర రూపంలో ప్రజల్లోకి వెళ్లాలనే ఆలోచన ఉన్నది. 2027లో పాదయాత్ర ద్వారా ప్రజల ముందుకు వెళ్లాలని, వారి కష్టసుఖాలు తెలుసుకోవాలని, భరోసా ఇవ్వాలనే ఆలోచనైతే ఉన్నది. పార్టీ నాయకత్వంతో చర్చించిన తర్వాత, అందరి అభిప్రాయాలూ తీసుకొన్నాకే
ఆ విషయంలో తుది నిర్ణయం ఉంటుంది’
-కేటీఆర్