తిమ్మాపూర్, జూలై 23: మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పీఏ వంగాల మురళీధర్‌రెడ్డి వేధిస్తున్నాడంటూ ఈనెల 14న ఆత్మహత్యాయత్నం చేసిన బేతెల్లి రాజేందర్‌రెడ్డి బుధవారం అర్ధరాత్రి దవాఖానలో మృతిచెందాడు. దీంతో గుండ్లపల్లితో పాటు కరీంనగర్లో గురువారం ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ సమత భర్త రాజేందర్‌రెడ్డి (44)కి గ్రామంలోనే సిమెంట్ ఇటుకల షాప్ ఉంది. ఈ నెల 13న మధ్యాహ్నం ఆయన షాప్ వద్ద సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం వడ్లూరు గ్రామానికి చెందిన పైడిపల్లి మల్లేశం, బిగుళ్ల శ్రవణ్ మద్యం తాగుతుండగా, అక్కడి నుంచి వెళ్లిపోవాలని రాజేందర్‌రెడ్డి కోరాడు. దీంతో ఘర్షణ చెలరేగి రాజేందర్‌రెడ్డి ఫోన్‌ను పగులగొట్టారు.
అక్కడే ఉన్న మహ్మద్ సాదిక్ ముగ్గురిని సముదాయించి, వాళ్లతో సెల్‌ఫోన్ కొనిస్తామని చెప్పించాడు. మరుసటి రోజు మహ్మద్ సాదిక్, పైడిపల్లి మల్లేశం, బిగుళ్ల శ్రవణ్‌తో కలిసి ఎమ్మెల్యే పీఏ మురళీధర్‌రెడ్డి గన్నేరువరం పోలీస్ స్టేషన్లో రాజేందర్‌రెడ్డిపై ఫిర్యాదు చేసి, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయించారు. గ్రామంలో అన్యాయాలపై ప్రశ్నిస్తున్న కారణంగానే ఎమ్మెల్యే పీఏ మురళీధర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి తనపై కేసు నమోదు చేయించారని కుటుంబసభ్యులకు రాజేందర్‌రెడ్డి చె ప్పుకొని బాధపడ్డాడు. ఆ తర్వాత తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నాడు. తనకు అన్యాయం చేస్తున్నారంటూ వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకొని నిప్పంటించుకున్నాడు.
వెంటనే స్థానికులు కరీంనగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఆ తర్వాత ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్లగా, చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి మృతిచెందాడు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. రాజేందర్‌రెడ్డి మృతి విషయం తెలుసుకున్న గుండ్లపల్లి గ్రామస్తులు, బంధువులు పెద్ద సంఖ్యలో దవాఖాన వద్దకు చేరుకున్నారు. ఎమ్మెల్యే పీఏతోపాటు మరో నలుగురిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
పోస్టుమార్టం నిర్వహించకుండా అడ్డుకొని ఆందోళనకు దిగారు. కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్‌కుమార్ కుటుంబసభ్యులకు నచ్చజెప్పి ఫిర్యాదు తీసుకున్నారు. రాజేందర్‌రెడ్డి భార్య సమత ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. వంగాల మురళీధర్‌రెడ్డి, వంగాల రవీందర్‌రెడ్డి, వడ్లూరుకు చెందిన మహ్మద్ సాదిక్, పైడిమల్ల మల్లేశం, బిగుళ్ల శ్రవణ్‌పై ఎల్ఎండీ పోలీస్‌స్టేషన్‌లో బీఎన్ఎస్ సెక్షన్ 108కింద కేసు నమోదు చేశారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలంటూ మరోసారి బంధువులు దవాఖాన ఎదుట రోడ్డుపై ధర్నాకు దిగారు. అరెస్ట్ చేస్తామని ఏసీపీ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. రాజేందర్‌రెడ్డి మృతదేహాన్ని అంబులెన్సులో గుండ్లపల్లికి తరలించారు.
రాజేందర్‌రెడ్డి స్వగ్రామం గుండ్లపల్లి వద్ద ఉద్రిక్తత నెలకొన్నది. రాజేందర్‌రెడ్డి మృతదేహాన్ని ఎస్కార్ట్ మధ్యన గుండ్లపల్లికి తరలించారు. ఇదే సమయంలో కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్తులు రాజీవ్ రహదారిని దిగ్బంధించారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పీఏ మురళీధర్‌రెడ్డి ఇంటిపై దాడికి యత్నించారు. పోలీసులు వారిని చెదరగొట్టారు. అనంతరం పోలీస్ పహారా మధ్యన రాత్రి సమయంలో రాజేందర్‌రెడ్డికి అంత్యక్రియలు పూర్తి చేశారు.
మానకొండూర్ ఎమ్మెల్యే పీఏ మురళీధర్‌రెడ్డి వేధింపుల కారణంగానే తన భర్త రాజేందర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని బేతెల్లి సమత రోదించింది. పీఏ మురళీధర్‌రెడ్డితోపాటు నిందితులను అరెస్ట్ చేయకపోతే నా బిడ్డ, కొడుకుతో కలిసి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ఎదుట పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించింది.
రాజేందర్రెడ్డిది హత్యేనని మాజీ ఎమ్మెల్యే రసమ యి బాలకిషన్ ధ్వజమెత్తారు. అధికార పార్టీ ఎమ్మెల్యే పీఏను ప్రశ్నించడంతోనే రాజేందర్‌రెడ్డిని వేధించారని మండిపడ్డారు. బాధిత కుటుంబానికి న్యాయం చేసేవరకూ బీఆర్ఎస్ తరఫున అండగా ఉంటామని స్పష్టంచేశారు. ఈ మేరకు అమెరికాలో ఉన్న ఆయన ఒక వీడి యో రిలీజ్ చేశారు. రాజేందర్‌రెడ్డి మరణం బాధాకరమని విచారం వ్యక్తంచేశారు. పీఏ వేధింపులపై ఎమ్మెల్యేకు చెప్పుకొనేందుకు వెళ్తే కనీసం స్పందించకపోవడంతోనే పెట్రో ల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్టు పేర్కొన్నారు. రాజేందర్‌రెడ్డి మృతికి కారకులను కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.