ఎల్లారెడ్డిపేట, జూలై 23: తన మరణానికి ప్రధానినరేంద్రమోదీ కారణం అంటూ ఎస్ఐఆర్ ఫారమ్‌పై సూసైడ్ నోట్ రాసి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం..ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లికి చెందిన పిట్ల బాలయ్య-భారతవ్వ దంపతులకు కొడుకు వంశీ(25), కూతురు పూజ ఉన్నారు. ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగాలేని కారణంగా డిగ్రీ మొదటి సంవత్సరంలోనే వంశీ చదువు ఆపేశాడు.
పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం రాత్రి 10 గంటల సమయంలో ఇంట్లో తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకొని పడుకున్నాడు. గురువారం ఉదయం తల్లిదండ్రులు తలుపు తీసి చూసేసరికి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అప్పటికే బీఎల్వో ఇచ్చిన ఎస్ఐఆర్ ఫారమ్‌లో సూసైడ్ లెటర్ రాసి రాత్రి 11.30 గంటలకు తన వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకున్నాడు. సదరు లేఖలో తన చావుకు కారణం కుటుంబం కాదని, కేవలం నరేంద్రమోదీనేనని పేర్కొన్నాడు.
ఎవరినీ ఇబ్బందులు పెట్టకుండా తన దహన సంస్కారాలు ఆనవాయితీగా జరిపించాలని రాశాడు. తన ఆందోళనను అర్థం చేసుకుంటారని, చావాలంటే భయమైతున్నదని అందులో పేర్కొన్నాడు. అలాగే, అంతకు ముందు బ్లేడ్‌తో చేతి మణికట్టుపై, గొంతుపై కోసుకునే ప్రయత్నం చేసుకున్నట్టు తెలుస్తున్నది. చివరకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. లేఖ చివర్లో ఇట్లు భారత పౌరుడు, వంశీ రాయల్, జైహింద్, థాంక్యూ గవర్నమెంట్ అంటూ ముగించాడు.
ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఉద్యమ తీరును వంశీ ఫోన్, టీవీల్లో చూస్తూ భావోద్వేగానికి గురయ్యాడా? అనే అనుమానాలు ఉన్నాయి. కాగా, వంశీ ఉపయోగించిన ఫోన్ గదిలో లభించలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. కాగా, వంశీ తన తల్లితో బుధవారం సాయంత్రం గొడవ పెట్టుకున్నట్టు సమాచారం. ఇదే విషయమై తన కుమారుడి మృతికి కారణాలపై దర్యాప్తు చేయాలని తండ్రి బాలయ్య ఫిర్యాదు చేసినట్టు ఎస్ఐ రాహుల్‌రెడ్డి తెలిపారు.
పిట్ల వంశీది ముమ్మాటికీ కేంద్ర ప్రభుత్వ హత్యే అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య విమర్శించారు. అంతకుముందు వంశీ మృతదేహాన్ని చూసేందుకు వచ్చిన తనను పోలీసులు అడ్డుకోవడంతో వారితో వాగ్వాదానికి దిగారు. . వంశీ మృతిపై కేటీఆర్ ఆరా తీసినట్టు తెలిపారు.
రాజన్న సిరిసిల్ల, జూలై 23 (నమస్తే తెలంగాణ): తన చావుకు మోదీని కారణమంటూ వంశీ ఆత్మహత్య చేసుకోగా, నిరసనగా బీఆర్ఎస్ నేతలతో పాటు స్థానికులు ర్యాలీ చేపట్టారు. ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లిలో ఆందోళన చేశారు. ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు.
ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బీజే పీ నాయకులు జీర్ణించుకోలేకపోయారు. ర్యాలీకి అనుమతి ఎలా ఇస్తారని ఓ కేంద్ర మంత్రి నేరుగా సిరిసిల్ల పోలీసులు ఉన్నతాధికారులకు ఫోన్ చేసినట్టు సమాచారం. వెంటనే సదరు పోలీసులపై చర్యలు తీసుకోవాలని సీరియస్ అయినట్టు సమాచారం. దీంతో ఎల్లారెడ్డిపేట ఎస్ఐ రాహుల్‌రెడ్డిని ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేశారు.
మరికొంత మందికి కూడా పోలీసులు నోటీసులు జారీచేసి వివరణ కోరినట్టుగా తెలుస్తున్నది. ఒకటి, రెండు రోజుల్లో వారిపై కూడా చర్యలు ఉంటాయని తెలుస్తున్నది. ర్యాలీ చేస్తున్న సమయంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా తాము చర్యలు తీసుకుంటే.. తమపైనే వేటు వేయడం ఏమిటని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ అంశంలో కేంద్ర మంత్రి చెప్పిన వెంటనే.. పోలీస్ ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారా..? ..రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో కేంద్ర మంత్రికి సహకరించిందా..? అన్న అనుమానాలు తలెత్తుతుతున్నాయి.